Suresh Kondeti: నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ నుంచి సురేష్ కొండేటి బహిష్కరణ
ABN, Publish Date - Dec 23 , 2023 | 02:38 PM
సంతోషం ఫిలిం అవార్డులు వేడుకలో సురేష్ కొండేటి దక్షిణాదికి చెందిన నాలుగు భాషల నటీనటులు, సాంకేంతిక నిపుణలు, నిర్మాతలని అసౌకర్యానికి గురిచేయడమే కాకుండా, తెలుగు చిత్ర పరిశ్రమకి చెడ్డ పేరు తీసుకువారంతో అతని మీద చర్య అనివార్యం అయింది అని తెలిసింది.
కొన్ని రోజుల క్రితం సంతోషం ఫిలిం అవార్డులు #SantoshamAwards గోవాలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ అవార్డులను నిర్మాత, పీఆర్వో, సంతోషం పత్రిక అధినేత అయిన సురేష్ కొండేటి గత కొన్ని సంవత్సరాలుగా సంతోషం పేరిట ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సంవత్సరం నిర్వహించిన అవార్డుల వేడుక చాలా గందరగోళానికి గురవటమే కాకుండా, ఆ వేడుకకి వచ్చిన తెలుగు సినిమా సెలబ్రెటీలు, ఇతర భాషా నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఎంతో ఇబ్బంది పడ్డారు. సరైన వసతులు లేక, ఆహారం, నీరు లాంటి కనీస అవసరాలు కూడా లేకపోవటం, వేడుకకు వచ్చిన సెలెబ్రీటీలలో స్త్రీలు ముఖ్యంగా భయబ్రాంతులకు గురికావటం జరిగిందని తెలిసింది.
అవన్నీ ఒక ఎత్తు అయితే ఈ అవార్డుల వేడుకలో వచ్చిన అతిధులందరికీ ఎంతో అవమానం కూడా జరిగిందని తెలిసింది. ఈ వేడుక జరిపిన సురేష్ కొండేటి అవార్డుల వేడుక మధ్యలోనే బయటకి వెళ్ళిపోయినట్టుగా తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ ఒక ప్రకటనలో చెప్పింది. నిర్మాతలు దామోదర ప్రసాద్ తన సొంత ఖర్చులతో కొంతమంది సెలెబ్రీటీలను తిరిగి తమ ఇళ్ళకి సురక్షితంగా పంపినట్టుగా కూడా ఆ ప్రకటనలో చెప్పారు. అగ్ర నిర్మాత అయిన అల్లు అరవింద్ లాంటివాళ్ళకి అక్కడ జరిగిన తీరు ఏమాత్రం నచ్చలేదని కూడా తెలిసింది.
తెలుగు చలన చిత్ర పరిశ్రమకి ఈ అవార్డుల వేడుక వలన, సురేష్ కొండేటి చేసిన కొన్ని తప్పుడు ప్రచారాల వలన ఎంతో చెడ్డ పేరు రావటంతో, సురేష్ కొండేటికి ముందుగా సంజాయిషీ కోరుతూ తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్, తెలుగు నిర్మాతల మండలి ఒక నోటీసు ఇవ్వడం జరిగిందని తెలిసింది. అయితే ఈ వేడుకలో తప్పులు దొర్లినమాట నిజమేనని ఒప్పుకున్న సురేష్ కొండేటి, ఈ నోటీసులకు సరైన సమాధానం ఇవ్వకుండా తన తప్పు ఏదీ లేదని, కనీసం క్షమాపణలు కూడా చెప్పలేదని, తనదైన రీతిలో సమాధానం ఇవ్వడంతో నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ అతని వ్యవహార శైలి నచ్చక, ఆ విషయాన్ని తమ తమ కార్యనిర్వాహక సమావేశంలో చర్చించారని తెలిసింది.
కొన్ని రోజుల క్రితమే తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ మరియు నిర్మాతల మండలిలో చర్చించిన పిదప అందరూ ఏకగ్రీవంగా సురేష్ కొండేటిని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రెండు కార్యనిర్వాహక సభ్యులు అందరిలో ఒక్కరు కూడా సురేష్ కొండేటికి మద్దతుగా నిలవకపోవటం, అందరూ ఏకగ్రీవంగా అతన్ని బహిష్కరించవలసిందిగా చెప్పారని తెలిసింది.
దీనితో సురేష్ కొండేటికి నిర్మాతల మండలి నుండి, తెలుగు ఫిలిం ఛాంబర్ నుండి అధికారికంగా బహిష్కరించినట్టు (Suresh Kondeti Expelled from Telugu Film Producers Council and Telugu Film Chamber of Commerce) తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి ప్రసన్న కుమార్ చిత్రజ్యోతికి చెప్పారు. ఇప్పుడు అతను ఇక దేనిలోనూ సభ్యుడు కాడని, నిర్మాతగా, తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ సభ్యుడిగా, ఇంతవరకు అతను పొందిన రాయితీలు ఇకముందు నుండీ ఏవీ అతనికి ఇక రావని తెలిసింది.
మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచు న్యూజిలాండ్ లో తన సినిమా 'కన్నప్ప' షూటింగ్ లో బిజీ గా ఉన్నందు వలన అక్కడ సురేష్ కొండేటి విషయం ఇంకా పెండింగ్ లో ఉందని తెలిసింది. విష్ణు మంచు హైదరాబాదు వచ్చాక, సురేష్ కొండేటి మీద ఎటువంటి చర్య తీసుకోవాలనేది నిర్ణయం జరుగుతుందని తెలుస్తోంది. అక్కడ కూడా అతన్ని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నుండి బహిష్కరించే అవకాశాలు వున్నట్టుగా తెలిసింది.