Meenakshi Chaudhary: ‘భర్త చనిపోతే... కూతుర్ని మిస్ ఇండియా పోటీలకు పంపడమేమిటి?’
ABN, First Publish Date - 2023-01-08T10:19:33+05:30
ఆర్మీ నేపథ్యం నుంచి వచ్చిన అమ్మాయి.. చదువుల్లో టాప్... ఆట పాటల్లోనూ అదరగొడుతుంది. స్విమ్మింగ్‌లో స్టేట్ ఛాంపియన్. బాడ్మింటన్‌లో టాప్.
ఆర్మీ నేపథ్యం నుంచి వచ్చిన అమ్మాయి.. చదువుల్లో టాప్... ఆట పాటల్లోనూ అదరగొడుతుంది. స్విమ్మింగ్‌లో స్టేట్ ఛాంపియన్. బాడ్మింటన్‌లో టాప్. డెంటిస్ట్‌గా కోర్సు పూర్తి చేసింది. ‘మిస్ ఇండియా’ పోటీల్లో పాలుపంచుకొంది. ఇప్పుడు సినిమాల్లో మెరుస్తోంది. తనెవరో కాదు.. మీనాక్షి చౌదరి. జీవితంలో ‘ఆల్ రౌండర్’ అనిపించుకోవాలని తహతహలాడుతున్న మీనాక్షి... తన గురించి, తన కుటుంబం గురించి చెప్పుకొచ్చిన సంగతులివి...
టామ్ బాయ్..
‘‘నేను హరియాణాలోని పంచ్ కులానీ గ్రామంలో జన్మించాను. నాన్న ఆర్మీలో పని చేసేవారు. ఆయనకు మీనాక్షి శేషాద్రి అంటే చాలా ఇష్టం. ఆ అభిమానంతోనే నాకు మీనాక్షి చౌదరి అని పేరు పెట్టారు. ఉద్యోగ రీత్యా బదిలీలు ఎక్కువ. అందుకే దేశమంతా తిరిగాను. ఎక్కడా పట్టుమని రెండేళ్లు కూడా ఉండేవాళ్లం కాదు. దాంతో నాకు స్నేహితులు చాలా తక్కువ. కానీ ఎక్కడికి వెళ్లినా నాదంటూ సొంత గుర్తింపు సంపాదించుకొనేదాన్ని. బాగా చదివేదాన్ని. ఆటపాటల్లో పాల్గొనేదాన్ని. ఓ రకంగా టామ్ బాయ్‌లా ఉండేదాన్ని. డాక్టర్, ఐపీఎస్, ఐఏఎస్.. ఇలా ఏదో ఓ రంగంలో స్థిరపడి మంచి పేరు తెచ్చుకోవాలని ఉండేది. నటిని అవుతానని కలలో కూడా అనుకోలేదు.’’
అది అదృష్టమే..
‘‘తెలుగులో చాలామంది గొప్ప కథానాయికలు ఉన్నారు. సమంత నటన చాలా ఇష్టం. ‘రంగస్థలం’లో ఎంత బాగా నటించిందో చెప్పలేను. ‘ది ఫ్యామిలీ మ్యాన్’లో యాక్షన్ సీన్లలోనూ అదరగొట్టింది. ఎప్పటికైనా ‘మహానటి’లాంటి సినిమాలో నటించాలి. కీర్తి సురేశ్ నటన అంతగా నాలో స్ఫూర్తినింపింది. అనుష్క వ్యక్తిత్వానికి నేను పెద్ద అభిమానిని. ఎంత గొప్ప స్టార్ అయినా.. ఆమె ఒదిగి ఉంటారు. శేఖర్ కమ్ముల సినిమాల్లో కథానాయికల పాత్రలు బాగా డిజైన్ చేస్తారు. ఆయన సినిమాల్లో ఆఫర్ వస్తే.. అది అదృష్టమే.’’
అతి పెద్ద విషాదం..
