Ramabanam: కాపీ చేశారంటూ రవీందర్ ఆరోపణ.. స్పందించకపోతే లీగల్ యాక్షన్!
ABN, First Publish Date - 2023-04-28T19:04:04+05:30
గోపీచంద్ (Gopichand) హీరోగా నటించిన ‘రామబాణం’ (Ramabanam) చిత్రం వివాదంలో చిక్కుకుంది.
గోపీచంద్ (Gopichand) హీరోగా నటించిన ‘రామబాణం’ (Ramabanam) చిత్రం వివాదంలో చిక్కుకుంది. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ‘ఐ ఫోను సేతులబట్టి.. హైక్లాసు సెంటే కొట్టి’ పాట, ట్యూన్ (Copy tune) తనదేనంటూ కరీంనగర్‌కు చెందిన జానపద కళాకారుడు గొల్లపల్లి రవీందర్ ఆరోపించారు. 1992లోనే ఈ పాటను రాశానని, అప్పట్లో ఆ పాట సంచలనం అని ఆయన చెప్పారు. ఈ మేరకు తనకు న్యాయం జరగాలంటూ మీడియాను ఆశ్రయించారు రవీందర్. కొన్ని లైన్‌లను తన పాట నుంచీ కాపీ చేశారని, ఆ ట్యూన్ కూడా తనదేనని చెబుతున్నారు. అప్పటి పాటల క్యాసెట్ తీసుకొచ్చి మరీ పాటను వినిపించారు. గేయ రచయిత కాసర్ల శ్యామ్ ఈ పాటను రచించారు. మిక్కీ జే. మేయర్ సంగీతం అందించారు. రామ్ మిరియాల, మోహన భోగరాజు ఆలపించారు. (RamaBanam song controversy)
అయితే రవీందర్ (Ravinder) రాసిన ‘చేతికి గాజులు పెట్టి’ లైన్.. ఇప్పుడు పాటలో ఉన్న ‘ఐ ఫోన్ సేతిలో పట్టి..’ ట్యూన్ ఒకేలా ఉందని, తన పాటలోని కొన్ని పదాలను వాడుకున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. రవీందర్ రాసిన పాటలోని ఒక లైన్ మాత్రమే ‘రామబాణం’ పాటలో ఉంది. ట్యూన్ కూడా అక్కడక్కడా మాత్రమే మ్యాచ్ అయ్యేలా ఉంది. తన అనుమతి లేకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా సినిమా యూనిట్ తన పాటను, ట్యూన్‌ను వాడుకున్నారని ఆరోపించారు.
తనతో తిరిగి, తన గురించి, తన పాటల గురించి బాగా తెలిసిన కాసర్ల శ్యామ్ ఇలా చేశాడని రవీందర్ ఆరోపించారు. సినిమా విడుదలలోపు దర్శకుడు లేదా చిత్ర యూనిట్ వివరణ ఇవ్వకపోతే లీగల్‌గా ముందుకు వెళ్తానని రవీందర్ హెచ్చరించారు. గోపీచంద్, డింపుల్ హయాతీ జంటగా శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. మే 5న ఈ చిత్రం విడుదల కానుంది.