Aamir Khan: ఆ తర్వాత నా లైఫ్‌ ఏంటో ఎవరు చెప్పగలరు!

ABN, Publish Date - Aug 10 , 2024 | 02:55 PM

‘లాపతా లేడీస్‌’(Laapataa Ladies) చిత్రాన్ని సుప్రీంకోర్టులో ప్రదర్శించారు. ఈ సినిమాను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌తో(CJI DY Chandrachud)పాటు న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు ఇతర రిజిస్ట్రీ అధికారులు వీక్షించారు.

‘లాపతా లేడీస్‌’(Laapataa Ladies) చిత్రాన్ని సుప్రీంకోర్టులో ప్రదర్శించారు. ఈ సినిమాను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌తో(CJI DY Chandrachud)పాటు న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు ఇతర రిజిస్ట్రీ అధికారులు వీక్షించారు. వారితోపాటు దర్శకురాలు కిరణ్‌రావు, (Kiran rao)నిర్మాత అమిర్‌ఖాన్  (Aamir khan)పాల్గొన్నారు. ఈ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘‘కరోనా సమయంలో షూటింగ్స్‌ లేక ఇంట్లో ఉన్నప్పుడు నాకొక ఆలోచన వచ్చింది. అప్పుడు నా వయసు 56 ఏళ్లు. కెరీర్‌ పరంగా చివరిదశ అనిపించింది. మహా అయితే ఇంకో 15 సంవత్సరాలు పని చేస్తా. 70 ఏళ్ల తర్వాత నా లైఫ్‌ ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు. ఇన్నేళ్ల కెరీర్‌లో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఈ దేశం, సమాజం, పరిశ్రమ నాకెంతో ఇచ్చింది. దానిని తిరిగి ఇవ్వాలనుకున్నా. ఒక నటుడిగా ఏడాదికొక సినిమా మాత్రమే చేయగలను. కానీ, ఒక నిర్మాతగా గొప్ప కథలను ప్రేక్షకులకు అందించాలనుకున్నా. అలా నూతన దర్శకులు,  రచయితలు, నటీనటులకు అవకాశం ఇవ్వాలనిపించింది. అందుకు నేను వేసిన తొలి అడుగు ‘లాపతా లేడీస్‌’. ఇలాంటి టాలెంట్‌ను నేను ప్రోత్సహించాలనుకుంటున్నా. ఏడాదిలో ఐదారు చిత్రాలు నిర్మించాలనుకుంటున్నా. ఆ రకంగా ఇలాంటి అద్భుతమైన సినిమాలను సమాజానికి అందించవచ్చు’’ అని ఆమిర్‌ఖాన్‌ అన్నారు.



కిరణ్‌రావు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా అంత సులభంగా పూర్తి కాలేదు.  ప్రేక్షకులు దీనిపై ఆదరణ చూపిస్తారా లేదా అనే విషయంలో తొలుత మాకు ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకంటే సినిమా, దానికి సంబంధించిన బిజినెస్‌ ఎంతో మారింది. ఇందులో స్టార్‌ హీరోలు, గ్లామర్‌ రోల్స్‌ లేవు కాబట్టి దీనిని డైరెక్ట్‌ ఓటీటీలోనే విడుదల చేయమని చాలామంది ఆమిర్‌కు సలహా ఇచ్చారు. ఎవరు ఎన్ని చెప్పినా మేము దీనిని థియేటర్‌లోనే రిలీజ్‌ చేసినందుకు ఆనందంగా అనిపించింది. ప్రేక్షకులు మాపై విశేష ఆదరణ చూపించారు’’ అని అన్నారు.  కిరణ్‌రావ్‌ దర్శకత్వంలో ఆమిర్‌ ఖాన్‌ తన సొంత బ్యానర్‌పై తెరకెక్కించిన సినిమా ఇది. 2001లో గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువ వధువులు రైలు ప్రయాణంలో తప్పిపోయిన సంఘటనను ఇతివృత్తంగా దీన్ని తెరకెక్కించారు. లింగ సమానత్వాన్ని చాటిచెప్పే ఈ కామెడీ డ్రామా ఇది. ఈ ఏడాది మార్చిలో విడుదలై సినీ ప్రముఖులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలకే పరిమితమైనా ఓటీటీలో దీనికి మంచి ఆదరణ లభిస్తోంది. అంతేకాకుండా విడుదలకు ముందుగానే సెప్టెంబరు 8న ఈ సినిమాను ప్రతిష్ఠాత్మక టోరంటో ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (టీఐఎఫ్‌ఎఫ్‌) వేడుకలో ప్రదర్శించారు.  

Updated Date - Aug 10 , 2024 | 02:55 PM