కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jai Vittalacharya : త్రివిక్రమ్ చేతుల మీదుగా పుస్తకావిష్కరణ

ABN, First Publish Date - 2023-10-01T17:07:57+05:30

జానపద బ్రహ్మ బి. విఠలాచార్య దర్శకత్వం వహించిన, నిర్మించిన సినిమాలు చూడని ప్రేక్షకులు ఉండరని అంటే అతిశయోక్తి కాదు. తరాలు మారినా తరగని ఆదరణ కల చిత్రాలు తీశారాయన. మాటల మాంత్రికులు త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది.

 


జానపద బ్రహ్మ బి. విఠలాచార్య దర్శకత్వం వహించిన, నిర్మించిన సినిమాలు చూడని ప్రేక్షకులు ఉండరని అంటే అతిశయోక్తి కాదు. తరాలు మారినా తరగని ఆదరణ కల చిత్రాలు తీశారాయన. విఠలాచార్య సినిమా స్టైల్‌ ఆఫ్‌ మేకింగ్‌, ఆయన సినీ ప్రయాణాన్ని ఈతరం ప్రేక్షకులకు సమగ్రంగా పరిచయం చేయాలని సీనియర్‌ జర్నలిస్ట్, రచయిత పులగం చిన్నారాయణ (Pulagam Chinnarayana) సంకల్పించి... 'జై విఠలాచార్య' (Jai Vittalacharya) పుస్తకాన్ని తీసుకొచ్చారు. 'మూవీ వాల్యూమ్ మీడియా' ఆధ్వర్యంలో షేక్ జీలాన్ బాషా ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికులు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) చేతుల మీదుగా ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. తొలి ప్రతిని సీనియర్ సివిల్ సర్వెంట్, రైల్వే ఉన్నతాధికారి రవి పాడి అందుకున్నారు.  

'త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ''విఠలాచార్య అంటే ఫాదర్ ఆఫ్ తెలుగు మాస్ సినిమా, ఫాదర్ ఆఫ్ జానపదాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న వీఎఫ్ఎక్స్ ఫిల్మ్స్ వంటి వాటికి అన్నిటి కంటే ముందు... తెలుగు సినిమా మొదలైన రోజుల్లో చాలా అడ్వెంచరస్ గా సినిమా తీసిన గొప్ప సాంకేతిక నిపుణుడిగా ఆయనను చూస్తాను. ఆయన సక్సెస్ రేషియో గానీ, ఆయన తాలూకూ రీచ్ గానీ, ఆయన పాపులారిటీ గానీ ఇప్పుడున్న తరానికి, ప్రస్తుతం చాలా మందికి తెలియదు. యూట్యూబ్ లేదా పాత సినిమాలు ప్రసారం చేసే ఛానళ్లలో చూడటం తప్ప ఆయన గురించి ఎక్కువ మందికి తెలియదు. ఆయన జీవితం, ప్రస్థానాన్ని జనం ముందుకు తీసుకు రావాలనే ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇటువంటి పుస్తకాలు తీసుకు రావడం లాభసాటి వ్యాపారం కాదు. సినిమాపై వాళ్ళకు ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తోంది. పుస్తకాలు అంటే అభిమానించే వ్యక్తిగా ఇటువంటి ప్రయత్నాలు బావుండాలని, ప్రజల్లో పుస్తక పఠనం బాగా పెరగాలని కోరుకుంటున్నా. చరిత్రను రికార్డ్ చేయడం అనేది తెలుగులో తక్కువ. తెలుగు సినిమా చరిత్ర చాలా తక్కువగా అందుబాటులో ఉంది. పులగం చిన్నారాయణ గారు ఇంకా ఇంకా ఎక్కువ పుస్తకాలు రాయాలి. ఆయనకు ఆ శక్తి, ఆసక్తి... రెండూ ఉన్నాయి కాబట్టి పుస్తకాలు ఇలాగే రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను'' అని చెప్పారు. 



పులగం చిన్నారాయణ మాట్లాడుతూ ''విఠలాచార్య గారు సినిమాలు తీసినంత వేగంగా యి పుస్తకం రాశాను.  కృష్ణ గారు, కైకాల సత్యనారాయణ గారు, జమున గారు, వాణీశ్రీ గారు, రాజశ్రీ గారు, జయమాలిని గారు, నరసింహ రాజు గారు ... ఇలా ఎందరో అతిరథ మహారథులతో ఈ పుస్తకం కోసం ఇంటర్వ్యూలు చేశా. అలాగే, విఠలాచార్య గారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయనకు సంబంధించిన విషయాలు తెలుసుకున్నాను. తెలుగులో విఠలాచార్య గారు దర్శకత్వం వహించిన 39 సినిమాల తెరవెనుక విశేషాలు, ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, ఇప్పటి వరకు ఎక్కడ లేని సమాచారంతో ఈ పుస్తకం రెడీ చేశా. సినిమాలు, సాహిత్యంపై విపరీతమైన అనురక్తి ఉన్న త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది'' అని చెప్పారు.   

సీనియర్ సివిల్ సర్వెంట్, రైల్వే ఉన్నతాధికారి రవి పాడి, షేక్ జీలాన్ బాషా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated Date - 2023-10-01T17:08:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!