‘‘నా 20వ ఏట నాన్న చనిపోయారు. అది నా జీవితంలో అత్యంత విషాదకరమైన ఘటన. మా కుటుంబానికి ఆయనొక్కరే ఆధారం. ఆయన లేకపోయేసరికి అంతా చీకటైపోయింది. అప్పటికి నేను డెంటిస్ట్ కోర్సు చేస్తున్నా. చదువుపై ధ్యాస పెట్టలేకపోయాను. నేనేమైపోతానో అనే బెంగ అమ్మలో ఉండేది. ‘చదువుకు బ్రేక్ ఇస్తే ఇవ్వు.. కానీ ఖాళీగా ఉండొద్దు. కావాలంటే మిస్ ఇండియా పోటీలకు ట్రై చెయ్’ అన్నారు. ‘భర్త చనిపోతే... కూతుర్ని మిస్ ఇండియా పోటీలకు పంపడమేమిటి?’ అని బంధువులు రకరకాలుగా మాట్లాడుకొన్నారు. కానీ అమ్మ అవేం పట్టించుకోలేదు. అమ్మ ప్రోత్సాహంతో అందాల పోటీల్లో అడుగుపెట్టా. ‘మిస్ ఇండియా’ కిరీటం గెలుచుకొన్నా.’’
బన్నీ స్టైల్..
‘‘సినిమా అనేది పూర్తిగా నాకు కొత్త ప్రపంచం. ఇక్కడ భాష, పద్ధతులు, అలవాట్లు అన్నీ కొత్తే. కానీ ఎక్కడకు వెళ్లినా, ఆ పరిస్థితులకు అలవాటు పడడం నాకు చిన్నప్పటి నుంచీ ఇష్టమే. అందుకే సినిమాని కూడా త్వరగా అర్థం చేసుకోగలిగా. చిరంజీవి, అల్లు అర్జున్, మహేశ్.. వీళ్లంతా నాకు ఇష్టమే. బన్నీలో ఓ కంప్లీట్ యాక్టర్ కనిపిస్తాడు. తన స్టైల్ నాకు బాగా నచ్చుతుంది.’’
ఎంతో మారాను..
‘‘మిస్ ఇండియా నా జీవితాన్ని మార్చేసింది. నిజానికి నాకు అప్పటికి కనీసం మేకప్ గురించి కానీ, క్యాట్‌వాక్ గురించి కానీ అస్సలు అవగాహన లేదు. నాన్న పోయిన బాధలో ఉన్నా... ఆ సమయంలో నా మైండ్ డైవర్ట్ చేయడం ఒక్కటే ఆలోచించాను. ‘మిస్ ఇండియా’ వల్ల నాలో చాలా మార్పులు వచ్చాయి. జీవితాన్ని చూసే కోణం, ఆలోచించే పద్ధతి మారిపోయాయి. మోడల్‌గా అవకాశాలు వచ్చాయి. ఆ తరవాత ‘నటిస్తావా’ అని అడిగారు. నాలో నటి ఉందా? లేదా? అని తెలుసుకోవడానికి కొన్ని వర్క్ షాపులకు వెళ్లా. అక్కడే సుశాంత్ పరిచయమయ్యాడు. ‘ఇచట వాహనములు నిలపరాదు’లో ఆఫర్ వచ్చింది. ఆ తరవాత ‘ఖిలాడీ’లో నటించాను. ‘హిట్ 2’తో విజయాన్ని సొంతం చేసుకొన్నా.’’
స్పైసీఫుడ్ ఇష్టం..
‘‘నాకు స్పైసీ ఫుడ్ అంటే చాలా ఇష్టం. మటన్ బిర్యానీ ఇష్టంగా తింటాను. ట్రావెలింగ్ చేస్తా. పుస్తకాలు చదువుతా. అప్పుడప్పుడు కవిత్వం కూడా రాస్తుంటా. నాకు ఒకే పని చేస్తూ కూర్చోవడం ఏమాత్రం ఇష్టం ఉండదు. నాకు నేనే బోర్ కొట్టేస్తా. అందుకే రకరకాల వ్యాపకాలు ప్రయత్నిస్తుంటాను. ప్రస్తుతం నా వ్యాపకం సినిమా. ఇది బోర్ కొడితే... డెంటిస్ట్‌గా సెటిల్ అవుతా. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే రేపు వాళ్లేం అవుతారో మనం చెప్పలేం. ఇదే నా ఫిలాసఫీ.’’