Heroines : సీనియర్లూ... చూపించండి జోరు.. హిట్టు కొడితే..!
ABN, First Publish Date - 2023-10-01T12:04:40+05:30
అనుభవం అన్నింటికంటే గొప్పది. అన్నీ అదే నేర్పిస్తుంది. పడడం.. లేవడం.. నిలదొక్కుకోవడం.. పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం ఇవన్నీ అనుభవం ద్వారా తెలుసుకోగలిగే పాఠాలే! ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో కూడా అదే చెబుతుంది. సీనియర్లు హిట్టు కొడితే.. మామూలుగా ఉండదు. ఆ జోరు వేరే లెవల్.
అనుభవం అన్నింటికంటే గొప్పది. అన్నీ అదే నేర్పిస్తుంది. పడడం.. లేవడం.. నిలదొక్కుకోవడం.. పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం ఇవన్నీ అనుభవం ద్వారా తెలుసుకోగలిగే పాఠాలే! ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో కూడా అదే చెబుతుంది. సీనియర్లు హిట్టు కొడితే.. మామూలుగా ఉండదు. ఆ జోరు వేరే లెవల్. సినిమాల్లోనూ అంతే. ఓ పెద్ద హీరో ఖాతాలో హిట్ పడితే బాక్సాఫీసు షేక్ అయిపోతుంది. హీరోయిన్లకూ అది వర్తిస్తుంది. సీనియర్ భామలు మళ్లీ రేసులోకి వస్తే చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఇప్పుడు అనుష్క, తమన్నా, సమంత, నయనతార వీళ్లంతా అదే చేస్తున్నారు.
కథానాయికల కెరీర్ గాల్లో దీపం లాంటిది. ఎప్పుడు వెలుగుతుందో, ఎప్పుడు మసకబారుతుందో చెప్పడం కష్టం. ఎంత ప్రతిభ ఉన్నా... నాలుగైదేళ్లే జోరు. ఆ తరవాత కొత్త తరానికి దారి వదలాల్సిందే. ఓ నాయిక పదేళ్ల పాటు ప్రయాణం చేసిందంటే అది గొప్ప విషయమే. అనుష్క(Anushka), నయనతార(nayanathara), తమన్నా, సమంత(Samantha), కాజల్(kajal)... వీళ్లందరూ దశాబ్దంగా చిత్రసీమలో ఉన్నవారే. వీళ్లకంటూ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాలున్నాయి. అయితే.. మధ్యలో కాస్త బ్రేక్ పడింది. దాంతో స్పీడు తగ్గింది. ఓ హిట్టు పడితే... కచ్చితంగా రేసులోకి వస్తారని అందరికీ తెలుసు. ఇప్పుడు అదే హిట్టుతో వీళ్లంతా తమ హవా మరోసారి చూపించారు.
‘బాహుబలి’ తరవాత అనుష్క కెరీర్ ఎందుకో గాడి తప్పింది. తాను ఎంచుకొన్న కథలు, తాను నమ్ముకొన్న సినిమాలూ సరిగా ఆడలేదు. అదే సమయంలో తన శరీరం విశ్రాంతి కోరుకొంది. అందుకే స్వీటీ నుంచి సినిమాలు తగ్గాయి. అనుష్క సినిమాలకు గుడ్ బై చెప్పిందని, ఇక నటించదని చాలా వార్తలొచ్చాయి. పెళ్లి చేసుకొంటుందని సెటిలైపోతుందని కూడా అన్నారు. అయితే ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’తో తను మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఈ సినిమాలో అనుష్క తన స్ర్కీన ప్రెజెన్సతో ఆకట్టుకొంది. తనని చూడ్డానికి ప్రేక్షకులు ఇంకా థియేటర్లకు వస్తున్నారనే విషయాన్ని నిరూపించింది. ఇప్పుడు అనుష్క కాల్షీట్ల కోసం నిర్మాతలు యధావిధిగా ఎగబడుతున్నారు. చిరంజీవి చిత్రంలో అనుష్క కథానాయికగా నటించబోతోందని ఓ టాక్ వినిపిస్తోంది.
