Samyuktha Menon: అక్కడ ట్రావెలర్ టాటూ వేయించుకున్నా!
ABN, First Publish Date - 2023-04-23T09:49:30+05:30
‘మాస్టారు మాస్టారు’ అంటూ తన అందం, అభినయంతో కుర్రకారు మనసుల్ని దోచేసింది.. మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్.
‘మాస్టారు మాస్టారు’ (Mastaru Mastaru) అంటూ తన అందం, అభినయంతో కుర్రకారు మనసుల్ని దోచేసింది.. మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్(Samyuktha menon). ‘భీమ్లానాయక్’(Bheemla nayak) తో తెలుగు ప్రేక్షకులను పలకరించి, ‘బింబిసారా’, ‘సార్’ తో హ్యాట్రిక్ కొట్టి లక్కీ హీరోయిన్ అనే ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. అటు స్టార్ హీరోలు, ఇటు యంగ్ హీరోలకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్‌గా మారిన ఈ కేరళ కుట్టి ‘విరూపాక్ష’ (Virupaksha) విడుదల సందర్బంగా పంచుకున్న విశేషాలివి...
పవర్‌స్టార్ మెచ్చుకున్నారు (Power star pawan kalyan)
‘భీమ్లానాయక్’లో అవకాశం రాగానే నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటానని దర్శకుడిని అడిగాను. లాక్‌డౌన్ సమయంలో ఓ ట్యూటర్‌ను పెట్టుకుని తెలుగు నేర్చుకున్నాను. ఆ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో నేను తెలుగులో మాట్లాడిన తర్వాత.. పవన్‌కళ్యాణ్‌గారు నాదగ్గరకు వచ్చి ‘బాగా మాట్లావ’ని మెచ్చుకున్నారు. ఆ సినిమా తర్వాత నేను ఎక్కడికి వెళ్లినా ‘డానియెల్ శేఖర్ భార్య’ అనేవారు. కొందరైతే ‘మీరు పవన్‌కళ్యాణ్ చెల్లి కదా’ అని అంటారు. ఇప్పుడు అదే నాకు పెద్ద టాగ్ అయిపొయింది.
ట్రావెలింగ్ ఇష్టం
నాకు ప్రయాణాలు చేయడమంటే చాలా ఇష్టం. అందుకే నా వీపుపై ‘ట్రావెలర్’ అనే టాటూ వేయించుకున్నాను. ముఖ్యంగా సోలోగా వెళ్లడానికే ఇష్టపడతాను. ఆ సమయంలో ‘రోజా’, ‘ఖుషి’, ‘పంజా’ సినిమాల్లోని పాటలు ఎక్కువుగా వింటూ ఎంజాయ్ చేస్తుంటాను. హిమాలయాలకు ఎక్కువగా వెళ్తుంటా. సినిమాల్లోకి రాకపోయుంటే బహుశా ట్రావెలర్ అయ్యేదాన్నేమో. దాంతో పాటు ఖాళీ సమయాల్లో కవితలు రాస్తుంటా.
సమంతలా .. ఉన్నావంటారు
నన్ను ‘నువ్వు సమంతలా ఉన్నావు’ అని చాలా మంది చెప్తుంటారు. దానికన్నా ‘నువ్వు సమంతలా నటిస్తున్నావ’ని చెప్తేనే ఎక్కువ సంతోషపడతాను. ఎందుకంటే ఆమె గొప్పనటి. ఆమె నటనతో నన్ను పోలిస్తే పొందే సంతృప్తే వేరు.
ఇంటిపేరు వద్దనుకున్నా
నా పేరు వెనుక ‘మీనన్’ వద్దనుకున్నాను. స్కూల్‌లో చేరినప్పుడు ఇంటిపేరుతో సహా మన పేరు రాస్తుంటారు. అలాగే నా పేరు సంయుక్త మీనన్ అని నమోదు చేశారు. అది అలా కొనసాగుతూ వచ్చింది. కొంత పరిణతి వచ్చిన తర్వాత పేరు చివర ఇలాంటి తోకలు ఉండాల్సిన అవసరం లేదనిపించింది. అదీగాక నా చిన్నప్పుడే మా అమ్మనాన్నలు విడిపోయారు. నాన్న ఇంటి పేరుతో అందరూ నన్ను పిలవడం అమ్మకు ఇష్టంలేదు. అందుకే ఆమె భావాలను గౌరవించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇకనుంచి సినిమాలతోపాటు, సోషల్‌మీడియా ఖాతాల్లో కూడా సంయుక్త అని మాత్రమే ఉంటుంది.
చెంప పగలగొట్టా..
నేను, అమ్మ ఓసారి బయటకి వెళ్లాం. అక్కడ ఓ వ్యక్తి సిగరెట్ తాగుతూ.. ఆ పొగను మాపై వదులుతున్నాడు. అక్కడి నుంచి దూరంగా జరుగుదామన్నా పక్కనకాస్త కూడా ఖాళీ స్థలం లేదు. అమ్మకు బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉండడంతో అతడి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పడానికి ప్రయత్నించాను. కానీ వాడు అసభ్యంగా మాట్లాడేసరికి ఒక్కసారిగా కోపం వచ్చేసింది. దాంతో వాడి చెంప పగలగొట్టాను.
అనుకోకుండా సినిమాల్లోకి ...
ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత మెడిసిన్ ఎంట్రెన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న సమయంలో ఫేస్‌బుక్‌లో నా ఫొటోలను చూసిన ఓ ఫొటోగ్రాఫర్ వాటిని ఓ మ్యాగజైన్ కవర్‌పై ప్రచురించాడు. వాటిని చూసిన మలయాళీ దర్శకుడు ‘పాప్‌కార్న్’ సినిమాలో ఆఫర్ ఇచ్చాడు. వాస్తవానికి ఆ సమయంలో నాకు సినిమాల మీద ఎలాంటి అవగాహన లేదు. ఏదో అవకాశం వచ్చిందని క్యాజువల్‌గా నటించాను. ఆ తర్వాత ఇక సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నా. కాని కొంతకాలం తర్వాత.. అందరికీ గుర్తుండిపోయే ఓ మంచి సినిమా చేసి, సినిమాలకు దూరమవ్వాలనుకున్నాను. ఆ క్రమంలో తెలియకుండానే సినిమాలపై ఇష్టం ఏర్పడింది.
అతడికి పెద్ద ఫ్యాన్‌ని..
లియోనార్డో డికాప్రియోకు నేను పెద్ద అభిమానిని. ‘టైటానిక్’ సినిమా చూసినప్పటి నుంచి అతడికి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అలాగేఽ ధనుష్ నటనన్నా ఇష్టం. నేను పదవ తరగతిలో ఉన్నప్పుడు స్కూల్ టూర్ కోసం మైసూర్ వెళ్లాం. ఆ సమయంలో బస్సులో ధనుష్ సినిమా ‘ఆడుకాలం’లోని పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేసేవాళ్లం. అలాంటిది అతడి పక్కన హీరోయిన్‌గా నటించానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.