సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

OTT Content: సృజనాత్మకత పేరుతో అశ్లీలత రాజ్యమేలుతోంది.. ఓటీటీ అంటే ఇంతేనా?

ABN, First Publish Date - 2023-07-23T11:37:33+05:30

వినోద ప్రపంచంలో ఓటీటీ ఓ విప్లవం. వెండితెరపై చెప్పలేని కథలెన్నో ఓటీటీ వేదికలపై విజృంభిస్తున్నాయి. నిర్మాతలకు అదనపు ఆదాయ మార్గం కల్పిస్తూ కొంగు బంగారమైపోయాయి. దర్శకులకు, రచయితలకు, నటీనటులకూ, సాంకేతిక నిపుణులకూ చేతి నిండా పని దొరికింది. థియేటర్లకు అసలు సిసలు ప్రత్యామ్నాయంగా మారిపోయాయి. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు సృజనాత్మకత పేరుతో ఓటీటీల్లో హింస, రక్తపాతం ధారాళంగా ప్రవహిస్తున్నాయి. అశ్లీలత రాజ్యమేలుతోంది.

వినోద ప్రపంచంలో ఓటీటీ (OTT Platforms) ఓ విప్లవం. వెండితెరపై చెప్పలేని కథలెన్నో ఓటీటీ వేదికలపై విజృంభిస్తున్నాయి. నిర్మాతలకు అదనపు ఆదాయ మార్గం కల్పిస్తూ కొంగు బంగారమైపోయాయి. దర్శకులకు, రచయితలకు, నటీనటులకూ, సాంకేతిక నిపుణులకూ చేతి నిండా పని దొరికింది. థియేటర్లకు అసలు సిసలు ప్రత్యామ్నాయంగా మారిపోయాయి. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. మరోవైపు సృజనాత్మకత పేరుతో ఓటీటీల్లో హింస, రక్తపాతం ధారాళంగా ప్రవహిస్తున్నాయి. అశ్లీలత రాజ్యమేలుతోంది. బూతు విచ్చలవిడిగా షికారు చేస్తోంది. బీప్‌లు లేవు. బ్లర్‌ చేసుకొనే అవసరం లేదు. సెన్సార్‌ కత్తెర్లు అడ్డు తగలని చోట- విచ్చలవిడితనమే ఓటీటీ పెట్టుబడిగా మారిపోయింది. ఈమధ్య వచ్చిన కొన్ని సిరీస్‌లు చూస్తే... ఓటీటీ వ్యవస్థ ఎటుపోతోంది..? ఈ తరాన్ని ఎటు వైపు లాక్కుపోతోంది? అనే భయాలు వెంటాడటం సహజం. సినిమాల్లానే ఓటీటీలకూ సెన్సార్‌ షిప్‌ (Sensorship) ఉండాల్సిందే అనే వాదన ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తోంది.

నెట్‌ఫ్లిక్స్‌, అమేజాన్‌ ప్రైమ్‌, జీ5, హాట్‌ స్టార్‌, సోనీ లీవ్‌, వూట్‌, ఆల్ట్‌ బాలాజీ, ఆహా... ఒకటా రెండా..? ఏకంగా నలభై ఓటీటీ వేదికలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటిదాకా దాదాపుగా 43 మిలియన్‌ వీక్షకులు ఓటీటీలకు అలవాటు పడ్డారు. ఈ యేడాది చివరికి ఈ సంఖ్య 50 మిలియన్లకు చేరుకుంటుందన్నది విశ్లేషకుల మాట. ఓటీటీల్లో ఉన్న కంటెంట్‌ అంతా చూస్తూ కూర్చుంటే, అన్నీ పూర్తయ్యే సరికి కనీసం పాతికేళ్లు పడుతుందని ఓ లెక్క. ఓటీటీల్లో ఎంత సరుకుందో, వాటిని మనం ఎంత అలవాటు పడుతున్నామో ఈ అంకెలే చెబుతున్నాయి. ఒకప్పుడు వారాంతం వస్తే థియేటర్ల వైపు, కొత్త సినిమాల వైపు దృష్టి పడేది. ఇప్పుడు ఇంట్లోనే కావల్సినంత వినోదం. రోజుకో కొత్త సిరీస్‌, కొత్త సినిమా. వినోదానికైతే ఢోకా లేదు. అయితే ఆ వినోదం స్వచ్ఛమైనదేనా అనేదే ప్రశ్న.

