Anupam Kher: హెయిర్ స్టైల్ రాజ్యమేలుతోన్న రోజుల్లో బట్టతలతో...
ABN, Publish Date - May 28 , 2024 | 08:05 PM
అనుపమ్ ఖేర్ (Anupam Kher) పరిచయం అక్కర్లేని బాలీవుడ్ నటుడు. 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో 540కిపైగా చిత్రాల్లో విభిన్న పాత్రలతో అలరించారు.
అనుపమ్ ఖేర్ (Anupam Kher) పరిచయం అక్కర్లేని బాలీవుడ్ నటుడు. 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో 540కిపైగా చిత్రాల్లో విభిన్న పాత్రలతో అలరించారు. కొత్త సినిమా ‘ఛోటా భీమ్ అండ్ ది కర్స్ ఆఫ్ దమయాన్’ (Chhota Bheem and the Curse of Damyaan) ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్ బిగినింగ్ డేస్‌ను గుర్తుచేసుకున్నారు. ‘‘సినీ పరిశ్రమలో ప్రతిభ కంటే హెయిర్ స్టైల్ రాజ్యమేలుతోన్న సమయంలో నేను నటుడిని కావాలనుకున్నా. నేను ఈ ముంబై వచ్చినప్పుడు బట్టతలతో సన్నగా ఉండేవాడిని. టాలెంట్ మాత్రమే ముఖ్యమని నమ్మాను కాబట్టి 28 ఏళ్ల వయసులోనే 65 ఏళ్ల వ్యక్తిగా నటించా. నేను నటించే ప్రతీ పాత్రా వైవిధ్యంగా ఉండాలని కోరుకుంటా. అందుకే ఇన్నేళ్లపాటు ఇండస్ట్రీలో ఉన్నానని భావిస్తున్నా. కెరీర్ ప్రారంభంలో ఆర్థికంగా సమస్యలు చుట్టుముట్టాయి. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై పడుకునేవాణ్ని. నాకు పని చేేస అవకాశం ఇవ్వమని తప్ప భగవంతుడిని మరేదీ కోరలేదు. నాకు డ్యాన్స్ చేయడం రాదు. నా యాక్టింగ్‌లోనే డ్యాన్స్ ఉందని అనుకుంటున్నా’’ అని అన్నారు. 1987లో వచ్చిన ‘త్రిమూర్తులు’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. చాలా గ్యాప్ తర్వాత ‘కార్తికేయ 2’, ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాల్లో కీలక పాత్రలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు.