Akshay Kumar: అప్పుడలా అన్నారు.. ఇప్పుడిలా అంటున్నారు!
ABN, Publish Date - Jul 12 , 2024 | 08:13 PM
"నా కెరీర్‌లో ఎదురైన పరాజయాలను చూసి కొందరు సంతోషపడుతున్నారు. ఇండస్ట్రీలో ఇలాంటి రాజకీయాలు చూస్తే బాధగా ఉంది’’ అని బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ అన్నారు.
"నా కెరీర్‌లో ఎదురైన పరాజయాలను చూసి కొందరు సంతోషపడుతున్నారు. ఇండస్ట్రీలో ఇలాంటి రాజకీయాలు చూస్తే బాధగా ఉంది’’ అని బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ అన్నారు. గడిచిన రెండు మూడేళ్లల్లో ఆయన నటించిన పది చిత్రాల్లో రెండు మాత్రమే విజయం సాధించాయి. తాజాగా ఆయన హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘సర్ఫిరా’. ‘సూరారైపోట్రు’ (ఆకాశం నీహద్దురా) చిత్రానికిది రీమేక్. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందర్భంగా అక్షయ్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.
‘‘కొందరు వ్యక్తులు నా సినిమాలు ఫెయిల్ అయితే చూసి తెగ సంబరపడిపోతున్నారు. అలా చూడటం వాళ్లకు ఇష్టం. నేను నా శ్రమ, కష్టాన్ని నమ్ముకున్నా. అయితే, ఇలాంటి వాటిని తప్పకుండా ఖండించాలి. నేను ఇండస్ట్రీకి వచ్చి 34 ఏళ్లు అవుతోంది. ఇప్పటివరకు ఇతరుల పట్ల నేనెప్పుడూ చెడుగా మాట్లాడలేదు. ఇతరుల పేరును కించపరిచి, వాళ్లను కిందలాగే హక్కు ఎవరికీ లేదన్నది నా అభిప్రాయం.
అసత్య వార్తలు ఎవరు పుట్టిస్తున్నారో తెలుసు..
నా సినిమాల విషయంలో ఎవరు ఇలాంటి వదంతులు వ్యాప్తి చేస్తున్నారో తెలుసు. అదే సమయంలో ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయి. ఇండస్ట్రీలో ఉన్నవాళ్లే ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం, వదంతులు వ్యాప్తి చేయడం సరికాదు. నేను సినిమా కోసం కచ్చితంగా ఎనిమిది గంటలు పనిచేస్తా. నా వ్యక్తిగత జీవితం కూడా ముఖ్యమే కదా. ఇలాంటి అసత్య వార్తలు ఎవరు పుట్టిస్తున్నారో పూర్తి వివరాల్లోకి వెళ్లాలనుకోవడం లేదు. ఎక్కడో ఒకచోట ఇది మొదలైంది. నేనంటే గిట్టని వాళ్లు దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. ఒకట్రెండు సినిమాల విషయంలో జరిగిన దాన్ని అన్నింటికీ ఆపాదించి చూపుతున్నారు.
అప్పుడలా అన్నారు.. ఇప్పుడిలా అంటున్నారు..
‘‘ఇలా మాట్లాడిన వాళ్లే ఒకప్పుడు నా గురించి ఏమనేవారో తెలుసా? ‘అక్షయ్ సినిమాలు నెలల తరబడి షూటింగ్స్ జరగవు. ఆయన సమయపాలన పాటిస్తారు’ అని చెప్పేవాళ్లు. ఒకానొక సమయంలో నేను వరుసగా 17 సినిమాలకు సంబంధించిన షూటింగ్స్‌లో పాల్గొన్నాను. ఎనిమిది నెలల సమయంలో అవి విడుదలయ్యాయి. అందుకే నాతో సినిమాలు తీసేందుకు దర్శక-నిర్మాతలె ఇంట్రెస్ట్ చూపించేవారు. ఇప్పుడు సినిమాలు సరిగా ఆడకపోయే సరికి, నేను సరిగా సమయం ఇవ్వట్లేదని అంటున్నారు’’
పక్కనవారిని కిందకు లాగకండి..
‘‘ప్రజలకు నేను ఒక సలహా ఇవ్వాలనుకుంటున్నా. మీ పక్కనున్న వారిని కిందకు లాగకండి. సహజంగా రాజకీయాల్లో ఇలాంటివి చూశా. ఇప్పుడు చిత్ర పరిశ్రమలోనూ చూస్తున్నా. ఒక హీరో ఇంకో హీరోను, ఒక దర్శకుడు మరో దర్శకుడిపై.. అలాగే నిర్మాతలు ఒకరిపై ఒకరు బురద జల్లు కుంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇలాంటి వాటి వల్ల శక్తిసామర్థ్యాలు వృథా కావటం తప్ప మరొకటి లేదు’’ అని అక్షయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు.