Kotabommali PS: ఈ సినిమా జాప్యం వెనక రాహుల్ చెప్పిన షాకింగ్ నిజం
ABN, First Publish Date - 2023-11-15T18:24:42+05:30
'కోటబొమ్మాళి పీఎస్' సినిమా షూటింగ్ మొదలు పెట్టాక పూర్తి చెయ్యడానికి చాలా టైము తీసుకుంది. ఇందులో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ లు ప్రధాన పాత్రలు పోషించగా, రాహుల్ విజయ్ కి జరిగిన ఒక సంఘటన వలన జాప్యం జరిగింది అని తెలిసింది. ఇంతకీ ఏమి జరిగింది అంటే...
గీత ఆర్ట్స్ 2 (GeethaArts2) లో బన్నీ వాసు (BunnyVasu) నిర్మిస్తున్న 'కోటబొమ్మాళి పీఎస్' #KotabommaliPS సినిమా షూటింగ్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఎందుకో చాలా ఎక్కువ రోజులు తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమాలో శ్రీకాంత్ (Srikanth), రాహుల్ విజయ్ (RahulVijay), శివాని రాజశేఖర్ (ShivaniRajasekhar) ప్రధాన పాత్రల్లో కనపడతారు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ (VaralakshmiSarathKumar), మురళి శర్మ (MuraliSharma) కూడా వున్నారు. తేజ మార్ని (TejaMarni) దీనికి దర్శకుడు.
ఈ సినిమా చాలా కాలంగా షూటింగ్ చేసినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చిన తరువాత ఎన్నో రోజులు పట్టింది షూటింగ్ పూర్తి అవటానికి. దానికి కారణం ఇందులో నటించిన రాహుల్ విజయ్, అతనికి ఏమైంది అని అనుకుంటున్నారా, అతని వలన ఎందుకు జాప్యం జరిగింది అని అనుకుంటున్నారా.
రాహుల్ విజయ్ ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టిన తరువాత ఇంట్లో కాలుజారి పడిపోయాడట. కాలు విరిగిపోయింది, నాలుగు నెలలు విశ్రాంతి అవసరం అని డాక్టర్లు చెప్పారు అతనికి. "నన్ను సినిమాలోనుండి తీసేస్తారు అనుకున్నా, ఎందుకంటే అన్ని నెలలు ఎందుకు వెయిట్ చేస్తారు ఎవరైనా, కానీ ఈ సినిమా నిర్మాత దర్శకులు మాత్రం నా కోసం ఆగారు, అందుకే సినిమా జాప్యం జరిగింది," అని చెప్పుకొచ్చాడు రాహుల్ విజయ్. నిర్మాత, దర్శకులకి థాంక్స్ కూడా చెప్పాడు, తనని పెట్టుకున్నందుకు. అదే వేరే వాళ్ళు అయితే నన్ను తీసేసేవాళ్ళేమో అని అన్నాడు రాహుల్.
మళ్ళీ కాలు బాగయ్యాక సినిమాలో 'లింగిడి లింగిడి' పాటకు డాన్స్ కూడా బాగానే చేసాడు రాహుల్. "అప్పుడపుడు మధ్యలో కూర్చొని, నిలుచొని వున్న సన్నివేశాలు కొన్ని చిత్రీకరించాం, కానీ సినిమా జాప్యానికి మాత్రం నా కాలు విరగటం, నేను పూర్తిగా కోలుకునేంత వరకు వేచి ఉండటం," అని చెప్పాడు రాహుల్.