Abhishek Nama: ఇదే విషయం ఒక పెద్ద హీరోని అడిగే దమ్ముందా? నిర్మాతకి అభిమానుల సూటి ప్రశ్న...
ABN, First Publish Date - 2023-09-06T16:16:47+05:30
ఒక సినిమాతో ఎటువంటి వ్యాపార లావాదేవీలైన ఆ సినిమా నిర్మాత తో చేసుకుంటాడు డిస్ట్రిబ్యూటర్ కానీ ఇంకెవరైనా కానీ. కానీ అభిషేక్ నామా ఇన్నాళ్లు పరిశ్రమలో వుంది, ఇవన్నీ తెలిసి కూడా విజయ్ దేవరకొండ వంద కుటుంబాలను ఆడుకోవటానికి ముందుకు వస్తే, దాని మీద వ్యంగంగా వ్యాఖ్యానించాడు అని నెటిజన్స్ ఆ నిర్మాతని ట్రోల్ చేస్తున్నారు. తాను తీసిన గోతిలో తానే పడ్డాడు అన్నట్టుగా వుంది ఇప్పుడు ఆ నిర్మాత పరిస్థితి.
నిర్మాత అభిషేక్ నామా (AbhishekNama) తన అభిషేక్ పిక్చర్స్ (AbhishekPictures) సంస్థ నుండి ఎన్నో సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసాడు, అలాగే కొన్ని సినిమాలు నిర్మించాడు కూడా. ఇప్పుడు అతను నందమూరి కళ్యాణ్ రామ్ (NandamuriKalyanRam) తో నిర్మిస్తున్న 'డెవిల్' #Devil సినిమా విడుదలకి సిద్ధంగా వుంది. అంతకు ముందు అభిషేక్ నామా విజయ్ దేవరకొండ (VijayDeverakonda) సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' (WorldFamousLover) డిస్ట్రిబ్యూట్ చేసాడు, ఆ సినిమా పోయింది. అంతవరకు బాగానే వుంది.
'ఖుషి' #Khushi సినిమా విజయోత్సవ సభ వైజాగ్ లో జరిగినప్పుడు ఆ సినిమాలో నటించిన విజయ్ దేవరకొండ తన అభిమానులకు ఒక శుభవార్త చెప్పాడు. తన అభిమానుల్లో పేదవారుగా వున్న నూరు కుటుంబాలకు లక్ష చొప్పున ఒక కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నాను అని ప్రకటించాడు. అది అతని పెద్ద మనసు, అతనికి కొంతమంది నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని అనుకున్నాడు, ఆదుకుంటున్నాడు. ఇంతకు ముందు కూడా ఇలా సేవా కార్యక్రమాలు చాలా చేసాడు విజయ్.
ఇదే అదునుగా అభిషేక్ నామా ప్రొడక్షన్ సంస్థ అభిషేక్ పిక్చర్స్ ట్విట్టర్ లో తాము 'వరల్డ్ ఫేమస్ లవర్' డిస్ట్రిబ్యూట్ చేసి రూ.8 కోట్లు పోగొట్టుకున్నామని, దానికి సరైన సమాధానం ఎవరూ చెప్పలేదని, ఇప్పుడు నువ్వు కోటి రూపాయలు పేదవాళ్లకు ఇస్తున్నావు కదా, అలాగే మా ఎగ్జిబిటార్స్, డిస్ట్రిబ్యూటర్స్ కుటుంబాలని కూడా ఆదుకోవాలని అడుగుతున్నాం అన్నాడు.
ఇలా అడగటంతో ఆ నిర్మాత మీద విజయ్ అభిమానులు మండిపడుతున్నారు. కొంతమంది మీ డిస్ట్రిబ్యూషన్ సంస్థకి విజయ్ సహాయం చేస్తున్న స్లమ్ లో వుండే పేదవానికి ఎలా సమన్వయిస్తావు అని అడిగాడు. రెండిటికి తేడా లేదా అని అడిగాడు. ఇంకొకరు అయితే, ఇదే ప్రశ్న ఒక పెద్ద కుటుంబం నుండి వచ్చే హీరోని అడిగే దమ్ముందా నీకు అని అడిగాడు. ఇంకొకరు అయితే అసలు డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ పెట్టినప్పుడే నీకు జడ్జిమెంట్ ఉండాలి, కొన్ని వస్తాయి, కొన్ని పోతాయి, అవి తెలిసే కదా పెట్టావ్ అని అన్నాడు.
ఇలా నెటిజన్స్ అందరూ ఆ నిర్మాతని ఆడుకుంటున్నారు. అసలు సినిమా పోతే అందులో నటించిన వాళ్లకి ఏమి సంబంధం, నిర్మాతతో కదా ఒప్పందం చేసుకున్నది, మరి అందులో నటించేవారు ఏమి చేస్తారు, నిర్మాతని అడగాలి కదా అని ఒకరు అన్నారు. అలాగే అభిషేక్ నామా పాత వీడియోలను కూడా ఇప్పుడు సాంఘీక మాధ్యమంలో నడిపిస్తున్నారు. ఇలా ఒక సాంఘీక మాధ్యమంలో ఒక నటుడు మీద ఇలా పెట్టడం ఇది కావాలని ఎవరో చేయించారు అని ఇంకొకరు అంటున్నారు.
విజయ్ దేవరకొండ అనే నటుడు, వెనక ఎవరూ గాడ్ ఫాదర్ లేకుండా, స్వశక్తితో కష్టపడి పైకి ఎదిగిన నటుడు అని, అందుకే అభిషేక్ నామా కి అది కష్టంగా ఉందని అందువలన అతను ఇలా సాంఘీక మాధ్యమంలో పెట్టాడని ఇంకొందరు అన్నారు. ఇలా ఇతనికి పెట్టినట్టు, ఒక పెద్ద కుటుంబం నుండి వచ్చిన నటుడికి అభిషేక్ నామా ఇలా పెట్టె ధైర్యం, దమ్ము ఉందా అని నెటిజన్స్ అడుగుతున్నారు. ఇది ఒక నటుడుని కించపరిచే ఉద్దేశంతో అభిషేక్ నామ ఇలా పెట్టాడని నెటిజన్స్ అంటున్నారు. ప్రభాస్ (Prabhas) సినిమాలు చాలా పోయాయని, అలాగే పవన్ కళ్యాణ్ (PawanKalyan), ఎన్టీఆర్ (NTR), మహేష్ బాబు (MaheshBabu), చిరంజీవి (Chiranjeevi) సినిమాలు ఇలా అందులో నటించే అందరినీ అడుగుతుంటే ఆ నటులు ఇలా చారిటీ చేసుకుంటూ పోవాలని అన్నాడు ఒకడు. మొత్తం మీద అభిషేక్ నామాకి సాంఘీక మాధ్యమంలో చుక్కెదురైంది, తాను తీసిన గోతిలో తానే పడినట్లయింది.