Jana Sena: ఈసారి ఎన్నికల్లో నిర్మాత బన్నీవాసు, పిఠాపురం నుండి పోటీ
ABN, Publish Date - Dec 20 , 2023 | 01:24 PM
ప్రముఖ నిర్మాత ఉదయ శ్రీనివాస్ అలియాస్ బన్నీవాసు రాబోయే ఆంధ్ర ఎన్నికల్లో పిఠాపురం నుండి పోటీ చేస్తారని జనసేన జాబితా ఒకటి సామజిక మాధ్యమాల్లో తిరుగుతోంది. అయితే ఆ జాబితా సంగతి ఎలా వున్నా, ఈసారి బన్నీ వాసు మాత్రం పోటీ చెయ్యడం ఖాయం అని, అయితే అది పిఠాపురం, పాలకొల్లు, గుంటూరు ఎక్కడ నుంచి అయినా కావచ్చు అని అంటున్నారు.
ప్రముఖ నిర్మాత, ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ (GeethaArts)లో అల్లు అరవింద్ (AlluAravind) తో పాటు పలు చిత్రాలు నిర్మించిన బన్నీ వాసు (BunnyVasu) ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం ఖాయం అనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (PawanKalyan), నిర్మాత బన్నీ వాసుకి పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. బన్నీ వాసు అసలు పేరు ఉదయ శ్రీనివాస్ గవర, (UdayaSrinivas) చిత్రపరిశ్రమలో అందరూ అతన్ని బన్నీ వాసు అని పిలుస్తూ వుంటారు, ఎందుకంటే అతను నటుడు అల్లు అర్జున్ (బన్నీ) (AlluArjun) కి బాగా సన్నిహితుడు అవటం వలన. అల్లు అర్జున్ ని బన్నీ అని దగ్గరి స్నేహితులు పిలుస్తూ వుంటారు, అందుకని ఉదయ శ్రీనివాస్ ని బన్నీ వాసుగా పిలుస్తూ వుంటారు.
బన్నీవాసుకి జనసేన పార్టీ కి అనుబంధం ఇప్పటిది కాదు. జనసేన ఆవిర్భావం నుండి బన్నీ వాసు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తో చాలా దగ్గరగా పని చేస్తూ వస్తున్నారు. అయితే ఎప్పుడూ ప్రత్యక్షంగా అతను పని చేస్తున్నట్టు ప్రచారాల్లో గానీ, బయటివాళ్ళకి గానీ తెలియదు. కానీ పార్టీ కి బన్నీవాసు పనిచేస్తూ తన సూచనలు, సలహాలు ఇస్తూ వుంటారు. పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుల్లో బన్నీవాసు ఒకరు అని, వారానికి రెండు రోజులు పూర్తిగా ఆంధ్రలో పర్యటనకోసమే వినియోగిస్తూ ప్రజల దగ్గర నుండి సేకరించిన సమాచారం నేరుగా పవన్ కళ్యాణ్ కి ఈరోజు వరకూ ఇస్తూ ఉంటారని అంటారు. మామూలుగా అయితే బన్నీ వాసు తన స్వగ్రామం అయిన పాలకొల్లు నుండి పోటీ చేస్తారు అని అనుకుంటూ వుంటారు, కానీ ఇప్పుడు సామాజిక మాధ్యమంలో మాత్రం పిఠాపురం నుండి ఉదయ శ్రీనివాస్ (బన్నీ వాసు) పేరు వినిపిస్తోంది.
నిన్నటి నుండి సామజిక మాధ్యమాల్లో జనసేన అభ్యర్థుల జాబితా అని ఒకటి తిరుగుతోంది, అందులో పిఠాపురం నుండి ఉదయ శ్రీనివాస్ (బన్నీ వాసు) పోటీ చేస్తారని వుంది. అయితే బన్నీ వాసు పాలకొల్లు నుండి గానీ లేదా గుంటూరు నుండి పోటీ చెయ్యడానికి రెడీ అన్నట్టుగా చెప్పారని, కానీ ఇప్పుడు సామజిక మాధ్యమంలో తిరుగుతున్న జాబితాని చూస్తే మాత్రం అతని పేరు పిఠాపురం నియోజకవర్గం అని వుంది.
అయితే ఈసారి జనసేన, తెలుగుదేశం (TeluguDesamParty) పొత్తు పెట్టుకొని పోటీ చేస్తున్నాయి కాబట్టి, కొన్ని నియోజకవర్గాలు మారే అవకాశం ఉన్నందున బన్నీ వాసుకి పిఠాపురం వచ్చినట్టుగా చెపుతున్నారు. అదీ కాకుండా ఈసారి ఎక్కడనుండి పోటీ చేసినా గెలుపు ఖాయం అనేట్టుగా ఉందని, ప్రస్తుతం వున్న జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండటం వలన, తెలుగు దేశం, జనసేన పొత్తు కూడా ఉండటం మూలాన, గెలుపు ఖాయం అనే అంటున్నారు. అయితే అధికారికంగా పార్టీల జాబితా వచ్చినతరువాత ఏ అభ్యర్థులు ఎక్కడ అనేది చూడాలి.