Bhagavanth Kesari: ఒక ఓవర్ అయిపోయింది, ఇంకొక ఓవర్ స్టార్ట్ చేశా: అనిల్ రావిపూడి
ABN, First Publish Date - 2023-10-14T14:43:35+05:30
దర్శకుడు అనిల్ రావిపూడి తన రాబోయే సినిమా 'భగవంత్ కేసరి' గురించి మాట్లాడుతూ, అందులో ఆర్మీ నేపధ్యం ఎందుకు చూపించాల్సి వచ్చిందో, దాని కోసం ఎటువంటి పరిశోధన చేసాడో చెప్పాడు.
దర్శకుడు అనిల్ రావిపూడి (AnilRavipudi), బాలకృష్ణ (NandamuriBalakrishna) కథానాయకుడిగా 'భగవంత్ కేసరి' #BhgavanthKesari అనే సినిమాతో ఈ దసరాకి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో శ్రీలీల (Sreeleela) ఒక ముఖ్యమైన పాత్రలో కనపడనుంది, కాజల్ అగర్వాల్ (KajalAggarwal) కథానాయికగా చేస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ (ArjunRampal) ఇందులో విలన్ గా చేస్తున్నాడు. ఈ సినిమా గురించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఇందులో భావోద్వేగాలకు పెద్ద పీట వేశానని అంటున్నారు.
ఇంతవరకు నేను ఆరు సినిమాలు చేసాను. అంటే ఒక ఓవర్ అయిపొయింది అన్నమాట, ఇప్పుడు రెండో ఓవర్ స్టార్ట్ చేస్తున్నాను ఈ 'భగవంత్ కేసరి' తో అని చమత్కారంగా చెప్పాడు. ఇంతకు ముందు అన్ని సినిమాల్లో ఎంటర్ టైనమెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, భావోద్వేగాలకు తక్కువ చూపించాను, అయితే ఈ 'భగవంత్ కేసరి' లో ఆ భావోద్వేగాలు చాలా ఎక్కువగా వున్న సినిమా అని చెప్పాడు అనిల్ రావిపూడి.
ఇంతకు ముందు సినిమాల్లో కూడా భావోద్వేగాలు వున్నాయి, కానీ ఈ సినిమాలో అవి ఎక్కువ ఉంటాయి. నాకు సరైన టైములో, సరైన కథకి సరైన టీము బాలకృష్ణ గారి రూపంలో దొరికింది, దానికి శ్రీలీల కూడా కుదిరింది అని చెప్పాడు అనిల్ రావిపూడి. ఇది చాలా నిజాయితీతో చేసిన సినిమా, ఒక మంచి కథ, చాలాకాలం పాటు గుర్తుండిపోయే సినిమా అని చెప్పాడు అనిల్ రావిపూడి.
ట్రైలర్ చూస్తే అందులో శ్రీలీల ఆర్మీ కోసం ట్రైనింగ్ అవుతూ ఉండటం చూపించాడు, ఎందుకు ఆర్మీ నేపధ్యం తీసుకున్నారు అంటే, ఇప్పుడు అమ్మాయిలు ఆర్మీకి వెళుతున్నారు ఎక్కువగా అందుకనే తీసుకున్నా అని చెప్పాడు. ఈ సినిమా కథ కోసం చాలా డాక్యుమెంటరీలు చూసాను, అలాగే అవి చూసాక చాలా స్ఫూర్తి పొంది ఈ కథ రాసుకోవటం జరిగింది అని చెప్పాడు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో అమ్మాయిలు ఆర్మీకి వెళ్లడం కూడా చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని, అందుకోసమని ఆలా చూపించాను అని చెప్పాడు.