RIP Chandra Mohan : లక్కీస్టార్... ఐదు దశాబ్దాల కోరిక తీరింది
ABN, First Publish Date - 2023-11-11T13:42:14+05:30
చంద్రమోహన్ తెలుగు చిత్రాభిమానులకు సుపరిచితమైన పేరు. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 900లకు పైగా చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులను అలరించారు. ఒకప్పుడు హీరోగా, తర్వాత కమెడీయన్ గా, ఈ తరానికి తండ్రిగా, అన్నగా, అంకుల్‌గా ఎన్నో వైవిధ్య పాత్రలతో మెప్పించారు. సహజసిద్ధమైన నటన ప్రదర్శించడం చంద్రమోహన్ శైలి.
చంద్రమోహన్ (Chandra Mohan) తెలుగు చిత్రాభిమానులకు సుపరిచితమైన పేరు. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 900లకు పైగా చిత్రాలతో దక్షిణాది ప్రేక్షకులను అలరించారు (Chandra Mohan funeral). ఒకప్పుడు హీరోగా, తర్వాత కమెడీయన్ గా, ఈ తరానికి తండ్రిగా, అన్నగా, అంకుల్‌గా ఎన్నో వైవిధ్య పాత్రలతో మెప్పించారు. సహజసిద్ధమైన నటన ప్రదర్శించడం (Natural Artists) చంద్రమోహన్ శైలి. జంధ్యాల పురస్కారాన్ని అందుకున్న సమయంలో ఆయన ఆసక్తికర విషయాలను, తన అనుభూతులు, అనుభవాలను పంచుకున్నారు... (Chandra Mohan death)
కృష్ణా జిల్లా ఉయ్యూరుకు సమీపంలో పమిడిముక్కల ఆయన స్వగ్రామం. ఆదుర్తి సుబ్బారావు, కృష్ణ, రామ్మోహనరావు రూపొందించిన 'తేనె మనసులు’ చిత్రం చూశాక ఆయనకు నటనపై ఆసక్తి కలిగింది(Veteran Telugu actor Chandra Mohan). దాంతో వెంటనే ఉద్యోగానికి సెలవు పెట్టేసి మద్రాస్ వెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టారు. 'ఆ సమయంలో నా అదృష్టం కొద్ది దిగ్దర్శకులు బి.ఎన్.రెడ్డి రూపొందించిన 'రంగులరాట్నం’ (Rangula Ratnam) చిత్రంలో నటించే అవకాశం దక్కింది. 1966లో విడుదలైన ఆ చిత్రం విజయవంతం కావడమే కాకుండా పలు అవార్డులను కూడా తెచ్చిపెట్టింది. అంతే ఒక్కసారిగా సినిమా అవకాశాలు వరుసకట్టాయి. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేసి, సినిమాల బాట పట్టాను. నటననే వృత్తిగా నమ్ముకున్నా’’ అని చెప్పారు. (Intresting facts on Chandramohan)
హీరోయిన్ల లక్కీస్టార్.. (Lucky star For Heroines)