సృజనాత్మకత పేరుతో...

ఒకప్పుడు వెండి తెరపై ముద్దు సన్నివేశం చూపించాలంటే - సదరు దర్శకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకొనేవారు. నాయకా నాయికలు కళ్లల్లో కళ్లు పెట్టుకొని, ప్రేమగా చూసుకొంటూ.. ఒకరికొకరు దగ్గరైతే చాలు. రెండు పువ్వులు ‘ఢీ’ కొట్టుకొనేవి. అంతే... ముద్దు సన్నివేశం తయ్యార్‌. ఆ తరవాత అధర చుంబనాలకు మెల్లగా అలవాటు పడ్డారు. ఇప్పుడు లిప్‌ లాక్‌ సన్నివేశం లేకపోతే... అది సినిమానే కాదన్నట్టు తయారైంది వ్యవహారం. అదేదో పెద్ద బూతుగా, ఇబ్బంది కలిగించే విషయంగా అనిపించడం లేదు. ఆ స్థాయికి ప్రేక్షకుల మైండ్‌ సెట్‌ మార్చేశారు. బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాల్లో ‘జాకెట్‌’ అనే మాట డైలాగులో ఉంటే.. సెన్సార్‌ సభ్యులు ఊరుకొనేవారు కాదట. కొన్ని పదాలు సంభాషణల్లో చొప్పించడానికి రచయితలు చాలా శ్రమించేవారు. కాస్త బూతు ధ్వనించినా, సెన్సార్‌ కత్తెర్లు పదునెక్కేవి. ఇప్పుడు సృజనాత్మక స్వేచ్ఛ పేరిట... ఏం రాసినా అదే ‘డైలాగ్‌’ అయిపోతోంది. వెండితెరపై సైతం కొన్నిసార్లు బూతులు బీప్‌ శబ్దాల్లేకుండా వచ్చేస్తున్నాయి. మరి... ఏ సెన్సార్‌ లేని ఓటీటీలు ఆగుతాయా? అక్కడ వాటి ప్రతాపం మరింత చూపించకుండా ఎందుకు ఉంటాయి?

ఇమేజ్‌కు భిన్నంగా...

ఈమధ్య ‘రానా నాయుడు’ అనే వెబ్‌ సిరీస్‌ వచ్చింది. వెంకటేశ్‌, రానా కలిసి నటించిన ఈ సిరీస్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ర్టీమింగ్‌ అవుతోంది. వెంకటేశ్‌కి ఉన్న ఇమేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన స్టార్‌ ఆయన. ఈ సిరీస్‌లోనిపాత్ర మాత్రం ఆయన ఇమేజ్‌కి భిన్నంగా నడిచింది. సిరీస్‌ నిండా బూతులే. అశ్లీల దృశ్యాలే. ‘వెంకీ ఏంటి? ఇలాంటి సిరీస్‌లో నటించాడు?’ అని ఆయన అభిమానులే విస్తుపోయారు. క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న ఓ అగ్ర కథానాయకుడే ఓటీటీ పోకడలకు లొంగిపోయాడంటే, వాటి ప్రభావం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వెంకీ మాత్రం ఈ విమర్శల్ని లైట్‌ తీసుకొన్నారు. ‘‘ఇది కుటుంబం అంతా కలిసి చూసే సిరీస్‌ కాదు. ఒంటరిగా ఉన్నప్పుడే చూడండి అని ముందే చెప్పాం. ఇందులో మా తప్పేం లేదు’’ అని తప్పించుకొన్నారాయన.

ఓటీటీల్లో ఓపెన్‌...

