PKSDT: జగన్ వల్ల పవన్ కళ్యాణ్, అలి స్నేహం చెడిందా
ABN, First Publish Date - 2023-03-02T15:10:45+05:30
పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమాలో కమెడియన్ అలి కి బదులుగా బ్రహ్మానందాన్ని తీసుకున్నారు. అలి జగన్ కి బాగా దగ్గరవడం వలెనే అలిని ఈ సినిమాలో తీసుకోలేదు అని వార్త వినిపిస్తోంది. దీనివల్ల పవన్ కళ్యాణ్, అలీ స్నేహం కూడా చెడిందా అన్న వార్త కూడా బాగా వైరల్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), అతని మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) తమిళ్ సినిమా 'వినోదయ సితం' (Vinodhya Sitam) తెలుగు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కి సముద్రఖని (Samuthirakani) దర్శకుడు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త బాగా వైరల్ అవుతోంది. ముందుగా అనుకున్న ప్రకారం ఈ సినిమాలో కమెడియన్ అలి (Ali) నటించాలి, కానీ అలి ప్లేస్ లో ఇప్పుడు టాప్ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) వచ్చాడు.
అలి, పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు, అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలు ఆల్మోస్ట్ అన్ని సినిమాలలో అలి కనిపిస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఈ మల్టీ స్టారర్ మూవీ లో మాత్రం ఆలి కి బదులు బ్రహ్మానందాన్ని తీసుకున్నారు. ఎందుకు అంటే, అలీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) కి బాగా సన్నిహితుడు అయ్యాడు. ఈమధ్యనే అలి ని, ఎలక్ట్రానిక్ మీడియా వ్యవహారాలు రాష్ట్ర ప్రభుత్వానికి చూసే సహాయకుడిగా (Advisor for AP Government on Electronic Media Affairs) నియమించాడు జగన్. అందువల్ల పవన్ కళ్యాణ్ తన స్నేహాన్ని పక్కన పెట్టేసి, అలి కి వున్న ఆ రాజకీయ పోస్ట్ కారణంగా, సినిమాలో పెట్టుకోలేదు అని ఒక వార్త వినిపిస్తోంది.
ఇంతకు ముందు పవన్ కళ్యాణ్, అలి చాలా విమర్శలు చేసుకున్నా, అలి పవన్ కళ్యాణ్ సినిమాలో ఎదో ఒక చిన్న పాత్ర లో అయినా కనపడేవాడు. కానీ ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాలో అలి కి చోటు లేకుండా పోయింది. ఆసక్తికరం ఏంటి అంటే ప్రకాష్ రాజ్ (Prakash Raj) రాజకీయంగా పవన్ కళ్యాణ్ తో విభేదించినా, ప్రకాష్ రాజ్ మంచి నటుడు అని పవన్ కళ్యాణ్ కితాబునిచ్చారు. అందుకే 'వకీల్ సాబ్' (Vakeel Saab) సినిమాలో ప్రకాష్ రాజ్ ఒక ముఖ్య పాత్ర పోషించాడు. కానీ ఇప్పుడు అలి దగ్గరికి వచ్చేసరికి మాత్రం, రాజకీయ విభేదాల వలన పవన్ కళ్యాణ్ వద్దు అనుకున్నాడు.