Maidaan: మన హైదరాబాదీ బయోగ్రఫీ.. అజయ్ దేవగణ్ స్పోర్ట్స్, ఎమోషనల్ డ్రామా ‘మైదాన్’ ఫైనల్ ట్రైలర్ విడుదల
ABN, Publish Date - Apr 02 , 2024 | 09:29 PM
తన లైఫ్ లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న లెజండరీ కోచ్ హైదరాబాద్ కు చెందిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం మైదాన్.. ఈ రోజు ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఏడాదికి కనీసం ఒక్క హిట్ అయినా లేకుండా ఆయన కెరీర్ లేదు. చాలా తక్కువ మంది నటులకు మాత్రమే సాధ్యమైన ఈ అరుదైన ఘనత.. ప్రస్తుత సినిమా హీరోల్లో అజయ్ దేవ్‌గణ్ కు మాత్రమే సొంతం. ఈ రోజు (మంగళవారం) అజయ్‌దేవ్‌గణ్ (Ajay Devgn) పుట్టినరోజు సందర్భంగా తన తదుపరి చిత్రం మైదాన్ (Maidaan) ఫైనల్ ట్రైలర్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తన లైఫ్ లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న లెజండరీ కోచ్ ఎస్.అబ్దుల్ రహీమ్, ఆయన ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ గురించి ఈ ట్రైలర్ మరింత అద్భుతంగా ఆవిష్కరించింది. ఫుట్‌బాల్ రంగంలో మన ఇండియా టీమ్... చరిత్రను ఎలా తిరగరాసిందో చెప్పే చిత్రమే మైదాన్.
ప్రతి ఒక్కరూ అనుసరించాల్సిన అంకిత భావం, అచంచలమైన విశ్వాసం, ఫుట్‌బాల్ రంగంలో వెలుగులు చాటాలనే తపనతో ముందడుగేసి, రాణించి మన దేశానికి గర్వకారణంగా నిలిచిన లెజండరీ కోచ్ హైదరాబాద్ కు చెందిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అమిత్ రవీంద్రనాథ్ శర్మ ఈ మైదాన్ (Maidaan) సినిమాకు దర్శకత్వం వహించారు.
ఆదర్శవంతమైన ఈ మైదాన్ (Maidaan) స్పోర్ట్స్ బయోపిక్‌లో ప్రియమణి, గజ్‌రాయ్ రావు, బెంగాలీ యాక్టర్ రుద్రనీల్ ఘోష్ కీలక పాత్రల్లో నటించారు. జీ స్టూడియోస్, బోనీ కపూర్, అరుణవ జోయ్ సేన్‌గుప్తా, ఆకాష్ చావ్లా నిర్మించారు. సైవిన్ ఖుద్రాస్, రితీష్ షా స్క్రీన్ ప్లే, డైలాగులు రాశారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. మనోజ్ ముంతషిర్ శుక్లా లిరిక్స్ రాశారు. ఈద్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఐమ్యాక్స్ వెర్షన్ కూడా అదే రోజున విడుదల కానుంది.