Manchu Manoj: అలా చేసి నష్టపోయా... డిస్ట్రబ్ అయ్యా.. ఇప్పుడు వద్దని నిర్ణయించుకున్నా!
ABN, First Publish Date - 2023-04-21T18:09:20+05:30
‘‘కష్టంలో ఉన్న వ్యక్తికి సాయం చేయడంలో తప్పులేదు. కానీ సాయం అడగకుండా మనమే వెళ్లి సాయం చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొవాలి.
‘‘కష్టంలో ఉన్న వ్యక్తికి సాయం చేయడంలో తప్పులేదు. కానీ సాయం అడగకుండా మనమే వెళ్లి సాయం చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొవాలి. అలాంటి వాటి వల్ల చాలా బాధపడ్డాను. ఇకపై అనవసరమైన వాటి జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా’’ అని మంచు మనోజ్ (Manchu manoj) అన్నారు. జీవితంలో ఎదురైన కొన్ని ఘటనలు తనలో ఎంతో మార్పు తీసుకొచ్చాయని ఆయన చెప్పారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... (manchu manoj about Persanal Issue)
‘'వ్యక్తిగతంగా అతి మంచితనంతో చేసిన కొన్ని పనులు చాలా బాధ కలిగించాయి. దానిని బాధ అని కూడా చెప్పను కానీ, వ్యక్తిగత అనుభవంతో నాకు నేనే రియలైజ్ అయ్యాను. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయడంలో తప్పు లేదు. కానీ మనకు మించి మరీ చేయకూడదు. ఎందుకంటే ఎవరి జీవితాన్ని వారు చూసుకోవాలి. బయటవాళ్లు, ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు ఎంతోమందికి సాయం చేశాను. వాళ్లు అడగకపోయినా సాయం చేయడానికి సిద్ధపడ్డాను. కొన్నాళ్లకు అదే తప్పు అనిపించింది. ఎవరైనా సాయం అడిగితే చేయడం వేరు. అడగకుండా మనకు మనమే వెళ్లి సాయం చేయడం వల్ల తెలియని ఇబ్బందులు వస్తాయి. అలాంటి వాటి వల్ల చాలా బాధపడ్డాను. సినిమాల్లో నటిస్తున్నప్పుడు నా పనులన్నీ పక్కనపెట్టి వేరే వాళ్ల పనులు చేసేవాడిని. ఆ తర్వాత నా పనులు పూర్తి కావడానికి సమయం పట్టేది. దాని వల్ల చాలా నష్టపోయాను. చాలా డిస్ట్రబ్ అయ్యాను కూడా. అప్పుడు బ్రేక్ తీసుకుందామనుకున్నా. ఇప్పుడు నాకు భార్య, పిల్లాడు ఉన్నారు. ప్రస్తుతం వాళ్లిద్దరే నాకు మొదటి ప్రాధాన్యం. ఇకపై నేను ఏం చేసినా వాళ్ల కోసమే! మౌనిక నన్ను నమ్ముకుని తన బిడ్డతో నా (Mounika Bhuma) జీవితంలోకి వచ్చింది. ఆ నమ్మకాన్ని జీవితాంతం నేను నిలబెట్టుకోవాలి. ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. అనవసరమైన వాటి జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా’’.
‘అహం బ్రహ్మాస్మి ఎందుకు ఆగిందంటే... (Aham brahmasmi)
ఆ సినిమా కోసం రెండేళ్లు కష్టపడ్డాం. మౌనికతో నా బంధాన్ని అంగీకరించని సమయంలో సినిమా, ప్రేమ ఏదో ఒకటి నిర్ణయించుకో అనే పరిస్థితి ఎదురైంది. నన్ను నమ్ముకుని ఒక అమ్మాయి నిలబడింది. అలాంటి సమయంలో డబ్బు, కెరీర్ కోసం ఆశపడి నా అడుగు అటు వేసి ఉంటే నేను ప్రాణాలతో ఉండి వేస్ట్ అనిపించింది. సినిమానా, కెరీర్ అన్న ప్రశ్న వచ్చినప్పుడు నేను మౌనిక, బాబుని ఎంపిక చేసుకున్నాను. ఆ సమయంలో హైదరాబాద్‌లోనే ఉంటే ఇబ్బంది అవుతుందని చెన్నైకు వెళ్లిపోయాం. ఎవరికీ తెలియకుండా ఒకటిన్నర సంవత్సరం అక్కడే ఉన్నాం. నిజాయతీగా ముందుకు వెళ్లే వాళ్లకు కష్టాలు కాస్త ఎక్కువగా వస్తాయి. ఆ సమయంలో ‘అహం బ్రహ్మాస్మి’ దర్శకుడు శ్రీకాంత్‌కు సారీ చెప్పి ఆ ప్రాజెక్ట్ వదిలేశాను. శ్రీకాంత్ ఇప్పుడు నా సోదరుడు వైష్ణవ్ తేజ్‌తో సినిమా చేస్తున్నాడు. నాకెంతో సంతోషంగా ఉంది. భవిష్యత్తులో తప్పకుండా ‘అహం బ్రహ్మాస్మి’ చేస్తాను. దానిని కొంత సమయం పడుతుంది. ముందు నేను వేరే సినిమాలు చేసి డబ్బు సంపాదించాలి. ఆ తర్వాత ఆ చిత్రాన్ని నేనే నిర్మిస్తా’’ అని తెలిపారు.