Rajinikanth: దుర్యోధన పాత్రకు అభినయించా.. అలా సినిమాల్లోకి వచ్చా!
ABN, First Publish Date - 2023-04-29T12:19:56+05:30
శ్రీకృష్ణ పాండవీయం’ సినిమాలోని ఎన్టీఆర్ (NTR) నటించిన దుర్యోధన పాత్రకు మంత్రముగ్దుణ్ని అయ్యా. నేను బస్ కండక్టర్‌గా ఉన్న సమయంలో జరిగిన ఓ వేడుకలో ఎన్టీఆర్‌ను ఊహించుకుంటూ దుర్యోధన పాత్రకు అభినయించా.
‘‘శ్రీకృష్ణ పాండవీయం’ సినిమాలోని ఎన్టీఆర్ (NTR) నటించిన దుర్యోధన పాత్రకు మంత్రముగ్దుణ్ని అయ్యా. నేను బస్ కండక్టర్‌గా ఉన్న సమయంలో జరిగిన ఓ వేడుకలో ఎన్టీఆర్‌ను ఊహించుకుంటూ దుర్యోధన పాత్రకు అభినయించా. అక్కడ దక్కిన ప్రశంసల వల్లే నేను నటన వైపు వచ్చా’’ అని సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) అన్నారు. శుక్రవారం విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి (NTR Centenary Celebrations) ఉత్సవాలకి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ‘‘తొలిసారి నేను చూసిన సినిమా ఎన్టీఆర్ నటించిన ‘పాతాళ భైరవి’’. ఆ చిత్రం నా మదిలో అలా నిలిచిపోయింది. నా తొలి సినిమాలోనూ ‘పాతాళ భైరవి ఇల్లు ఇదేనా?’ అనే డైలాగ్ ఉంటుంది. సహాయనటుడిగా, ప్రతినాయకుడిగా పనిచేస్తున్న రోజుల్లో ఓ దర్శకుడు నన్ను కలిసి హీరోగా సినిమా చేస్తానని చెప్పారు. కానీ నాకు అప్పుడు హీరోగా నటించడం ఇష్టం లేదు’ అని చెప్పగా ‘ఒక్క’సారి కథ వినండి’ అంటూ సినిమా పేరు ‘భైరవి’ అని చెప్పారు. ఆ పేరు వినగానే ఆ సినిమా చేయడానికి అంగీకరించేశాను. నాకు 13 ఏళ్ల వయసున్న సమయంలో ‘లవకుశ’ సినిమా విజయోత్సవ వేడుకకు ఎన్టీఆర్ చెన్నై వచ్చారు. అప్పుడు దూరం నుంచి ఆయన్ను చూశా. ఓ వేడుకలో ఎన్టీఆర్‌ను ఊహించుకుంటూ దుర్యోధన పాత్రకు అభినయించా. అక్కడ దక్కిన ప్రశంసల వల్లే నేను నటన వైపు వచ్చా’’ అని రజినీకాంత్ అన్నారు.
అలాగే బాలకృష్ణ గురించి కూడా ఆయన మాట్లాడారు. ‘‘బాలకృష్ణకు కోపం బాగా ఎక్కువ. మనసు వెన్నలాంటిది. ఆయన కంటి చూపుతోనే చంపేస్తాడు. తన్నితే కారు 30 అడుగుల దూరంలో పడుతుంది. అలా.. రజనీకాంత్, షారుక్‌ఖాన్, అమితాబ్ బచ్చన్, సల్మాన్‌ఖాన్ ఎవరు చేసినా ప్రేక్షకులు అంగీకరించారు. ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు నందమూరి తారకరామారావుని బాలకృష్ణలో చూసుకుంటున్నారు. సినీ, రాజకీయ జీవితంలో ఆయన మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా’’ అని రజినీకాంత్ ఆకాంక్షించారు.