Prabhas: ఆదిపురుష్ ట్రైలర్.. ముఖ్యమంత్రి ప్రశంసలు!
ABN, First Publish Date - 2023-05-04T15:15:13+05:30
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్, లుక్స్ విడుదలయ్యాక విమర్శలు ఎదురైన సంగతి తెలిసిందే!
ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’9Adipurush) . రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్, లుక్స్ విడుదలయ్యాక విమర్శలు ఎదురైన సంగతి తెలిసిందే! ఇతిహాసాలను అపహాస్యం చేస్తున్నారని, ఇదొక యానిమేషన్ చిత్రమని సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్లు చేశారు. ఇప్పుడిప్పుడే చిత్రంపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. తాజాగా విడుదలైన లుక్స్ అన్ని ఆకట్టుకున్నాయి. దాంతో సినిమాలపై అంచనాలూ పెరిగాయి. టీజర్‌తో మరింత హైప్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి (Madhyapradesh Cm) శివరాజ్‌సింగ్ ఛౌహాన్ (Sivaraj singh Chowha) వీక్షించారు. ఆ మేరకు ఆయన చిత్ర బృందాన్ని అభినందించారు. ‘‘ఆదిపురుష్’ ట్రైలర్ చూడడం ఆనందంగా ఉంది. కచ్చితంగా ప్రేక్షకులను అలరించే చిత్రమిది. నిర్మాత భూషణ్‌కుమార్, గేయ రచయిత మనోజ్‌లతో కూర్చుని ‘ఆదిపురుష్’ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకున్నా. శ్రీరాముడి పాత్ర ప్రజలపై బలమైన ప్రభావం చూసేలా ఈ చిత్రం ఉందని విశ్వసిస్తున్నాను. చిత్రంలో పాత్రధారులు ఆయా పాత్రలకు ప్రాణం పోశారు’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అభినందనలకు చిత్ర బృందం కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేసింది.
రామాయణ ఇతిహాసం ఇతివృత్తంగా భారీ బడ్జెట్‌తో దర్శకుడు ఓంరౌత్ (Om raut) తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతీసనన్ సీతగా నటిస్తున్నారు. లంకాధిపతిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే నటిస్తున్నారు. ఎన్నో వాయిదాల తర్వాత ఈ చిత్రం జూన్ 16న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమైంది. మే 9న ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల్లో 105 థియేటర్‌లలో ఈ ట్రైలర్‌ను ప్రదర్శించనున్నారు. అయితే ఈసారి త్రీడీ వెర్షన్‌లో కూడా విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. తదుపరి ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.