తమన్నా చిత్రసీమలోకి అడుగుపెట్టి దాదాపు పదిహేనేళ్లయ్యింది. ఇంత వరకూ తను ఒక్క లిప్‌ లాక్‌ సన్నివేశంలోనూ నటించలేదు. కానీ ఓటీటీలకు వెళ్లేసరికి తమన్నా పద్ధతి కూడా మారిపోయింది. ‘జీ కర్దా’ అనే వెబ్‌ సిరీస్‌లో తమన్నా తొలిసారి గీత దాటింది. హాట్‌ హాట్‌ సన్నివేశాల్లో ఎలాంటి అభ్యంతరం లేకుండా నటించింది. ‘లస్ట్‌ స్టోరీస్‌ 2’లో అయితే ఓ అడుగు ముందుకేసింది. తన కెరీర్‌లో తొలిసారి లిప్‌ లాక్‌ సన్నివేశంలో కనిపించింది. పడగ్గది సన్నివేశాలకూ ‘నో’ చెప్పలేదు. ఈ మార్పు తమన్నా అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది. కానీ... తమన్నా మాత్రం తనకు తాను సర్ది చెప్పుకొంది. ‘‘సెల్‌ ఫోన్లు చేతికి అందాక వినోదం మరింత చవకైపోయింది. ఏదీ దాచడానికి లేదు. అందరికీ అన్నీ తెలిసిపోతున్నాయి. మారుతున్న కాల, మాన పరిస్థితులకు తగ్గట్టుగా నటిగా నన్ను నేను మార్చుకొంటున్నాను. ఇందులో తప్పేం కనిపించడం లేదు’’ అని చెప్పుకొచ్చింది తమన్నా.

కల్ట్‌ సిరీస్‌తో మొదలు...

‘మీర్జాపూర్‌’ వెబ్‌ సిరీస్‌లలో ఓ కొత్త ట్రెండ్‌ సృష్టించింది. బూతు, సెక్స్‌, అసాంఘిక కార్యక్రమాలు.. ఇవన్నీ పోగేసిన సిరీస్‌ ఇది. వెబ్‌ సిరీస్‌ చరిత్రలో దీన్ని ‘కల్ట్‌ సిరీస్‌’గా అభివర్ణిస్తారు విశ్లేషకులు. బూతు, హింస పక్కన పెడితే, ఓ కథని చెప్పే విధానం, ప్రేక్షకుల్ని అరెస్ట్‌ చేసిన పద్ధతి జనాలకు నచ్చాయి. ఈ సిరీస్‌లో బూతుని మర్చిపోయి, మిగిలిన విషయాల గురించి ఎక్కువ చర్చించుకొన్నారు. అయితే ఆ తరవాత వచ్చిన వెబ్‌ సిరీస్‌లకు ఇందులోని బూతే ఎక్కువ ఆకర్షించింది. అదే ఫార్ములాగా మారిపోయింది. ‘ఫోర్‌ మోర్‌ షార్ట్స్‌ ప్లీజ్‌’, ‘లస్ట్‌ స్టోరీస్‌’, ‘పతీ పత్నీ పంగా’, ‘మేడిన్‌ హెవెన్‌’, ‘సిటీ ఆఫ్‌ డ్రీమ్స్‌’, ‘కఫాస్‌’... ఈ వెబ్‌ సిరీస్‌లో దర్శకులు చెప్పిన కథలన్నీ ఆశ్చర్యపరిచేవే. వీటిని వెండి తెరపై ఏమాత్రం ఊహించలేం. ఆ లెక్కన సృజనకు ఓటీటీలు పెద్ద పీట వేసినట్టే. కానీ ఆ ముసుగులో ఏం చెబుతున్నారన్నదే అసలు ప్రశ్న. ఇద్దరబ్బాయిల మధ్య అసహజ శృంగారం ఆయా కథల్లో సన్నివేశాలుగా మారుతున్నాయి. కృత్రిమ పద్ధతి ద్వారా అమ్మాయిలు సెక్స్‌ సుఖం పొందడమే కథా వస్తువులు అవుతున్నాయి. నీలి చిత్రాలకు తీసిపోని త్రిపుల్‌ ఎక్స్‌ సన్నివేశాలు వెబ్‌ సిరీస్‌లలో కనిపిస్తుంటే అవాక్కవుతున్నారు వీక్షకులు. ఈ చెత్తంతా ఒక్క మీట దూరంలో అందరికీ అందుబాటులోకి వచ్చేస్తోంది. మరి దీనికి అడ్డు కట్ట వేసేదెవరు? ఇదే వినోదమని పదహారేళ్ల బాల్యం నమ్మితే పరిస్థితి ఏమిటి? అన్నది అందరి భయం. అందుకే ఓటీటీలకు సెన్సార్‌ ఉండాల్సిందేనంటూ ఓ వర్గం బలంగా వాదిస్తోంది.

