Jamuna Demise: టాలీవుడ్ ప్రముఖుల సంతాపం
ABN, First Publish Date - 2023-01-27T11:22:03+05:30
సీనియర్ నటి, టాలీవుడ్ ‘సత్యభామ’ జమున మరణంతో తెలుగు ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.
సీనియర్ నటి, టాలీవుడ్ ‘సత్యభామ’ జమున మరణంతో తెలుగు ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. దీంతో ఎంతోమంది టాలీవుడ్ ప్రముఖులు ఆమె మృతికి సంతాపం తెలుపుతున్నారు.
ప్రముఖ నటి, లోక్సభ మాజీ సభ్యురాలు శ్రీమతి జమున గారు దివంగతులు కావడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అలనాటి తరానికి ప్రతినిధిగా ఉన్నారు. వెండితెరపై విభిన్న పాత్రలు పోషించిన శ్రీమతి జమునగారు తెలుగు ప్రేక్షకులకు మాత్రం సత్యభామగానే గుర్తుండిపోయారు. ఆ పౌరాణిక పాత్రకు జీవం పోశారు. ఠీవీగాను, గడుసుగాను కనిపించే పాత్రల్లోనే కాకుండా అమాయకత్వం ఉట్టిపడే పాత్రల్లోనూ ప్రేక్షకుల మెప్పు పొందారు. ప్రజా జీవితంలో లోక్సభ సభ్యురాలిగా సేవలందించారు. శ్రీమతి జమునగారి మృతికి చింతిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
- పవన్ కల్యాణ్
జమునగారి మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆమె చేసిన అన్ని ఐకానిక్ పాత్రలు, పరిశ్రమకు ఆమె చేసిన సేవని తెలుగువారు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఆమె కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి.
- మహేశ్ బాబు
అలనాటి నటి, మాజీ ఎంపీ జమున మరణించడంతో చాలా బాధగా ఉంది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.
- విజయశాంతి
దాదాపుగా 30 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహారాణిలా కొనసాగారు. గుండమ్మ కథ, మిస్సమ్మలాంటి ఎన్నో మరుపురాని చిత్రాలు, మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో మా మనసుల్లో చెరపలేని ముద్ర వేశారు. మీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. జమునగారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.
- ఎన్టీఆర్