Jamuna-savitri: అక్క.. నేను ఏడాది మాట్లాడుకోలేదు!
ABN, First Publish Date - 2023-01-27T16:57:30+05:30
సావిత్రి కారణంగానే జమున సినిమాల్లోకి వచ్చారని ఆమె పలు సందర్భాల్లో చెప్పారు. సావిత్రి నాటకరంగంలో రాణిస్తున్న సమయంలో దుగ్గిరాలలో సావ్రితిని కలిశారు. అక్కడ మాటల్లో సినిమాలపై జమునకు ఉన్న ఆసక్తిని గమనించి సినిమాల్లోకి ఆహ్వానించారు.
సావిత్రి (savitri)కారణంగానే జమున (jamuna)సినిమాల్లోకి వచ్చారని ఆమె పలు సందర్భాల్లో చెప్పారు. సావిత్రి నాటకరంగంలో రాణిస్తున్న సమయంలో దుగ్గిరాలలో సావ్రితిని కలిశారు. అక్కడ మాటల్లో సినిమాలపై జమునకు ఉన్న ఆసక్తిని గమనించి సినిమాల్లోకి ఆహ్వానించారు. సినిమాల్లోకి వచ్చాక ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. సావిత్రిని అక్కా అని ఆప్యాయంగా పిలిచేవారు జమున. వీరిద్దరూ ఓ ఏడాది పాటు మాట్లాడుకోకుండా దూరంగా ఉన్నారంటే నమ్మగలమా? అదే జరిగిందే. అసలు కథేంటో.. జమున మాటల్లోనే..
‘మిస్సమ్మ’, ‘దొంగరాముడు’, ‘అప్పు చేసి పప్పుకూడు’ వంటి చిత్రాల్లో నేను, సావిత్రి అక్కాచెల్లెళ్లుగా నటించాం. దానివల్ల మరింత అనుబంధం ఏర్పడింది. అలా నన్ను చెల్లి అని పిలుస్తుండేది. నా పెళ్లికి ఆహ్వానిేస్త.. ఇంటికి వచ్చి నన్ను రెడీ చేసింది. మా ఇంట్లో జరిగిన ప్రతి కార్యక్రమంలోనూ అక్క పాల్గొంది. అయితే ఓ సారి కొంతమంది వ్యక్తులు మా ఇద్దరిమధ్య తగవు పెట్టారు. అలా మేమిద్దరం ఏడాది మాట్లాడుకోలేదు. తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలిగిపోయి మళ్లీ కలుసుకున్నాం. . చివరిసారి చెన్నైలో సావిత్రి అక్క పరిస్థితి చూసి చలించిపోయాను’’ అని భావోద్వేగానికి లోనయ్యారు జమున. (jamuna cute fight with savitri)
గుండమ్మ కోసం మూడేళ్లు ఎదురుచూశారు...
ఆత్మాభిమానంతో ఉండాలనుకుంటే ఎవరితోనైనా గొడవలు వస్తాయి. అలాంటి ఇబ్బందే ఏయన్నార్‌తో వచ్చింది. దాని వల్ల ఆయనతో కొన్నేళ్లు సినిమాలు చేయలేదు. ఏ రంగంలోనైనా ఆత్మాభిమానం పొగొట్టుకోకూడదు అనుకుంటే స్ర్తీ తప్పక సమస్యల్ని ఎదుర్కొవాలి. సరోజ పాత్ర చేయాలని నా కోసం చక్రపాణి, నాగిరెడ్డి మూడేళ్లు ఎదురుచూశారు. ఓ రోజు నాగేశ్వరరావుతో నాగిరెడ్డి, చక్రపాణి సమావేశమయ్యాం. ‘నా గుండమ్మ మూడేళ్లుగా ఏడుస్తోందయ్యా.. చేయండి’ అని నాగేశ్వరరావుతో చెప్పారు. అప్పుడు ఒకే అనుకుని ఆ సినిమా చేశా. అందులో చిలిపి అమ్మాయిగా చేశాను’’ అని జమున అన్నారు.