‘సైతాన్‌’ షాక్‌...

మన తెలుగులోనూ ఈ పోకడ ఎక్కువవ్వడం ప్రమాద సంకేతమే. ఇటీవల ‘సైతాన్‌’ అనే వెబ్‌ సిరీస్‌ వచ్చింది. అందులో ప్రతీ డైలాగ్‌లోనూ ఓ పచ్చి బూతు ధ్వనించింది. తెలుగు భాషలో ఎన్ని బూతులున్నాయో.. అన్నీ వాడేశారు. హింస, రక్త పాతానికి అడ్డు లేకుండా పోయింది. ‘సైతాన్‌’ వెబ్‌ సిరీస్‌ టాలీవుడ్‌కే షాక్‌ ఇచ్చింది. ఇంత విచ్చలవిడితనం మరెక్కడా చూడలేదని విస్తుపోయారంతా. అయితే దర్శకుడు మహి.వి.రాఘవ మాత్రం సమాజంలో ఉన్నదే ఓటీటీ తెరపైనా చూపించానని వాదించారు. ‘‘పదేళ్ల దిన పత్రికలన్నీ తిరగేయండి. వాటిలో వార్తలుగా కనిపించిన విషయాలే నేను తెరపై చూపించాను. కొన్ని విషయాల్ని బోల్డ్‌గా, సూటిగా చెప్పాలంటే ఇంతకు మించిన మార్గం నాకు కనిపించలేదు. సమాజంలోని ప్రతీ పాత్ర పద్ధతిగా మాట్లాడదు. కొంతమంది బూతులూ మాట్లాడుతుంటారు. నా కథలోని కొన్ని పాత్రలు బూతులు మాట్లాడితే తప్పేంటి’’ అని లాజిక్‌ తీశారాయన. ఓటీటీలకు సెన్సార్‌ ఉండకూడదన్నది మహి.వి.రాఘవ బలమైన అభిప్రాయం. ‘‘సినిమాలకు, టీవీలకు సెన్సార్‌ ఉంది. ఓటీటీలకూ సెన్సార్‌ విధిస్తే, ఇక ఓటీటీలెందుకు? హాయిగా టీవీలతో సరిపెట్టుకోవొచ్చు కదా..?’’ అంటున్నారాయన.

మంచి కంటే చెడే ఎక్కువ!

హింస, సెక్స్‌.. ఇబ్బంది కేవలం వీటితోనే కాదు. మతం లాంటి సున్నితమైన విషయాల్నీ ఓటీటీ గట్టిగానే పట్టుకొంటోంది. ‘తాండవ్‌’ ఎన్ని వివాదాలు రాజేసిందో. బీజేపీ నాయకులు ఈ సిరీస్‌ని బ్యాన్‌ చేయాలని అప్పట్లో గట్టిగా డిమాండ్‌ చేశారు. ‘ఓకే కంప్యూటర్‌’పైనా ఇలాంటి వివాదాలే రేగాయి. ఓ పార్టీని టార్గెట్‌ చేసి తీసిన వెబ్‌ సిరీస్‌ ఇది. ఈ సిరీస్‌లో వినిపించే సంభాషణలు, పాత్రలు.. ఓ ప్రధాన రాజకీయ పార్టీకి రిప్లికాగానే కనిపిస్తాయి. ప్రస్తుత వ్యవస్థపై దర్శకుడు వదిలిన వ్యంగాస్త్రం ఇది. ‘పాతాళ్‌ లోక్‌’లాంటి జనం మెచ్చిన సిరీస్‌లో కూడా మత విశ్వాసాల్ని దెబ్బకొట్టేలా సన్నివేశాలు రూపొందించారన్న విమర్శ ఉంది. ముఖ్యంగా ముస్లింలను తీవ్రవాదులుగా, దేశ ద్రోహులుగా కొన్ని సిరీస్‌లతో చూపించారన్న కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. మతసామరస్యమే ఆయుధంగా మారిన మన దేశానికి ఈ వెబ్‌ సిరీస్‌ల వల్ల, అందులో చూపించిన పాత్రల వల్ల మంచి కంటే చెడే ఎక్కువ జరిగే ప్రమాదం కనిపిస్తోంది.

