Suresh Kondeti: తెలుగు సినిమా పరిశ్రమ పరువు తీసిన సురేష్ కొండేటి: టి.ఎఫ్.సి.సి
ABN, First Publish Date - 2023-12-06T11:23:50+05:30
కొన్ని రోజుల క్రితం జరిగిన సంతోషం ఫిలిం అవార్డ్స్ లో చాలా అవకతవకలు జరగడమే కాకుండా, ఆ ఫంక్షన్ ఆర్గనైజర్ అయిన సురేష్ కొండేటి హోటల్స్, ట్రాన్స్ పోర్ట్, విమానం టికెట్స్ దేనికీ బిల్లులు సరిగా కట్టకపోవటంతో ఈ వేడుకకి వచ్చిన సెలబ్రిటీస్ చాలా బాధలు పడ్డారని, టి.ఎఫ్.సి.సి ఒక ప్రకటనలో చెప్పింది, అలాగే సురేష్ వలన తెలుగు చిత్ర పరిశ్రమకి చాలా చెడ్డ పేరు వచ్చిందని, అతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పింది.
కొన్ని రోజుల క్రితం గోవా వేదికగా సంతోషం ఫిలిం అవార్డుల పండగ జరిగింది. సంతోషం సురేష్ గా పేరు గాంచిన సురేష్ కొండేటి ఈ అవార్డులను గత కొన్ని సవంత్సరాలుగా ఇస్తున్నాడు. ఒక్క తెలుగు నటీనటులకు కాకుండా, దక్షిణాదిలో ఉన్న తమిళం, కన్నడ, మలయాళ భాషల నటీనటులకు కూడా ఈ సంతోషం అవార్డులు ఇస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం గోవాలో జరిగిన వేడుకల్లో సురేష్ కొండేటి తెలుగు సినిమా పరిశ్రమ పరువుతీసే పనులు చెయ్యడమే కాకుండా, అక్కడకి వచ్చిన సినిమా సెలబ్రిటీస్ ని పట్టించుకోకుండా మధ్యలోనే వెళ్ళిపోయినట్టుగా తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ (TFCC) అధికారికంగా ఒక ప్రకటన ఇచ్చింది. అందుకని అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా అతను వున్న అన్ని అస్సోసియేషన్స్ కి లెటర్స్ పంపింది.
ఎక్కువగా హైదరాబాదులో నిర్వహించే ఈ అవార్డుల వేడుక ఈసారి గోవాలో నిర్వహించాడు సంతోషం సురేష్. ఆ వేడుకకి రామ్ చరణ్ వస్తున్నారు, ఇంకా చాలామంది తెలుగు అగ్ర నటులు వస్తున్నారు అని బాగా ప్రచారాలు చేయించాడు. అయితే రామ్ చరణ్ ఈ వేడుకకి రాలేదు, రానని చెప్పారని కూడా భోగట్టా. కానీ సంతోషం సురేష్ రామ్ చరణ్ పేరుని ఇలా వాడుకున్నట్టుగా పరిశ్రమలో చెపుతున్నారు.
గోవాలో ఒక స్టేడియం లో ఈ అవార్డులు వేడుక జరిగింది. మూడు గంటలకి మొదలవ్వాల్సి వేడుక, రాత్రి 8 గంటలకి మొదలైందని, మలయాళం అవార్డులు ఇచ్చిన తరువాత ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడే సమయానికి, లైట్లు, మైక్ ఆపేశారని తెలిసింది. అప్పుడు అల్లు అరవింద్, దామోదర ప్రసాద్ ఏమైందని వాకబు చేస్తే, సురేష్ కొండేటి ఆర్గనైజర్లుకి డబ్బులు కట్టలేదని తెలిసింది. అల్లు అరవింద్ వాళ్ళతో మాట్లాడి అరగంటలో మళ్ళీ ఏర్పాట్లు చేసినట్టుగా కూడా చెపుతున్నారు.
నాలుగు భాషల నటీనటులను ఆహ్వానించటమే కాకుండా, వారిని జాగ్రత్తగా మళ్ళీ వెనక్కి పంపే బాధ్యత కూడా ఆర్గనైజర్ గా సురేష్ కొండేటి బాధ్యత, కానీ అతను ఇవన్నీ చూడకుండా తెల్లవారుజామున ఎవరికీ చెప్పా పెట్టకుండా గోవా నుండి హైదరాబాద్ వచ్చేసాడు అని ఆ ప్రకటనలో చెప్పారు. అక్కడ సెలబ్రిటీస్ వున్న హోటల్ కి కనీసం డబ్బులు కట్టలేదు, వాళ్ళకి వసతులు సరిగ్గా ఉన్నాయో లేదో, వాళ్ళ బాగోగులు, ముఖ్యంగా ఆడవాళ్ళకి కనీస భద్రత కూడా చూపించకుండా సురేష్ అన్నీ వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చేసాడని, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడని, తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర ప్రసాద్ చెప్పారు. అల్లు అరవింద్, దామోదర ప్రసాద్ లు తమ సొంత డబ్బుతో కొంతమందిని జాగ్రత్తగా ఇంటికి పంపినట్టుగా కూడా చెపుతున్నారు.