‘యశోద’, ‘శాకుంతలం’తో సమంత కెరీర్ అగమ్యగోచరంగా తయారైంది. మరోవైపు ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. చేతిలో ఉన్న సినిమాల్నే పూర్తి చేస్తుందా? లేదా? అనే అనుమానం ఆవహించింది. ఈ దశలో ‘ఖుషి’ సినిమాతో మళ్లీ తనని తాను నిరూపించుకొంది సమంత. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సమంతకు నైతిక ధైర్యాన్ని అందించింది. ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ కోసం కాల్షీట్లు ఇచ్చింది. బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తోందని, సల్మాన పక్కన జోడీగా నటిస్తోందన్న కథనాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సమంత విశ్రాంతి తీసుకొంటుంది. విదేశాలు చుడుతోంది. అక్కడి నుంచి తిరిగొచ్చాక తన కొత్త సినిమాలు మొదలవుతాయి.
నయనతార ముందు నుంచీ సెలక్టీవ్‌గానే సినిమాలు చేస్తోంది. నయనని ఒప్పించడం చాలా కష్టమన్నది దర్శక నిర్మాతల అభిప్రాయం. పైగా తను ప్రమోషన్లకు రాదు. వీటన్నింటినీ భరించడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అందుకే నయన జోరు ఈమధ్య కాస్త తగ్గింది. అగ్ర కథానాయకులు సైతం కొత్తమ్మాయిలనే ఎంచుకొంటున్నారు. ఈదశలో ‘జవాన’లో మెరిసింది నయన. తన స్థాయికి, వయసుకి తగిన పాత్ర చేసింది. ఈ సినిమా పాన ఇండియా స్థాయిలో పెద్ద విజయాన్ని అందుకొంది. ‘జవాన’ ఇచ్చిన బూస్టప్‌తో బాలీవుడ్ నుంచి నయనకు ఆఫర్లు వస్తున్నాయి. ఇది నయన ఇన్నింగ్స్‌కి కొత్త మలుపు. తమన్నా కూడా ఫ్లాపుల నుంచి హిట్ ట్రాక్ పట్టింది. కొంతకాలంగా తమన్నా చేతిలో విజయాల్లేవు. దానికి తోడు తమన్నా చేసిన వెబ్ సిరీస్‌లూ బోల్తా కొట్టాయి. ఈ దశలో.. ‘జైలర్’తో హిట్టు అందుకొంది. తమన్నాది ఈ సినిమాలో గెస్ట్ రోలే కావొచ్చు. కానీ తన ఖాతాలోనూ హిట్ పడేసరికి.. పెద్ద హీరోల దృష్టి తమన్నా వైపు మళ్లింది. రజనీకాంత కొత్త సినిమాలో తమన్నా అవకాశం అందుకొందని టాక్.
‘అమ్మ’గా మారాక.. కాజల్ స్పీడు తగ్గుతుందని అంతా ఊహించారు. కానీ.. విచిత్రంగా ఇప్పుడే కాజల్ బిజీ అయిపోయింది. ‘భగవంత కేసరి’లో ఆమె కీలక పాత్ర పోషిస్తోంది. చేతినిండా వెబ్ సిరీస్‌లూ, వెబ్ సినిమాలు ఉన్నాయి. ఓ బాలీవుడ్ చిత్రం నుంచి కాజల్‌కు క్రేజీ ఆఫర్ వచ్చిందని టాక్. త్రిష కూడా ఇప్పుడు మంచి స్వింగ్‌లో ఉంది. ‘పొన్నియన సెల్వన’ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. వయసు పెరుగుతున్నా.. ఆమె తన అందాన్ని కాపాడుకొన్న విధానం అందరికీ నచ్చుతోంది. అదే త్రిషలోని ప్లస్ పాయింట్. ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ సీక్వెల్‌లో త్రిష నటించబోతోంది.
సీనియర్ హీరోయిన్లు హిట్ కొట్టడం పరిశ్రమలో మంచి పరిణామమే. ఎందుకంటే చిరంజీవి, నాగార్జున, వెంకటేశ, కమల్‌హాసన లాంటి సీనియర్ హీరోల పక్కన నటించడానికి మంచి ఛాయిస్ దొరికినట్లు అవుతుంది. పైగా.. లేడీ ఓరియెంటెడ్ కథలు మరిన్ని రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కొత్త హీరోయిన్లకు పోటీ ఉన్నప్పుడే కదా.. వారిలోని ప్రతిభ పూర్తి స్థాయిలో బయటకు వచ్చేది. అలా ఎలా చూసినా సీనియర్ హీరోయిన్లు జోరు చూపించడం అత్యవసరం.. శుభపరిణామం.