Sir: రియల్ ‘సార్’కు ‘సార్’ టీమ్ సహకారం
ABN, First Publish Date - 2023-03-02T22:50:29+05:30
మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న విడుదలైన ‘సార్’ (Sir Movie) చిత్రం.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ 100 కోట్ల దిశగా పయనిస్తోంది. ఇది గురువు గొప్పతనాన్ని తెలియజేసిన చిత్రం. కొన్ని కథలు సమాజాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. కదిలిస్తాయి, ఆలోచింపజేస్తాయి, మార్పు దిశగా
మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న విడుదలైన ‘సార్’ (Sir Movie) చిత్రం.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ 100 కోట్ల దిశగా పయనిస్తోంది. ఇది గురువు గొప్పతనాన్ని తెలియజేసిన చిత్రం. కొన్ని కథలు సమాజాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. కదిలిస్తాయి, ఆలోచింపజేస్తాయి, మార్పు దిశగా అడుగులు వేసేలా చేస్తాయి. అలాంటి అరుదైన ఆలోచింపజేసే కథతో రూపొందిన సందేశాత్మక చిత్రం ‘సార్’. పేద విద్యార్థుల చదువు కోసం బాల గంగాధర్ తిలక్ (Balu Sir) అనే ఓ గురువు సాగించిన పోరాటం ఈ చిత్రం. సిరిపురం (Siripuram) అనే ఊరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు జూనియర్ లెక్చరర్‌గా వెళ్ళిన హీరో.. అక్కడ విద్యార్థులెవరూ కళాశాలకు రాకపోవడంతో వారిని తిరిగి కళాశాలకు వచ్చేలా చేస్తాడు. కుల వ్యవస్థపై పోరాడేందుకు వారిలో చైతన్యం నింపుతాడు. ఈ చిత్రంలో విద్య గొప్పతనాన్ని తెలుపుతూ బాల గంగాధర్ తిలక్ సాగించిన పోరాటం స్ఫూర్తిదాయకం. అయితే అలాంటి బాల గంగాధర్ తిలక్ నిజం జీవితంలోనూ ఉన్నారు. ఆ సార్‌ని.. ‘సార్’ బృందం కలిసి సత్కారంతో పాటు సహకారం కూడా అందించింది.
కుమురం భీం జిల్లా కెరమెరి మండలం సావర్ ఖేడ (Savarkhed)లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు కేడర్ల రంగయ్య (K Rangaiah). ఆయన బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆ పాఠశాలలోని విద్యార్థుల సంఖ్య 60 లోపే. కానీ ఆయన కృషి ఆ సంఖ్యను 260కి చేరేలా చేసింది. తన కుమార్తెను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి.. తన బాటలోనే ఆ గ్రామస్థులు నడిచేలా వారిలో స్ఫూర్తి నింపారు రంగయ్య. తన సొంత డబ్బుతో పాఠశాలను మరమ్మత్తులు చేయించడానికి పూనుకున్న ఆయనను చూసి.. గ్రామస్థులు ముందుకొచ్చి పాఠశాలకు కొత్త మెరుగులు దిద్దారు. ఉపాధ్యాయుడిగా ఆయన చేసిన కృషికి గాను జాతీయ అవార్డు కూడా అందుకున్నారు రంగయ్య.
రంగయ్య సార్ జీవితం ‘సార్’ చిత్రానికి స్ఫూర్తి కాదు. కానీ ఆయన జీవితం కూడా బాల గంగాధర్ తిలక్ కథ లాగే స్ఫూర్తిదాయంగా ఉంది. అదే కేడర్ల రంగయ్యను ‘సార్’ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి స్వయంగా కలిసేలా చేసింది. నిజజీవితంలో తాను చూసిన, విన్న సంఘటనల ఆధారంగా సార్ కథను, బాల గంగాధర్ తిలక్ పాత్రను తీర్చిదిద్దారు వెంకీ అట్లూరి (Director Venky Atluri). అయితే సినిమా విడుదలై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకుంటున్న సమయంలో.. తాను రాసుకున్న బాల గంగాధర్ తిలక్ పాత్రను పోలిన ఉపాధ్యాయుడు నిజంగానే ఉన్నారని తెలిసి వెంకీ అట్లూరి ఆశ్చర్యపోయారు, అంతకుమించి ఆనందపడ్డారు. కేడర్ల రంగయ్య గారిని కలవాలనుకున్నారు. అనుకోవడమే కాదు తాజాగా హైదరాబాద్‌లో కలిశారు కూడా.
వెంకీ అట్లూరి, కేడర్ల రంగయ్య ఇద్దరూ కలిసి సార్ చిత్రం గురించి, సావర్ ఖేడ ప్రభుత్వ పాఠశాల గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు. సార్ సినిమా చూస్తున్నప్పుడు కొన్ని కొన్ని సన్నివేశాల్లో తనని తాను చూసుకున్నట్లు ఉందని కేడర్ల రంగయ్య చెప్పడంతో వెంకీ అట్లూరి ఎంతగానో సంతోషించారు. అలాగే అతి చిన్న వయసులోనే ఉత్తమ ఉపాధ్యాయుడుగా జాతీయ అవార్డు అందుకున్నారని తెలిసి కేడర్ల రంగయ్యను వెంకీ అట్లూరి ప్రత్యేకంగా అభినందించారు. 13 సంవత్సరాల కాలంలో తాను ఎదుర్కొన్న సవాళ్ళను, సాధించిన ఘనతలను గుర్తు చేసుకున్న రంగయ్య.. ఇలాంటి అద్భుత చిత్రాన్ని రూపొందించిన వెంకీ అట్లూరికి కృతజ్ఞతలు తెలిపారు. పేద విద్యార్థుల విద్య కోసం ఎంతగానో కృషి చేస్తున్న కేడర్ల రంగయ్యకు అండగా నిలిచి.. ఇంతటి గొప్ప కార్యంలో తాము కూడా భాగం కావాలన్న ఉద్దేశంతో చిత్ర బృందం తరఫున వారి వంతుగా రు. 3 లక్షలు ఆర్ధిక తోడ్పాటు అందించారు.
కాగా.. కోలీవుడ్ స్టార్ ధనుష్ (Dhanush), సంయుక్త మీనన్ (Samyuktha Menon) జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ద్విభాషా చిత్రం సార్(వాతి). సితార ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments), ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ మరియు శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. హీరో సుమంత్ (Sumanth) అతిథి పాత్రలో నటించారు.
ఇవి కూడా చదవండి:
*********************************