గోవాలో సురేష్ కొండేటి, తాను మెగాస్టార్ చిరంజీవికి పీఏ అని, చిత్ర పరిశ్రమలో ముఖ్యమైన వ్యక్తిని అని చెప్పి చాలా పనులు చేసుకున్నట్టుగా తెలిసింది. గోవా ముఖ్యమంత్రి కూడా ఈ వేడుకకు వస్తున్నట్టుగా సురేష్ కొండేటి అక్కడున్న అందరికీ తప్పుడు సమాచారం చెప్పడంతో చాలామంది మలయాళం సెలబ్రిటీస్ అది నిజమే అనుకోని ఈ వేడుకకు వచ్చినట్టుగా అర్థం అవుతోందని తెలిసింది. అదీ కాకుండా తెలుగు చలన చిత్ర పరిశ్రమ పేరు కూడా వాడుకోవటంతో, ఈ అవార్డుల వేడుక మధ్యలో వదిలేసి సురేష్ వెళ్లిపోవటంతో, కన్నడ, తమిళ పరిశ్రమకి చెందిన చాలామంది సెలబ్రిటీస్ తెలుగు సినిమా పరిశ్రమ మీద విమర్శలు చేశారు. చిరంజీవి పీఏ అందరినీ చీట్ చేసాడని సాంఘీక మాధ్యమాల్లో వీడియోలు పెట్టడంతో తెలుగు పరిశ్రమలోని పెద్దలు దీనిమీద చాలా సీరియస్ గా చర్య తీసుకోవాలని భావించారు.
చిరంజీవి పీఏ అని అందరూ అనటంతో నిర్మాత అల్లు అరవింద్ దీనిమీద స్పందించాల్సి వచ్చింది. సురేష్ కొండేటికి, మా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని అధికారికంగా చెప్పారు. మెగా ఫామిలీ కి పీఆర్ఓ గా అతను చెప్పుకు తిరుగుతున్నాడని, కానీ అతనికి మా కుటుంబంలోని నటీనటులకు ఎటువంటి సంబంధం లేదని చాలా క్లియర్ గా చెప్పేసారు. అయితే అల్లు అరవింద్ ఆ మాట అన్న సమయానికి, నిన్నటి వరకు సురేష్ కొండేటి అధికారిక సాంఘీకమాధ్యమంలో మెగా పీఆర్వో అనే వుంది. నిన్న మళ్ళీ పరిశ్రమలోని పెద్దలు సురేష్ కొండేటికి ఫోన్ చేసి ప్రొఫైల్ లో ఆ పదాలు తీసెయ్యమని చెప్పారని, అప్పుడు తీసేసాడు అని తెలిసింది.
ఒక పక్క తెలుగు సినిమా పరిశ్రమ సురేష్ కొండేటి మీద చాలా సీరియస్ గా ఉంటే, సురేష్ మాత్రం తన తప్పు ఏమీ లేదని, తాను అవార్డుల వేడుక బాగానే నిర్వహించాను అని, ఇంత పెద్ద వేడుక జరిగేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరగడం సహజమని, అందుకు ఎవరైనా అసౌకర్యానికి గురైతే వాళ్ళకి క్షమాపణలు చెపుతున్నాని అని చాలా సింపుల్ గా సాంఘీక మాధ్యమంలో ఒక పోస్ట్ తో తేల్చేసాడు. అలాగే తన మీద కొంతమంది కావాలని బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పాడు సురేష్. మరి చిత్ర పరిశ్రమ అతని మీద ఎందుకు అంత సీరియస్ అయింది అన్నదానికి సమాధానం చెప్పలేదు. అలాగే అతన్ని సపోర్ట్ చేసే మెగా ఫామిలీ నుండి అల్లు అరవింద్ కూడా సురేష్ కొండేటికి మాకు సంబంధం లేదు అని చెప్పడానికి గల కారణాలను కూడా అతను విశదీకరించలేదు ఆ ప్రకటనలో.
తెలుగు సినిమా పరిశ్రమ నుండి వచ్చాం అంటే గోవాలో అరుస్తున్నారు, గౌరవం కూడా ఇవ్వటం లేదు, అటువంటి స్థితికి సురేష్ కొండేటి పరిశ్రమని తీసుకువచ్చాడు అని దామోదర ప్రసాద్ ఒక ప్రకటనలో చెప్పారు. అతని మీద చర్యలు తీసుకోవలసిందిగా అతను ఎటువంటి అసోసియేషన్ లలో మెంబర్ గా వున్నాడో, వాటన్నిటికీ తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ అధికారికంగా లెటర్స్ పంపింది. ఇప్పుడు ఆ అస్సోసియేషన్స్ అన్నీ సురేష్ కొండేటి మీద చర్యలు ఏ విధంగా తీసుకోవాలి అని ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది.
అయితే ఇవ్వన్నీ కామనే, కొన్ని రోజులు ఇలానే ఉంటుంది, కానీ ఈ సంఘటన మరిచిపోయాక సురేష్ ని మళ్ళీ ఇదే మెగా ఫామిలీ వెనకాల వుండి నడిపిస్తుంది అని పరిశ్రమలో ఇంకో టాక్ కూడా నడుస్తోంది. అయితే సురేష్ కొండేటి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో, పరిశ్రమ ఈ మొత్తం వ్యవహారంమీద ఎలా స్పందిస్తుందో చూడాలి.