Adipurush: ఈ సినిమాలో ఘోర తప్పిదాలు, పురాణాలను, ఇతిహాసాలను కాలరాస్తూ...
ABN, First Publish Date - 2023-06-17T12:34:13+05:30
పురాణాలను, ఇతిహాసాలను, చరిత్రని అపహాస్యం చేస్తూ దర్శకుడు ఓం రౌత్ తీసిన 'ఆదిపురుష్' లో ఎన్నో తప్పిదాలు. మళ్ళీ ఇది ఈనాడు యువతకి చూపించాలి అని అంటారా, అసలు ఓం రౌత్ రామాయణం గురించి ఏమైనా తెలుసుకున్నాడా అని అనిపిస్తోంది, ఆ తప్పిదాలు చూస్తుంటే.
ఓం రౌత్ (OmRaut) దర్శకత్వంలో అగ్ర నటుడు ప్రభాస్ (Prabhas), కృతి సనన్ (KritiSanon) జంటగా రామాయణం ఆధారంగా నిర్మితమైన 'ఆదిపురుష్' #Adipurush సినిమా నిన్న జూన్ 16న విడుదల అయింది. మొదటి రోజు మొదటి ఆట నుండీ ఈ సినిమా మీద అనేక ట్రోల్స్ చేస్తూనే వున్నారు. దర్శకుడు ఓం రౌత్ అసలు రామాయణాన్ని చదివాడా, చదివితే మరీ అంత తెలియకుండా ఎలా తెస్తాడు అని అడుగుతున్నారు.
ఎందుకంటే ఓం రౌత్, రామాయణం లో వున్న రావణుడికి, భాగవతంలో వున్న హిరణ్యకశిపుడికి తేడా తేలియనందుకు. ఎందుకంటే రావణుడు బ్రహ్మ దగ్గర వరం పొందినట్టుగా చూపించాడు ఓం రౌత్. పోనీ తెలీదు వదిలేద్దాం. కానీ బ్రహ్మ గారు ఏమి వరం ఇచ్చారు, నీటి మీద కానీ, నేల మీద కానీ, పగలు కానీ, రాత్రి కానీ, ఇలా రావణుడికి వరాలు ఇచ్చారు అని చెప్పాడు ఓం రౌత్. ఇది ఎంత ఘోర తప్పిదం అంటే, భాగవతంలో హిరణ్యకశిపుడికి బ్రహ్మగారు ఇచ్చిన వరాలను తీసుకొచ్చి రావణాసురుడికి అంటగట్టేసాడు ఓం రౌత్. ఇదెక్కడి పురాణం, పోనీ ఎవరు రాసిన పుస్తకం లోదో? పోనీ చివర్లో రాముడు ఒక బాణం వేసి రావణుడిని చంపేస్తాడు. అప్పుడు బ్రహ్మగారు ఇచ్చిన వరాలు అన్నీ ఏమయ్యాయి మరి.
ఇంకో ఘోర తప్పిదం రావణుడు సీతను అపహరించే సన్నివేశం. రాముడు, లక్ష్మణుడు లేని సమయంలో రావణుడు వచ్చి కపట సన్యాసి వేషం వేసుకొని సీతని అపహరిస్తాడు. జటాయువు రాముడికి చెపుతుంది రావణుడు అనే వాడు ఎత్తుకెళ్లాడు అని. కానీ ఓం రౌత్ రామాయణంలో రాముడు, లక్ష్మణుడు ఇద్దరూ చూస్తుండగా ఎత్తుకు పోతాడు. మరి రాముడు బాణం వెయ్యకుండా పరుగులు పెడతాడు. ఏంటో మరి. ఇది ఎంతమాత్రం కరెక్టు కాదు. ఏ పురాణంలో కూడా ఇలా రాయలేదు.
స్వామి హనుమ లంకకి వెళ్లి అశోకవనం లో సీతను చూస్తారు. అంతకు ముందు లంకంతా వెతుకుతారు, మండోదరిని చూసి సీత అనుకోవటం, మళ్ళీ సీతమ్మ అయితే రావణుడి మందిరంలో ఎందుకు ఉంటుంది అని ఆలోచన రావటం, మళ్ళీ సీతాన్వేషణ చెయ్యడం ఉంటుంది. ఆ తరువాత అశోకవనంలో వున్న సీతమ్మని చెట్టు మీద నుండి చూసి, పిల్లి పిల్లంత వాడై చూసారు అని రాసారు వాల్మీకి రామాయణంలో. అదీ కాకుండా అక్కడ సీతమ్మ ఉరేసుకుంటున్న సమయంలో ఆమెని ఎలా ఆపాలి అనుకొని రామ కథ చెప్తారు స్వామి హనుమ. అప్పుడు సీతమ్మ ఆ కథ విని వురి వేసుకోవటం ఆపేస్తుంది. ఆ తరువాత ఇద్దరి మధ్య చాలా సంభాషణ నడుస్తుంది, సీతమ్మ నమ్మదు మొదట. కానీ ఆమెని సాంత్వన పరిచి అప్పుడు అంగుళీయకం ఇస్తారు స్వామి హనుమ. కానీ ఈ ఓం రౌత్ రామాయణంలో హనుమ చెట్టుమీద నుండి కిందకి వునగరం విసిరేస్తారు. ఎంత తప్పిదం అది. స్వామి హనుమ అంటే ఎవరు, నవ వ్యాకరణ పండితుడు, భవిష్తత్ బ్రహ్మ, రాముడు ఇచ్చిన అంగుళీయకాన్ని ఆలా చెట్టుమీద నుండి పడేస్తారా.. ఎంత పాపం..
ఓం రౌత్ ఎక్కడ చదవాడో, ఎవరి ద్వారా విన్నాడో కానీ, చిన్న పిల్లలని అడిగినా చెప్తారు రామాయణ కథలు. అలాంటిది రామాయణాన్నీ ఇంత దారుణంగా, కించపరుస్తూ తనకి నచ్చిన విధంగా, రామాయణంలోని పాత్రల స్వభావాన్ని మార్చేస్తాడా. అందుకే అందరూ ఈ సినిమాని ట్రోల్ చేస్తున్నారు.