Karthikeya - Bedurulanka: లెక్కలు వేసుకోకుండా చేసిన సినిమా ఇది
ABN, First Publish Date - 2023-08-24T13:27:14+05:30
కార్తికేయ గుమ్మకొండ(Karthikeya), నేహా శెట్టి (Neha Shetty)జంటగా నటించిన సినిమా 'బెదురులంక 2012' (Bedurulanka 2012) లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
కార్తికేయ గుమ్మకొండ(Karthikeya), నేహా శెట్టి (Neha Shetty)జంటగా నటించిన సినిమా 'బెదురులంక 2012' (Bedurulanka 2012) లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శుక్రవారం సినిమా విడుదల కానుంది. హైదరాబాద్‌లో బుధవారం రాత్రి ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు.
కార్తికేయ మాట్లాడుతూ ''నేను ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లు, సినిమాలు వేరు. 'బెదురులంక 2012' వేరు. 'ఆర్ఎక్స్ 100'తో ఒకసారి ఇంట్రడ్యూస్ అయ్యాను. మళ్ళీ ఇంకోసారి 'బెదురులంక 2012'తో అవుతున్నాను. రెండిటిలో శివ పేరు కుదిరింది. క్లాక్స్ కథ చెప్పినప్పుడు ఇందులో నా క్యారెక్టర్, హీరోయిజం ఎంత ఉంది? మార్కెట్ ఎలా ఉంది? వంటి లెక్కలు వేసుకోలేదు. కథ వినగానే నేను ఎంజాయ్ చేసినట్లు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తే బావుంటుందని అనిపించింది. ఆరు గంటలకు క్లాక్స్ కథ చెప్పడం మొదలు పెడితే రాత్రి 12 అయ్యింది. ఈ కథను ఆడియన్స్ 100 పర్సెంట్ ఎంజాయ్ చేస్తారని, ఆలోచిస్తారని అనిపించింది. జీవితంపై క్లాక్స్ కు ఉన్న క్లారిటీ సినిమాలో కనిపిస్తుంది. ఈ సినిమా చేస్తున్న క్రమంలో మనిషిగా నేను కూడా మారాను. ఆ మార్పు ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇందులో వేరేగా ఉన్నానని ప్రేక్షకులకు అనిపిస్తుంది. ఇటువంటి కథను నాతో సినిమా చేయడానికి నిర్మాత నమ్మాలి. నాతో లవ్ స్టోరీ, యాక్షన్ సినిమా చేయడానికి నిర్మాతలు వస్తారు. ఈ క్యారెక్టర్ నేను చేయగలనని క్లాక్స్ నమ్మాడు. మేం ఇద్దరం ఈ సినిమా చేయగలమని నిర్మాత బెన్నీ నమ్మారు. ఇందులో కథానాయికగా నేహా శెట్టిని అనుకోలేదు. బెన్నీ గారు ఆమె పేరు చెబితే మేం డౌట్ పడ్డాం. మా భయం కన్నా ఆమె ఎక్కువ భయపడిందని షూటింగ్ చేస్తున్నప్పుడు మాకు అర్థమైంది. రాధికా కనిపించకూడదని చాలా జాగ్రత్తలు తీసుకుని నటించింది. తన క్యారెక్టర్ వరకు కాకుండా సినిమాను చూసింది. మణిశర్మ గారి 'రామా చిలకమ్మా' సాంగ్ వల్ల నాలో ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ మొదలైంది. ఎంతో మంది హీరోలతో, ఎన్నో జానర్ సినిమాలు చేసినప్పటికీ... ఈ తరహా సినిమాను ఎప్పుడు చేయలేదని, తన మొదటి సినిమాకు పని చేసినట్లు చేస్తున్నానని మణిశర్మ గారు చెప్పారు. సినిమాలో ప్రతి క్యారెక్టర్ కీలకమే. నా గత చిత్రాల్లో మిస్ అయినవి వడ్డీతో సహా ఈ సినిమాతో ఇచ్చేస్తాం" అని అన్నారు.
దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ ''బెన్నీ గారు సెన్సిబుల్ కథలు ఎంపిక చేస్తారని అందరూ చెప్పారు. కొంత కాలంగా నేను చెప్పిన కథలో పలువురు నిర్మాతల్లో ఏవేవో చూసారు. కానీ బెన్నీ మాత్రం కోర్ పాయింట్ అర్థం చేసుకున్నారు. నేను చాలా మంది హీరోలకు కూడా కథ చెప్పా. తమకు తగ్గట్టు మార్చమని అడిగారు. కార్తికేయకు కథ చెప్పినప్పుడు బెన్నీ గారిలా కథను అర్థం చేసుకున్నారు. మంచి టీమ్ కుదిరింది. మణిశర్మగారి సంగీతం, వినోద్ గారి సౌండ్ డిజైనింగ్ అద్భతం'' అని అన్నారు.
హీరోయిన్ నేహా శెట్టి మాట్లాడుతూ ''ప్రేక్షకులు అందరూ 'డీజే టిల్లు'లో తెలంగాణ అమ్మాయి రాధికను చూశారు. ఇప్పుడు 'బెదురులంక 2012'లో ఆంధ్ర అమ్మాయి చిత్రను చూడబోతున్నారు. నేను ఎగ్జైటెడ్ గా ఉన్నాను. మంచి సినిమాలో నేను భాగం అయినందుకు సంతోషంగా ఉంది. పల్లెటూరి అమ్మాయిగా నటించగలనా? లేదా? అని దర్శకుడు క్లాక్స్ సందేహించినా... నిర్మాత బెన్నీ గారు సజస్ట్ చేశారు. 'ఆర్ఎక్స్ 100' సినిమాకు స్నేహితులతో కలిసి వెళ్ళా. సినిమా నాకు బాగా నచ్చింది. అప్పుడు ఆ హీరోతో 'బెదురులంక 2012' చేస్తానని అనుకోలేదు' అని అన్నారు.