Vaishnavi Chaitanya: టిక్‌టాక్ ‘బేబీ’ హీరోయిన్ ఏంటన్నారు?
ABN, First Publish Date - 2023-07-09T11:18:00+05:30
ఈవెంట్లలో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించి... షార్ట్‌ఫిల్మ్స్, వెబ్‌సిరీస్‌లు, ఇన్‌స్టా రీల్స్ ద్వారా విపరీతమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది వైష్ణవి చైతన్య. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే... ‘బేబీ’తో వెండితెరపై హీరోయిన్‌గా మెరిసేందుకు సిద్ధమైంది. ‘సోషల్ మీడియా టూ సిల్వర్ స్ర్కీన్’ ప్రయాణం ఎలా సాగిందో ఆమె మాటల్లోనే.
ఈవెంట్లలో బ్యాగ్రౌండ్ డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించి... షార్ట్‌ఫిల్మ్స్, వెబ్‌సిరీస్‌లు, ఇన్‌స్టా రీల్స్ ద్వారా విపరీతమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకుంది వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya). ఆ తర్వాత సీన్ కట్ చేస్తే... ‘బేబీ’తో (Baby) వెండితెరపై హీరోయిన్‌గా మెరిసేందుకు సిద్ధమైంది. ‘సోషల్ మీడియా టూ సిల్వర్ స్ర్కీన్’ ప్రయాణం ఎలా సాగిందో ఆమె మాటల్లోనే... (Tiktok Beauty)
డ్యాన్స్‌లు చేసి...
మాది మధ్యతరగతి కుటుంబం. స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే కుటుంబ బాధ్యతలు మోయాల్సి వచ్చింది. ఆడియో లాంచ్, పెళ్లిళ్లు, డ్యాన్స్ ఈవెంట్లకు బ్యాగ్రౌండ్ డ్యాన్సర్‌గా వెళ్లేదాన్ని. ఆ కొద్ది ఆదాయంతోనే ఇళ్లు గడిచేది. ఒక డ్యాన్స్ ఈవెంట్ దగ్గర ఎవరో కాస్టింగ్ వాళ్ల నంబరు దొరికితే... వాళ్లను కాంటాక్టయ్యాను. అలా మొదటిసారి షార్ట్‌ఫిల్మ్‌లో నటించే అవకాశం దక్కింది. శాస్త్రీయ, పాశ్చాత్య నృత్యంలో నాకు ప్రావీణ్యం ఉంది. స్కూలు, కాలేజీలో ఏ ఈవెంట్ జరిగినా అక్కడ నా డ్యాన్స్ ఉండాల్సిందే. నాకు వచ్చిన ట్రోఫీలు, మెడల్స్‌తో ఇంట్లో అల్మరా మొత్తం నిండిపోయింది. ఆ డ్యాన్సే ఈ రోజు నన్ను ఈ స్థాయిలో నిలిపింది.
అప్పు చేసి మరీ ఆడిషన్స్‌కి ...
హీరోయిన్ కావాలనేది నా కల. పదిహేనేళ్లు కూడా రాకముందే అవకాశాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేదాన్ని. చార్జీలకు డబ్బులు కూడా ఉండేవి కావు. తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేసి వెళ్లేదాన్ని. తీరా ఆడిషన్‌కు వెళ్లాక ‘తరువాత చెబుతాం’ అనేవాళ్లు. ఆ తర్వాత వాళ్ల నుంచి పిలుపు వచ్చేది కాదు. దాంతో ఏడ్చేదాన్ని. చిన్న పాత్రలైనా చేద్దామని నిర్ణయించుకున్నా. ‘అల వైకుంఠపురంలో’, ‘టచ్ చేసి చూడు’... వంటి సినిమాల్లో పాత్ర చిన్నదైనా నటించా. ‘సాఫ్ట్‌వేర్ డెవ‘లవ్’పర్’ వెబ్‌సిరీస్‌లో నా నటన నచ్చి ‘బేబీ’లో అవకాశం ఇచ్చారు. దాంతో ‘టిక్‌టాక్‌లు చేసే పిల్లని హీరోయిన్‌గా ఎలా పెట్టారు?’ అని నన్ను ట్రోల్ చేశారు. అయితే నాపై నాకు పూర్తి విశ్వాసం ఉంది.
వాట్సాప్ డీపీగా...
‘బేబీ’ టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో స్ర్కీన్‌పై నన్ను చూడగానే ఆనందంతో అమ్మా నాన్నల కళ్లు చెమ్మగిల్లాయి. మొదట్లో బంధువులంతా నన్ను చిన్నచూపు చూసేవారు. కానీ ఇప్పుడు వాళ్ల ఫోన్ వాల్‌పేపర్‌గా, వాట్సాప్ డీపీలుగా నా ఫొటోలను పెట్టుకుంటున్నారు.
చెంప చెళ్లుమనిపించా
నాకు, నా తమ్ముడికి మధ్య ఉన్న అనుబంధమే వేరు. చిన్నప్పుడు ఎవరైనా వాడిని కొడితే వెంటనే వెళ్లి వాళ్లను చితకబాదేదాన్ని. ఓసారి బోనాల జాతరకు వెళ్లాం. అక్కడ ఒక పోకిరి నన్ను వెంబడించి, నా చేయి పట్టుకునే ప్రయత్నం చేశాడు. వెంటనే వాడి చెంప చెళ్లుమనిపించా.
ఆమె నచ్చుతుంది
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అనుష్క అంటే చాలా ఇష్టం. ఆమె ఏం చేసినా, ఎలా ఉన్నా నచ్చుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె నా ఫీమేల్ క్రష్. రామ్ పోతినేనికి పెద్ద అభిమానిని. ‘దేవదాసు’ చూసినప్పటి నుంచి అతడి నటనకి ఫిదా అయ్యా.
చీరలంటేనే ఇష్టం
పార్టీలు, ఫంక్షన్లకు వెళ్లడం కన్నా ఒంటరిగా గడపడమంటేనే ఇష్టం. ఎప్పుడైనా మనసు బాగోలేకుంటే వెంటనే గుడికి వెళ్తా. చీరలు, చుడీదార్స్ ధరించడం ఇష్టం. ఇంట్లో ఉన్నప్పుడు కూడా చీరలే నా ఛాయిస్. కట్టుకోవడాన్నే ఇష్టపడతా. అన్నం, పప్పు, ఎగ్ బుర్జీ ఉంటే చాలు... జీవితాంతం వాటినే తిని బతికేస్తా. వర్కవుట్స్ ఖచ్చితంగా చేస్తుంటా. నాలో ఎవరికీ తెలియని మరో టాలెంట్ కూడా ఉంది. ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కోసం సమయం వెచ్చిస్తా. ఇంట్లో మూలన పడి ఉన్న డబ్బాలు, కాగితాలను కలెక్ట్ చేసి వాటితో క్రియేటివ్‌గా ఏదో ఒకటి తయారుచేస్తుంటా.