సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Nandamuri Taraka Ramarao : సరిలేరు నీకెవ్వరూ..

ABN, First Publish Date - 2023-01-18T12:12:59+05:30

ఆంధ్రుల అభినవ రామునిగా, కృష్ణునిగా ఆరాధనలు అందుకున్న గొప్ప నటుడు, నాయకుడు నందమూరి తారక రామారావు.

NTR
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రుల అభినవ రామునిగా, కృష్ణునిగా ఆరాధనలు అందుకున్న గొప్ప నటుడు, నాయకుడు నందమూరి తారక రామారావు. తెలుగువారు ఆప్యాయంగా అన్నగారు అని పిలుచుకున్నా, సినీ అభిమాని మాఎన్టీఓడు అని అభిమానం చూపినా ఆయనకే చెల్లింది. 400లకు పైగా చిత్రాలలో నటించి, పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం వహించిన ఘనుడు ఎన్టీఆర్. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి మెప్పించిన నటరత్నం.

ఆయన క్రమశిక్షణ గురించి ఇక్కడ చెప్పుకోవాలి. మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీకే క్రమశిక్షణను నేర్పిన నటుడు ఎన్టీఆర్. సినీ రంగానికి పరిచయం అయి, బిజీ అయ్యాకా అసలు సమయాన్ని పట్టించుకోకుండా మొదట్లో వచ్చిన అవకాశాలను వినియోగించుకొనే పనిలో రోజుకు మూడు షిప్టుల్లో పనిచేసేవారు. అయితే తర్వాత తర్వాత రోజుకు రెండు షిఫ్టులు మాత్రమే పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం ఆరు తరవాత పనిచేయకూడదనే నియమం కూడా పెట్టుకున్నారు.

ఎన్టీఆర్ ని కృష్ణునిగా, రాముడిగా చూసి తరించిన తెలుగువాడికి ఆరూపాన్ని దేవుడిరూపంలో ఆరాధించడమే తెలుసు. ఎన్నో పాత్రలు, మరెన్నో చిరస్థాయిగా నిలిచే పాత్రలు వాటిలో కృష్ణుడు, రాముడు, రావణాశురుడు ఇలా ఎన్నో. రావణుడి రూపురేఖలను మనో ఫలకంపై చిత్రీకరించుకుని రాక్షసరాజుగా రావణుడిగా కూడా సినీ అభిమానులకు కనిపించి అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నారు. రావణ బ్రహ్మగా ఎన్టీఆర్ ను ఎవిఎం సంస్థ భూకైలాస్ చిత్రంలో ఎంపిక చేసింది. దానికి ఎన్టీఆర్ రూపం చక్కగా నప్పుతుందనేది వారి నమ్మకం.

ఇక్కడే ఇంకో మాట చెప్పుకోవాలి. రావణ బ్రహ్మను అమితంగా ఇష్టపడే రామారావు ఈ పాత్ర చేసే అవకాశం వచ్చిందనగానే చాలా ఆనందించారు. తన నటనను ఆ పాత్రకు తగ్గట్టుగా మలుచుకునే పనిలో పాత్రను తన పూర్వజన్మ సుకృతంగా భావించారు. చిత్రం అఖండ విజయం సాధించడంతో ప్రేక్షకులు ఎన్టీఆర్ కి బ్రహ్మరథం పట్టారు. జనాల నీరాజనాలందుకున్నారు. రాముడిగా, కృష్ణునిగా కనిపించిన ఎన్టీఆర్ సినీ తెరమీదనే కాదు ప్రేక్షకుని మదిలో కూడా దేవునిగా నిలిచిపోయారు.

శివునిగా నటించిన దక్షయజ్ఞం చిత్రం భక్తజనాన్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో ఎన్టీఆర్ శివునిగా ఎంతో అందంగా కనిపిస్తారు. ముఖ్యంగా ఆరంభంలో పద్మాసనంలో కూర్చుని ఉన్న శివుని రూపం అభిమానుల మదిలో చెరగని ముద్ర వేసింది. ఇందులో రుద్రతాడవం చేసే సీన్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఈనాటికీ శివరాత్రి సందర్భంగా ఈ సినిమాలోని ఎన్టీఆర్ శివుని రూపాన్నే కేలండర్స్ లో ముద్రిస్తూ ఉండటం మరో విశేషం. కొన్ని పాత్రలు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా చెరగని ముద్రవేస్తాయి. ఇలా ఒకటేమిటి ఎన్టీఆర్ నమ్మకంగా నటించిన ప్రతి పాత్ర కూడా ప్రేక్షక హృదయాలను తాకింది. రామునిగా కనిపించిన లవకుశ, కృష్ణావతారంలో కనిపించిన శ్రీకృష్ణపాండవీయం, పాతాళభైరవి, గుండమ్మకథ, పాండురంగ మహత్యం, గుళేబకావళి కథ, రాముడు భీముడు ఇలా ఎన్నని, ప్రతి పాత్ర ప్రత్యేకమే. ఆయన అందమైన రూపంతో సజీవమే.. అందుకే ఈ పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకుని హృదయంలో ముద్రవేసుకున్నాయి.

ఇక రాజకీయాల్లోకి 80లలో ప్రవేశించి తనలో నటుడేకాదు, నాయకుడూ ఉన్నాడని ఆ నాయకుడికి పేదవాడి నాడి తెలుసునని నిరూపించాడు ఎన్టీఆర్. తెలుగు జాతికీ, తెలుగుభాషకు ఎనలేని గౌరవాన్ని తెచ్చిన వ్యక్తిగా నిలిచారు. స్త్రీలకు ఆస్తిలో వాటా ఇవ్వాలని చట్టం తెచ్చేవరకూ శ్రమించారు. బలహీన వర్గాలకు లక్షలాదిగా ఇళ్ళు కట్టించిన గొప్పతనం కూడా ఆయనదే. రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం దగ్గర నుంచి తెలుగు గంగ ప్రాజెక్టు వరకూ ఎన్టీఆర్ కృషి అనిర్వచనీయం. ఈ కార్యక్రమాలతోనే మహానాయకుడు అయ్యాడు. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ జాతీయ పురస్కారం..

ఎన్టీఆర్ పేరిట సినిమా ప్రముఖులకు జీవితకాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో నెలకొల్పింది. జనవరి 18 ఎన్టీఆర్ 27వ వర్థంతి సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు అన్నగారికి నివాళులు అర్పించారు.

Updated Date - 2023-01-18T12:13:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!