Oscars 2025: భారత్ అఫీషియల్ ఎంట్రీ.. ‘లా పట్టా లేడీస్’! ముచ్చటగా మూడో సారి అమీర్ ఖాన్ సినిమా
ABN, Publish Date - Sep 23 , 2024 | 03:43 PM
ఆస్కార్ 2025 ఉత్తమ విదేశ చిత్రాల జాబితాలో మన దేశం నుంచి అఫీసియల్ ఎంట్రీగా తెలుగమ్మాయి, అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లా పట్టా లేడీస్’ చిత్రాన్ని ఎంపిక చేశారు.
అనుకున్నదే జరిగింది.. ఆస్కార్ 2025 ఉత్తమ విదేశ చిత్రాల జాబితాలో మన దేశం నుంచి అఫీషియల్ ఎంట్రీగా తెలుగమ్మాయి, అమీర్ ఖాన్ (Aamir Khan) మాజీ భార్య కిరణ్ రావు (Kiran Rao) దర్శకత్వం వహించిన ‘లా పట్టా లేడీస్’ (Laa patta ladies) చిత్రాన్ని ఎంపిక చేస్తూ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ జహ్ను బారువా సోమవారం అధికారికంగా ప్రకటించారు. 2025, మార్చి 2న ఈ అవార్డుల వేడుక అమెరికాలోని లాస్ ఎంజల్స్‌లో జరుగనుంది. అయితే ఎన్నడు లేనంతగా ఈ సంవత్సరం అస్కార్స్ నామినేషన్ల కోసం మన దేశం నుంచి తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, మరాఠీ భాషలకు చెందిన 29 చిత్రాలను 13 మందితో కూడిన కమిటీ సభ్యులు షార్ట్‌లిస్ట్ చేయగా అందులో ‘లాపతా లేడీస్’ (Laa patta ladies) సినిమాకే అందరు మొగ్గు చూపారు.
అయితే.. తెలుగు నుంచి ప్రభాస్ కల్కి, ప్రశాంత్ వర్మ హనుమాన్, అజయ్ భూపతి మంగళవారం, తమిళం నుంచి తంగలాన్, వాజై, కొట్టుకాళి, మహారాజ, జమా, జిగర్తాండ డబల్ ఎక్స్, మలయాళం నుంచి ఊళ్ళోజుక్కు, ఆడు జీవితం, ఆల్ వీ ఇమాజిన్ యాస్ లైట్, ఆట్టం, మరాఠీ నుంచి స్వరగంధర్వ సుధీర్ ఫడకే, ఘాట్, ఘరత్ గణపతి హిందీ నుంచి కిల్, ఆర్టికల్ 370, షామ్ బహదూర్, గుడ్ లక్, జోరం, ఆనిమల్, శ్రీకాంత్, వీర్ సవార్కర్, చోటా భృమ్ అండ్ ది కర్స్ ఆఫ్ దమ్యం, లా పట్టా లేడిస్, చందు చాంఫియన్ వంటి సినిమాలు భారత్ నుంచి పంపించే సినిమాల షార్ట్ లిస్టులో చోటు దక్కించుకోగా చివరకు బాలీవుడ్ నుంచి లా పట్టా లేడిస్ ఆస్కార్స్‌కు నామినేట్ అయింది.
ఇదిలాఉండగా.. ముందు నుంచి అస్కార్స్‌కు పంపించే సినిమాలో ప్రధమ స్థానంలో ఉంటుందనుకున్న మలయాళ చిత్రం 'ఆల్ వీ ఇమాజిన్ యాస్ లైట్' సినిమాకు నిరాశే మిగిలింది. కానీ ఇండియా, నెదర్లాండ్స్, లక్షంబర్గ్, ఇటలీ దేశాల ప్రోడక్షన్ కంపెనీలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ఫ్రాన్స్ దేశం తమ అస్కార్స్ అధికారిక ఎంట్రీ చిత్రంగా సెలక్ట్ చేయడం గమనార్హం. పాయల్ కపాడియా ఈ మూవీకి దర్శకత్వం వహించగా మలయాళం, హిందీ, మరాఠీ భాషలలో రూపొందించారు. ఇప్పటికే ఈ చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో రెండు ఆవార్డులు గెలుచుకుని చరిత్ర సృష్టించగా ఇంకా సిడ్నీ, చికాగో ఫిలిం ఫెస్టివల్స్‌కు కూడా నామినేట్ అవడం అరుదైన విషయం.
ఇక లాపతా లేడీస్ (Laa patta ladies) సినిమా విషయానికి వస్తే.. అమీర్ ఖాన్ నిర్మాణంలో ఆయన మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించారు. మార్చి 1, 2023న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా 9.5 రేటింగ్‌తో మంచి విజయాన్ని సాధించింది.
అప్పుడే కొత్తగా పెళ్లి చేసుకున్న దీపక్ భార్యతో కలిసి రైలులో తమ గ్రామానికి బయలుదేరుతారు. అయితే తమ స్టేషన్‌లో రైలు దిగుతూ అనుకోకుండా తన భార్య అనుకుని అదే రైలులో ప్రయాణిస్తున్న మరోకరి భార్యను తీసుకుని ఊరికి వెళ్లిపోతాడు. తర్వాత నిజం తెలుసుకున్న దీపక్ తన అసలు భార్య కోసం వెతకడం, అప్పటి వరకు తన వెంటే ఉన్నభర్త ఉన్నఫలంగా మాయమవడంతో దీపక్ భార్య ఓ రైల్వేస్టేషన్‌లోనే వేచి చూస్తూ ఉండడం చుట్టూ కథ సాగుతుంది. అసలు దీపక్ తీసుకు వచ్చిన ఆ వధువు ఎవరు, అమె అతనితో ఎందుకు కలిసి వచ్చింది, అతని భర్త ఎవరు, పోలీస్ స్టేషన్‌కు చేరిన కథ ఎన్ని ములపపులు తిరిగిందనేది చాలా ఇంట్రెస్టింగ్ సాగుతుంది.
ఇదంతా ఇలా ఉండగా.. మచ్చటగా మూడోసారి అమీర్ ఖాన్ చిత్రం అస్కార్స్‌కు అర్హత సాధించడం గమనార్హం. గతంలో తను నటించి, నిర్మించిన లగాన్, ఆ తర్వాత నిర్మాతగా వ్యవహరించిన పిప్లీ లైవ్, ఇప్పుడు ఈ లాపతా లేడీస్ (Laapatta ladies) చిత్రాలు ఈ అరుదైన ఘనతను సాధించాయి. అయితే ఇప్పటికే అస్కార్స్ వద్ద సినిమాల ప్రమోషన్స్ , స్క్రీనింగ్ తదితర అంశాలలో అమీర్ ఖాన్‌కు అనుభవం ఉండడం కలిసి వచ్చే అంశం. దీంతో అస్కార్స్ వద్ద తమ చిత్రాన్ని మరింతగా అవార్డ్స్ కమిటీ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. చూడాలి ఈ సారైన మన చిత్రానికి విదేశీ చిత్రాల జాబితాలో మన లాపతా లేడీస్ (Laa patta ladies) కు అవార్డు వస్తుందో లేదో. అల్ ది బెస్ట్ లా పట్టా లేడిస్ అండ్ మూవీ యూనిట్.