Adipurush: బాగోలేదు అనడానికి ఈ కారణాలు చాలు అంటున్నారు
ABN, First Publish Date - 2023-06-16T17:49:15+05:30
రూ 500 కోట్లు పైన బడ్జెట్ పెట్టి తీసిన 'ఆదిపురుష్' సినిమా మీద ఉదయం ఆట నుండి విమర్శల వెల్లువ మొదలయింది. రామాయణం ఆధారంగా తీసిన ఈ సినిమా ప్రేక్షకులు తిరస్కరించడానికి ఈ అయిదు కారణాలు చాలు అని అంటున్నారు.
ఆదికావ్యం రామాయణం ఆధారంగా ఓం రౌత్ (OmRaut) తీసిన 'ఆదిపురుష్'లో #Adipurush ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (KritiSanon) జంటగా నటించారు. ఈ సినిమా భారీ అంచనాలతో ఈరోజు అంటే జూన్ 16 విడుదల అయింది. ఈ సినిమాకి విడుదల కి ముందు ఎంత క్రేజ్ వచ్చిందో, ఉదయం ఆట ముగియగానే ఆ క్రేజ్ పోయే విధంగా, ఈ సినిమా బాగోలేదని సాంఘీక మాధ్యమాల్లో, సినిమా చూసిన ప్రేక్షకులు చెపుతున్నారు. మొత్తం ఇలా అందరూ చెప్పిన దాన్ని బట్టి ఈ సినిమా ఎందుకు బాగోలేదు అనే విషయంలో ఈ కింది కారణాలు చెప్తున్నారు.
రావణాసురుడు పాత్ర
మొట్ట మొదట అందరూ ఏకగ్రీవంగా తప్పు పడుతున్నది రావణాసురిడి పాత్రని. ఇది సైఫ్ అలీ ఖాన్ (SaifAliKhan) వేసాడు, అతను ఆ పాత్రకి సరిపోయినా, దర్శకుడు ఆ పాత్రని చూపించే విధానం, తీర్చి దిద్దిన పద్ధతి బాగోలేదు అని అంటున్నారు. రావణాసురుడు గొప్ప శివభక్తి పరాయణుడు, అలాగే వేద వేదాంగాలూ తెలిసినవాడు. ఒక్క సీతమ్మ విషయంలోనే పొరబడ్డాడు, ధర్మం తప్పాడు. అటువంటి రావణాసురిడి పాత్రని ఓం రౌత్ ఒక హాలీవుడ్ విలన్ లా తీర్చి దిద్దాడు. రావణుడికి కోపం వస్తే పది తలలు వస్తాయి, ఆ తలల విషయంలో కూడా ఓం రౌత్ సరిగ్గా చూపించలేకపోయాడు. ఆ పాత్రని మలచిన తీరు ప్రేక్షకులకు అసలు నచ్చలేదు. అదేంటి రావణాసురుడు కొండచిలువలతో మర్దనా చేయించుకుంటున్నాడు సినిమాలో అని ముక్కున వేలేసుకున్నవాళ్ళు కూడా వున్నారు. ఎంత దారుణం ఓం రౌత్ !
విఎఫ్ఎక్స్ బాగోలేదు
సినిమాకి ఆయువుపట్టు లాంటిది ఈ విఎఫ్ఎక్స్ (VFX), కంప్యూటర్ గ్రాఫిక్స్. ఇవి సరిగ్గా ఉపయోగించలేకపోయాడు. ఏభయ్యేళ్ల క్రితం నాటి తెలుగు పౌరాణిక సినిమాలు చూసినా ఎంతో చక్కగా ఉంటాయి, ముఖ్యంగా ఆ యుద్ధ సన్నివేశాలు. అప్పట్లో అసలు సాంకేతికత లేని సమయంలో కూడా ఆ యుద్ధ సన్నివేశాలు అంత ఆసక్తికరంగా చిత్రీకరించారంటే ఆ చిత్ర నిర్వాహకులకు, సాంకేతిక నిపుణలకు ఆ కథ మీద వున్న పట్టు. అందుకనే అవి అజరామరంగా ఈనాటికి చూడగలుగుతున్నాం. మరి ఇప్పుడు 2023 సంవత్సరంలో ఇంత సాంకేతిక అభివృద్ధి చెందినా, ఈ 'ఆదిపురుష్' #Adipurush లో ఎందుకు సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారో అర్థం కావటం లేదు. ప్రేక్షకులకి ఇది నచ్చలేదు. ఒక సన్నివేశంలో చిన్నగా, ఇంకో సన్నివేశంలో పెద్దగా బొమ్మలు కనపడుతుంటే, ఆ టెక్నాలజీ అస్సలు సరిగ్గా ఉపయోగించుకోలేక పోయారు అని అంటున్నారు. ఇది సినిమా బాగా నడవకపోవటానికి ముఖ్య కారణం అని చెప్పొచ్చు.
