RamCharan: జీ20 సదస్సులో 'నాటు నాటు' స్టెప్పులేసి అదరగొట్టిన రామ్ చరణ్, వీడియో వైరల్
ABN, First Publish Date - 2023-05-22T18:25:32+05:30
కాశ్మీర్ లో జరుగుతున్న జీ 20 సదస్సులో భారతీయ చలన చిత్ర పరిశ్రమకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు నటుడు రామ్ చరణ్, అక్కడ సదస్సులో దక్షిణ కొరియా రాయబారితో 'నాటు నాటు' పాటకి స్టెప్పులేసి అందరినీ అలరించారు. ఆ సదస్సులో రామ్ చరణ్ సందడి చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
'ఆర్ఆర్ఆర్' #RRR సినిమాతో ప్రపంచం అంతా మారుమోగిన రామ్ చరణ్ (RamCharan) పేరు, ఇప్పుడు ఇంకో గౌరవం ఆ యువనటుడికి దక్కింది. కాశ్మీర్ (G-20 summit in Kashmir) లో జరుగుతున్న జీ20 సదస్సుకు భారతీయ సినిమా పరిశ్రమకి ప్రతినిధిగా రామ్ చరణ్ ఆ సదస్సులో పాల్గొనడం ఆయనకి దక్కిన ఎంతో గౌరవం. ప్రపంచ దేశాల నుండి వచ్చిన వివిధ నాయకులతో కాశ్మీర్ లో రామ్ చరణ్ సమావేశం అయ్యారు. ఈ సమావేశం కాశ్మీర్ లో టూరిజంని ప్రోత్సహించడానికి సుమారు 20 దేశాలకి చెందిన నాయకులూ ఈ సమ్మిట్ లో పాల్గొంటారు. చైనా ఈ సమావేశానికి గైరుహాజరు అయింది. అలాగే ఇంకో మూడు దేశాలు కూడా రాలేదు.
చలన చిత్ర పరిశ్రమకి ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ చరణ్ భారతీయ సంస్కృతి, ఔన్నత్యాన్ని గొప్పగా చెపుతూ, ఇంతమంది ఇన్ని దేశాలకు చెందిన నాయకులతో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అలాగే ప్రకృతి అందాలతో పులకించి పోతున్న కాశ్మీర్ లాంటి ప్రదేశంలో ఈ సదస్సు పెట్టడం ఇంకా సంతోషంగా వుంది #G20Summit అన్నాడు. తన 2016 లో ఈ సదస్సు జరిగిన చోటే షూటింగ్ చేసాం అని ఒకసారి గుర్తుచేసుకున్నారు.
అలాగే జపాన్ #Japan లో తమ సినిమా 'ఆర్ఆర్ఆర్' #RRR కి ఎంతో ఆదరణ లభించిందని, అక్కడ ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు ఎంతో ఆత్మీయంగా, ఆదరంగా మాట్లాడారు అని చెప్పాడు రామ్ చరణ్. ఆ తరువాత రామ్ చరణ్, భారత్ కి దక్షిణ కొరియా రాయబారి చాంగ్ జె బోక్ తో కలిసి 'ఆర్ఆర్ఆర్' లోని 'నాటు నాటు' (NaatuNaatu) పాటకి డాన్స్ చేసి చూపించాడు. వాళ్ళతో డాన్స్ చేయించాడు కూడా. ఇప్పుడు ఈ వీడియోలు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్లో 370 ఆర్టికల్ ని తొలగించి, అక్కడ పరిస్థితులు ఎంత బాగున్నాయో ప్రపంచానికి చాటి చెప్పడానికి ఈ జీ20 సదస్సు అక్కడ నిర్ణయించారు. ఇది మే 24 వరకు ఉంటుంది. దీని ద్వారా టూరిజం, వాణిజ్య రంగాలలో చాలా మెరుగు ఉంటుందని నిపుణుల అంచనా.