స్వీయ నియత్రణ

కేంద్ర సమాచార, ప్రసార శాఖ ఓటీటీలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలన్నది చాలామంది అభిప్రాయం. కానీ ఈ విషయంలో ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎందుకంటే ఓటీటీల సెన్సార్‌ ప్రాక్టికల్‌గా సాధ్యం కాదు. ప్రతీ రోజూ కొన్ని వందల గంటల కంటెంట్‌ ఓటీటీలో పోస్ట్‌ అవుతోంది. దాన్ని పరిశీలించి, క్రమబద్ధీకరించడం దాదాపుగా అసాధ్యం. సినిమాలు చూసి, వాటిని సెన్సార్‌ చేయడానికే సెన్సార్‌ బోర్డు ఆపసోపాలు పడుతోంది. అలాంటిది ఓటీటీలో వచ్చిన కంటెంట్‌ అంతటినీ చూడాలంటే.. ఒక్కో వెబ్‌ సిరీస్‌ పోస్ట్‌ చేయడానికి నెలలు, సంవత్సరాలూ పడుతుంది. ‘ఉల్లూ’ లాంటి థర్డ్‌ గ్రేడ్‌ ఓటీటీ సంస్థలు కేవలం బూతునే నమ్ముకొని కంటెంట్‌ అందిస్తున్నాయి. ఇలాంటి ఓటీటీ యాప్‌లు దాదాపు డజను వరకూ ఉన్నాయి. ఒకవేళ ఓటీటీలకూ సెన్సార్‌ షిప్‌ వస్తే ఈ యాప్‌లన్నీ దుకాణాలు మూసుకోవాల్సిందే. అందుకే స్వీయ నియంత్రణ ఉంటే సరిపోతుందని సమాచార మంత్రిత్వ శాఖ ఓటీటీలకు హితవు చెప్పింది. కంటెంట్‌ ప్రదర్శించేముందు, అందులో ఏముందో? ఏ వయసు వాళ్లు చూడాలో? ముందే సూచించమంటోంది. ఓటీటీలన్నీ ఇప్పుడు ఇదే పని చేస్తున్నాయి. 13 ప్లస్‌, 18 ప్లస్‌ అంటూ సిరీస్‌లను విభజిస్తున్నాయి.

భిన్నాభిప్రాయాలు...

చిత్రసీమ కూడా ఓటీటీలకు సెన్సార్‌ షిప్‌ విషయంలో సానుకూలంగా స్పందించడం లేదు. సల్మాన్‌ ఖాన్‌ తప్ప... ఈ విషయమై ఎవరూ నోరు మెదపలేదు. ఓటీటీల వల్ల సినిమాలకు మేలు జరుగుతోంది. ఓ సినిమా పెట్టుబడిలో సగం ఓటీటీల ద్వారానే వస్తోంది. పైగా దర్శకులకు, రచయితలకు పని దొరుకుతోంది. ఓటీటీ దూకుడుకు సెన్సార్‌తో కళ్లెం వేయాలనుకొంటే, ఓటీటీ వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది. అప్పుడు సినిమాలకు రాబడి తగ్గిపోతుంది. అందుకే ఏ దర్శకుడూ, కథానాయకుడు ఓటీటీల సెన్సార్‌షిప్‌ గురించి మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడడం లేదు.

మరో కోణం...

