Salaar: అసలు సలార్ విడుదలవుతుందా.. దుమ్మెత్తిపోస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్
ABN, Publish Date - Dec 18 , 2023 | 03:28 PM
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బాగా ట్రెండింగ్ అవుతున్న అంశం సలార్ విడుదల. తాజాగా సినిమా నుంచి యాక్షన్ సన్నివేశాలతో రెండో ట్రైలర్‌ను విడుదల చేస్తామంటూ రెండు రోజుల నుంచి చెబుతూ వచ్చిన మేకర్స్ చెప్పిన టైంకి విడుదల చేయక పోవడంపై బాగా సీరియస్ అవుతున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బాగా ట్రెండింగ్ అవుతున్న అంశం సలార్ (Salaar Cease Fire) సినిమా విడుదల. దాదాపు రెండు సంవత్సరాల నిర్మాణం అనంతరం విడుదలకు సిద్ధమైన ఈ సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్స్, ట్రైలర్ విడుదల చేయగా అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే ట్రైలర్లో ప్రభాస్ (Prabhas) తక్కువ సమయం కనిపించడంతో ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహ పడ్డారు. ఈ క్రమంలో సినిమా మేకర్స్ ది ఫైనల్ పంచ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టి పూర్తి యాక్షన్ సీక్వెన్స్‌లతో రెండో ట్రైలర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు ప్రకటించడంతో అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేశారు.
ముందుగా చెప్పిన ప్రకారం ఈరోజు(18.12.2023) ఉదయం 10.42 గంటలకు సలార్ ఫైనల్ ట్రైలర్ ఉంటుందనడంతో ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూడగా మేకర్స్ వారి ఆశలపై నీరు చల్లుతూ కాస్త ఓపిక పట్టండి మధ్యాహ్నం 2 గంటలకు వస్తుందని మరో ప్రకటన చేశారు. తిరిగి 2 గంటలకు కూడా ట్రైలర్ రిలీజ్ చేయకపోవడంతో అభిమానులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. ఇంత పెద్ద సంస్థ , ఇంత మంది పెద్ద హీరోలు ఉన్న ఈ సినిమా ట్రైలర్‌ను చెప్పిన సమయానికి కూడా విడుదల చేయలేరా అంటూ ఫైర్ అవుతున్నారు. మరో అడుగు ముందుకేసి సినిమా అయినా అనుకున్న తేదీన విడుదల చేస్తారా అంటూ సోషల్‌మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇప్పటికే సలార్ సినిమా ప్రమోషన్స్ సరిగ్గా లేవని, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరపడం లేదని అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. ఇదిలాఉండగా ఎలాగో ప్రమోషన్స్ లేవు అఖరికి దర్శకధీరుడు రాజమౌళితో ఇంటర్వ్యూ అన్న చేయిస్తున్నారని ఫ్యాన్స్ ఆనందంలో ఉన్నారు.
అయితే ఆ ఇంటర్వ్యూ మొత్తం ఇంగ్లీష్‌లోనే సాగినట్లు ముందు విడుదల చేసిన ప్రోమోతో తెలుస్తుండడంతో అభిమానుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇదేమైనా హాలీవుడ్ సినిమానా అంటూ అభిమానులు కోపంతో రగిలి పోతున్నారు. నిర్మాణ సంస్థ హోంబలే(Hombale)పై బండ బూతులతో రెచ్చిపోతున్నారు.
అఖరికి దర్శకుడు ప్రశాంత్ నీల్ భార్య ట్రైలర్ విడుదల ఆలస్యంపై స్పందిస్తూ సీరియస్ ఎమోజీస్ పెట్టడం కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నది. సాయంత్రం వరకైనా ట్రైలర్ విడుదల అవుతుందా అంటూ ఫ్యాన్స్ ఆసక్తితో ఎదురు చూస్తుండగా చివరకు 3.45 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ చల్లబడ్డారు.