డబ్బింగ్ సినిమా లా కూడా లేదు
మామూలుగా అయితే తమిళ, మలయాళం, కన్నడ సినిమాలు తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేస్తారు. కొన్ని సినిమాలు బాగా సింక్ అవుతాయి, కొన్ని అవ్వవు. రూ. 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ముందు తెలుగులోనే పెద్ద స్టార్ గా వుండి, ఆ తరువాత కదా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ప్రభాస్. మరి అలాంటిది తెలుగులో విడుదల చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కదా, అస్సలు తీసుకోలేదు. ఎందుకంటే ఇది డబ్బింగ్ సినిమాకన్నా కనికష్టంగా వుంది అని ప్రేక్షకులు అంటున్నారు. ఎవరి పాత్ర కూడా తెలుగు భాషకి అస్సలు సింక్ కాలేదు. అదీ కాకుండా ఆ పేర్లు కూడా తెలుగువాళ్ళకు అంతగా ఎక్కలేదు.
యుద్ధ సన్నివేశాలు
'ఆదిపురుష్' మొదటి సగం వనవాసం నుండి సుగ్రీవుడిని కలుసుకునే వరకు చూపించారు. రెండో సగం లో యుద్ధం ఎక్కువగా చూపించారు, కానీ ఈ యుద్ధ సన్నివేశాలు అస్సలు బాగోలేదు. ఏదో తొందరతొందరగా తీసెయ్యాలి అనేట్టుగా తీసేసారు. కుంభకర్ణుడి పాత్ర యుద్ధంలో ఒక మంచి ఘట్టం. అది ఒకటి రెండు నిముషాలు మాత్రమే ఉండేట్టు చేసాడు. ఇంద్రజిత్ ని చంపటం అయితే ఆదో పెద్ద జోక్ లా అయిపొయింది. ఈ సినిమాకి పని చేసిన వారు ఎవరూ ఏ రామాయణం చదివినట్టుగా కూడా కనిపించలేదు. అందుకే యుద్ధ సన్నివేశాలు అంత బోర్ గా చిత్రీకరించారు. హనుమంతుడు లంకా పట్టణంలో సృష్టించిన భీభత్సం మామూలుగా చూపించేసారు. హనుమంతుడు అశోక వనాన్ని ధ్వంసం చేస్తాడు, కానీ సినిమాలో హనుమంతుడు సీత ముందే యుద్ధం చేసేస్తూ ఉంటాడు.
ప్రభాస్ పాత్ర
రాముడిగా ప్రభాస్ #Prabhas కొన్ని సన్నివేశాల్లో చూడటానికి బాగున్నా రెండో సగం లో మాత్రం అతని పాత్రని కేవలం గ్రాఫిక్స్ వరకే పరిమితం చేసేసారు. అతని వేష ధారణ అయితే అంతగా బాగోలేదని చెప్పాలి, ముఖ్యంగా తండ్రి దశరధుడితో మాట్లాడుతున్నప్పుడు. రాముడు, సీత, లక్ష్మణుడు నార చీరలు ధరించి అడవికి బయలుదేరారు. కానీ ఇక్కడ ఆలా కనిపించలేదు. అదీ కాకుండా రాముడు, సీత మధ్యలో ఆ అనుబంధం సరిగ్గా చూపించలేకపోయాడు. కృతి సనన్ కూడా జానకి గా అంత మెప్పించలేకపోయింది. రావణాసురుడు విమానంలో సీతమ్మవారిని తీసుకువెళ్లిపోతాడు ఒరిజినల్ రామాయణంలో, కానీ ఓం రౌత్ ఇక్కడ అదేదో వింత పక్షిని పెట్టాడు. హాలీవుడ్ నిపుణులను పెట్టినట్టున్నాడు, అందుకే ఎక్కడా భారతీయ ఇతిహాసం లో చూపించినట్టు కాకుండా, ఎక్కడో వింతలోకం నుండి వింత జీవులు వచ్చినట్టుగా చూపించారు.