Deep Fake: రష్మిక డీప్ ఫేక్ వీడియో, 36 గంటల్లో తొలగించండి, లేదంటే...
ABN, First Publish Date - 2023-11-08T11:18:29+05:30
నటి రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సాంఘీక మాధ్యమంలో వైరల్ అవటం, దాని మీద లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, నటుడు నాగచైతన్య ఇంకా ఎంతోమంది దీని మీద స్పందించి చర్యల కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దాని ఫలితంగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
రష్మిక మందన్న (RashmikaMandanna) డీప్ ఫేక్ వీడియో #DeepFake ఒకటి గత కొన్ని రోజుల నుండి సాంఘీక మాధ్యమంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో నెటిజన్లు మార్ఫింగ్ చేశారని, అసలు వీడియో లో వున్న అమ్మాయి UKలో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందినదన్న విషయం కూడా తెలిసిందే. ఈ వీడియో సాంఘీక మాధ్యమంలో వచ్చిన వెంటనే భారత లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ (AmitabhBachchan) వెంటనే స్పందించి ఇలా డీప్ ఫేక్ వీడియో పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సాంఘీక మాధ్యమం ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఈ విషయమై చాలామంది సాంఘీక మాధ్యమంలో ఆందోళన వ్యక్తం చేసిన విషయం కూడా తెలిసిందే. తెలంగాణా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (KalvakuntlaKavitha) కూడా రష్మిక డీప్ ఫేక్ వీడియో మీద కేంద్రానికి, ఐటి మినిస్టర్ కి టాగ్ చేస్తూ సాంఘీక మాధ్యమంలో తన ఆందోళన వ్యక్తం చేసిన సంగతి కూడా తెలిసిందే. ముఖ్యంగా మహిళలమీద జరుగుతున్న ఇటువంటివాటిని వెంటనే ఆపడానికి తగిన చర్యలు తీసుకోవాలన్పి భాద్యత ని కూడా గుర్తు చేశారు కవిత. అలాగే పరిశ్రమ నుండి ప్రముఖ నటుడు నాగ చైతన్య (NagaChaitanya) కూడా స్పందించి డీప్ ఫేక్ #DeepFake వీడియో పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక సాంఘీక మాధ్యమంలో అయితే నెటిజన్స్ చాలామంది దీని మీద రెస్పాండ్ అయ్యారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే స్పందించింది. ఇక నుండి సాంఘీక మాధ్యమంలో తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్‌లు, నిబంధనలను ఉల్లంఘించే ఇతర కంటెంట్‌లను గుర్తించి, వాటి మీద కంప్లైంట్ ఇచ్చిన 36 గంటల్లోపు వాటిని తొలగించాలని కేంద్రం ప్రధాన సోషల్ మీడియా కంపెనీలకు సలహా జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్రం ఒక అధికారిక ప్రకటనలో మంగళవారం తెలిపింది. నటి రష్మిక మందన్న యొక్క డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చాలా మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు తమ ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన విడుదల చెయ్యడం జరిగింది.
ఈ ప్రకటనలో ఇంకా ఏమి చెప్పారంటే, ఐటి రూల్స్ 2021 ప్రకారం నిర్దేశించిన సమయంలో రిపోర్ట్ చేసిన 36 గంటలలోపు ఇలాంటి అసభ్య వీడియోస్, కంటెంట్ తీసివేయండి, అలాగే అటువంటి కంటెంట్ వున్నప్పుడు వెంటనే మిగతా వాళ్ళకి కనిపించకుండా ఆ సమాచారాన్ని నిలిపివేయండి అని పేర్కొంది. అలాగే ఒక వ్యక్తిని ఆర్టిఫీషియల్ మార్ఫింగ్ చేయబడిన ఫోటోలు లేదా ఇతర ఫోటోలు ఏదైనా అలాంటివి చేసినప్పుడు, ఆ వ్యక్తి ఫిర్యాదు చేసిన 24 గంటల్లోపు చర్య తీసుకోవాలని సోషల్ మీడియా కంపెనీలకు సూచించబడింది.