అలాగని ఓటీటీల్లో కేవలం బూతే ఉందని చెప్పలేం. కంటెంట్‌ని నమ్ముకొన్న కథలూ చాలా వస్తున్నాయి. వాటికీ విపరీతమైన ఆదరణ దక్కుతోంది. ‘ఫ్యామిలీమ్యాన్‌’ సిరీస్‌లో బూతెక్కడ ఉంది? ‘స్కామ్‌ 1992’, ‘పాతాళ్‌ లోక్‌’.. ఈ కథలన్నీ వీక్షకులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసినవే కదా..? ఓటీటీలతో పోలిస్తే సోషల్‌ మీడియానే ఎక్కువ ప్రమాదకరంగా మారుతోంది. రీల్స్‌, షార్ట్స్‌ పేరుతో రకరకాల వీడియోలు అందుబాటులోకి వచ్చేశాయి. ఓటీటీలోని అశ్లీలతంతా.. ఈ సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైపోతోంది. ఒకవేళ ప్రక్షాళన చేయడం మొదలెడితే... అది సోషల్‌ మీడియా నుంచే మొదలవ్వాలి.

‘‘కిళ్లీ కొట్టులో బిస్కెట్లూ, చాక్లెట్లతో పాటు సిగరెట్లు కూడా దొరుకుతాయి. ఏది కొనాలి? ఏది కొనకూడదు? అనేది మన విచక్షణపై ఆధారపడి ఉంటుంది. ఏది చూడాలి? ఏది చూడకూడదు? అనేది ప్రేక్షకులు నిర్ణయించు కోవాలి’’ అనేది రచయిత, దర్శకుడు.. త్రివిక్రమ్‌ మాట. అది అక్షరాలా నిజం. ఎన్ని ఆంక్షలు ఉన్నా, ఎన్ని సెన్సార్‌ నిబంధనలు అడ్డొచ్చినా రావాల్సిన బూతు బయటకు వచ్చేస్తూనే ఉంది. చూడకూడని కంటెంట్‌ అంతా సెల్‌ ఫోన్‌ నిండా పరుచుకొని ఉంది. ఏది వ్యక్తిత్వ వికాసాన్ని అందిస్తుంది? ఏది మెదడుని పురుగులా తినేస్తుంది? అనేది వీక్షకులే నిర్ణయించుకోవాలి. స్వీయ నియంత్రణ అనేది దర్శకులకో, రచయితలకో, ఓటీటీటీ సంస్థలకో పరిమితం కాదు. అది ప్రేక్షకులకూ వర్తిస్తుంది.

ప్రమాదంలో వినోదం

‘‘చదువు పేరుతో మీ పదహారేళ్ల పాప... సెల్‌ఫోన్‌లో అడల్ట్‌ కంటెంట్‌ చూస్తుంటే మీరు ఒప్పుకోగలరా? సినిమాల్లో యాక్షన్‌ కాస్త ఎక్కువైతే కత్తెర వేస్తారు. ఇంకా మితిమీరితే ‘ఏ’ సర్టిఫికెట్‌ ఇస్తారు. టీవీలకూ సెన్సార్‌షిప్‌ ఉంది. మరి... ఓటీటీలకు ఎందుకు ఉండకూడదు? ఓటీటీల్లో హింస, అశ్లీలత ఇలానే కొనసాగితే, వినోద మాధ్యమాలపై ప్రేక్షకుల్లో క్రమంగా ఏవగంపు వచ్చే ప్రమాదం ఉంది’’

- సల్మాన్‌ఖాన్‌

సృజనకు అడ్డుకట్ట తగదు...

‘‘ఓటీటీల్లో సృజనాత్మక స్వేచ్ఛ ఉంది. వెండి తెరపై చెప్పలేని కథల్ని ఇక్కడ చెప్పొచ్చు. ఇప్పుడు ఓటీటీలకు సైతం సెన్సార్‌ షిప్‌ తీసుకొస్తే ఆ సృజనకు అడ్డు కట్ట వేసినట్టే. ఓటీటీ వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఇప్పుడొస్తున్న సినిమాలు కూడా కుటుంబ సమేతంగా చూడగలుగుతున్నామా? ఏ సినిమా చూడాలో, ఏది చూడకూడదో పిల్లలకు మనం చెబుతున్నాం. అలానే ఏ సిరీస్‌ చూడొచ్చో.. ఏది చూడకూడదో పిల్లకు అర్థమయ్యేలా పెద్దలు చెప్పాలి. అలా చెప్పగలిగితే సెన్సార్‌ షిప్‌ అనే ప్రస్తావనే రాదు’’

- మనోజ్‌ బాజ్‌పేయి

- అన్వర్‌

Updated Date - 2023-07-23T11:41:43+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!