Chiranjeevi - Khaidi : ఖైదీ చిత్రానికి 40 ఏళ్లు!
ABN, First Publish Date - 2023-10-28T15:27:10+05:30
చిరంజీవి (chiranjeevi) సినీ చరిత్రలో 'ఖైదీ’ (khaidi) సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అప్పట్లో వచ్చిన కల్ట్ క్లాసిక్ సినిమా ఇది. అప్పటి వరకూ కమర్షియల్ ఫార్మెట్ వేరు. ఈ చిత్రం తర్వాత కమర్షియల్ సినిమా లెక్క మొత్తం మారిపోయింది. టాలీవుడ్ కలెక్షన్ల లెక్కల రూపురేఖల్ని మార్చేసిన సినిమా ఖైదీ. చిరంజీవి సినిమాల్లో కలెక్షన్ల స్టామినా చూపించిన సినిమా ఇది.
చిరంజీవి (chiranjeevi) సినీ చరిత్రలో 'ఖైదీ’ (khaidi) సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అప్పట్లో వచ్చిన కల్ట్ క్లాసిక్ సినిమా ఇది. అప్పటి వరకూ కమర్షియల్ ఫార్మెట్ వేరు. ఈ చిత్రం తర్వాత కమర్షియల్ సినిమా లెక్క మొత్తం మారిపోయింది. టాలీవుడ్ కలెక్షన్ల లెక్కల రూపురేఖల్ని మార్చేసిన సినిమా ఖైదీ. చిరంజీవి సినిమాల్లో కలెక్షన్ల స్టామినా చూపించిన సినిమా ఇది. చిరంజీవి, మాధవి జంటగా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించారు. సంయుక్తా మూవీస్ పతాకంపై ధనుంజయరెడ్డి, కె.నరసారెడ్డి, ఎస్.సుధాకరరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఖైదీ’ చిత్రం 1983 అక్టోబర్ 28న విడుదలైంది. అంటే నేటికి ఈ చిత్రం విడుదలై నాలుగు దశాబ్ధాలు పూర్తయింది. ఈ చిత్రంతో చిరంజీవి అభిమానుల గుండెలో శాశ్వత ఖైదీగా నిలిచిపోయారు. బెయిల్ దొరకని ‘ఖైదీ’ లా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బందీ అయిపోయారు. ఖైదీ చిత్రం 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేశారు. (Khaidi Completes 40 Years)
'ఖైదీ' చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత 'ఖైదీ’ని చేసింది. నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం. ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేను. ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలైన సందర్భంగా ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆ చిత్ర దర్శకులు ఎ.కోదండరామిరెడ్డిగారిని నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీమ్‌ని, నా కోస్టార్స్ సుమలత, మాధవి మొత్తం టీమ్‌ను అభినందిస్తూ, అంత గొప్ప విజయాన్ని మాకు అందించిన తెలుగు ప్రేక్షకులు అందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను’’ అని ట్వీట్‌లో చిరంజీవి పేర్కొన్నారు.
ఈ చిత్రం గురించి పలు ఆసక్తికర విషయాలు..
1. అసలు ఈ చిత్రాన్ని ‘ఖైదీ’ సూపర్‌స్టార్ కృష్ణ చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన చేయలేకపోయారు. దాంతో చిరంజీవికి ఆ అవకాశం దక్కింది. తొలుత ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయాలనుకున్నారు. అది కూడా కుదరకపోవడంతో కోదండరామిరెడ్డిని ఆ అవకాశం వరించింది.
2. 1982లో వచ్చిన అమెరికన్ మూవీ ‘ఫస్ట్ బ్లడ్’ ఆధారంగా రూపొందిన చిత్రమిది. షూటింగ్ మొదలైన కొన్ని రోజుల వరకు చిరు కథ వినలేదు. కొద్దిరోజుల తర్వాత చిరంజీవి పూర్తి కథ వినడం జరిగింది. పరిచూరి సోదరులపై చిరుకి ఉన్న నమ్మకం వల్ల చిరంజీవి అలా చేశారు. ఆయనకు ఆస్థాన రచయితలుగా పేరొందిన పరిచూరి బ్రదర్స్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌కు కథను అల్లారు. కె.చక్రవర్తి సంగీతంలో పాటలన్నీ సూపర్‌హిట్టే! 'రగులుతోంది మొగలి పొద’ పాట ఇప్పటికీ ఓ సంచలనమే!
3. ఈ చిత్రానికి చిరంజీవి రూ.1,75,000 పారితోషికంగా అందుకున్నారు. కోదండరామిరెడ్డి రూ.40,000 అందుకున్నారు. ఈ చిత్రం 100 రోజుల వేడుకకు కృష్ణ అతిథిగా హాజరయ్యారు. ‘ఖైదీ’ 1983 సంవత్సరానికి అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఆరోజుల్లో ఈ సినిమాకు 3.2 కోట్ల టికెట్లు తెగాయి. ఇది ఆ టైమ్‌లో పెద్ద రికార్డుగా చెబుతారు.
4. 1984లో ‘ఖైదీ’ చిత్రాన్ని హిందీలో జితేంద్రతో రీమేక్ చేశారు. ఆ రీమేక్‌లో కూడా మాధవి హీరోయిన్‌గా నటించింది. ‘ఖైదీ’ రూ.25 లక్షల బడ్జెట్ లో రూపొందిన మూవీ. రూ.70 లక్షల బిజినెస్ చేసిన మూవీ. కానీ బాక్సాఫీస్ వద్ద ఆ రోజుల్లోనే రూ.4 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ‘ఖైదీ’ చిత్రం ఆ రోజుల్లో 20 కేంద్రాల్లో 100 రోజులు, 5 కేంద్రాల్లో 200 రోజులు, 2 కేంద్రాల్లో 365 రోజులు ఆడింది.