యాదృచ్చికమే అయినా నా పక్కన నటించిన దాదాపు 60 మంది కథానాయికల్లో అత్యధికులు ఆ తర్వాత టాప్‌స్టార్లు అయ్యి నాతో తొలిసారి నటిస్తే స్టార్‌డమ్ కచ్చితమనే సెంటిమెంట్ వ్యాపించేలా చేశారు. తెలుగువారినే కాకుండా యావత భారతదేశాన్ని అలరించిన శ్రీదేవి, జయప్రదలాంటి వారితోపాటు జయసుధ, విజయ నిర్మల, రాధిక, విజయశాంతి, మంజుల, చంద్రకళ ఇలా ఎందరికో తొలి హీరోనే నేనే. హిందీ నటి రేఖ ురంగుల రాట్నం’ చిత్రంలో నాతో కలిసి చిన్న పాత్రలో నటించింది. ఆ తర్వాత చాలా కాలానికి అమితాబ్ బచ్చనతో మద్రాస్‌లో షూటింగ్‌లో పాల్గొంటే ఆ పక్కనే వేరే ఫ్లోర్‌లో ఉన్న నన్ను ునా మొదటి సినిమాలో హీరో’ అని అమితాబ్‌కి పరిచయం చేయడం ఎప్పటికీ మరచిపోలేని మధురానుభూతి. (chandra mohan passed away)
ఫేవరెట్ హీరోయిన్
నా అభిమాన హీరోయిన్ జయసుధ. మేమిద్దరం కలిసి 34 చిత్రాల్లో జంటగా నటించాం. వాటిల్లో సత్యభామ, ఇంటింటి రామాయణం, గోపాలరావుగారి అమ్మాయి వంటి వినోదాత్మక చిత్రాలతోపాటు కలికాలం, ఆమె, సగటు మనిషి, అమ్మాయి కాపురం వంటి భాగోద్వేగ చిత్రాలూ చేశాం. సహజత్వానికి పెద్ద పీట వేసే మా ఇద్దరి నటనాశైలి కలవడం వల్లనేమో మా జంట చూడటానికి చక్కగా ఉండేది.
మరచిపోతారు.. మారిపోతారు..
వెనక్కి వెళ్లి చూసుకుంటే మనం ఎన్ని చిత్రాల్లో నటించినా కొంతకాలం తెరపై కరిపించకపోతే ప్రేక్షకులు మరచిపోతారు. అభిమానం మారిపోతుంది. అందువల్లనే కథానాయకుడిగా అవకాశాలు తగ్గుతున్న క్రమంలో ఆ విషయం గురించి మథనపడకుండా అన్న, తండ్రి పాత్రలకు షిప్ట్ అయ్యా. దానివల్లే ఎక్కువ కాలం తెరపై కనిపించా. హీరో పాత్రలే చేస్తానని భీష్మించుకుని కూర్చుని ఉంటే ఎప్పుడో కనుమరుగైపోయేవాడిని.
హై పిచ్ యాక్టింగ్ వద్దంటున్నారు...
సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ చేయడమంటే నాకెంతో ఇష్టం. గతంలో దిగ్గజాల్లాంటి నటులతో అలాంటి సన్నివేశాల్లో నటించే అదృష్టం దక్కింది. కానీ ఇప్పుడు అలాంటి సన్నివేశాలూ లేదు. అంతలా హావభావలు పలికించగల నటీనటులూ లేరు. అయినా అడపాదడపా నాలోని నటుడిని సంతృప్తి పరుచుకునే అవకాశాలు లభిస్తుంటాయి. '7/జి బృందావన కాలనీ’లో కన్న కొడుకుపై కోపగించుకునే సన్నివేశంలో నా నటన అప్పట్లో నాకు బాగా నచ్చింది. ప్రస్తుత దర్శకులు నాలాంటి నటులు ఎవరన్నా హై పిచ్ లో నటిస్తామంటే 'ఈతరం ప్రేక్షకులు చూడరండీ... అంతొద్దు’ అంటూ పైపైన తేల్చేస్తున్నారు. మొదటి నుంచి దర్శకులు ఎంతమేర నటించమంటే అంతవరకూ చేస్తూ వచ్చాను. అందుకేనేమో అప్పటి నుంచి నేటితరం దర్శకుల దాకా కంఫర్ట్‌గా వర్క్ చేయగలుగుతున్నాను.
అనుసరించా.. కానీ అనుకరించలేదు..
తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎన్టీఆర్, ఏయన్నార్; ఎస్వీఆర్ ప్రభావం నాపై ఉన్నప్పటికీ తమిళ కథానాయకుడు శివాజీ గణేశన్ నటనతో నేను అధికంగా ప్రభావితమయ్యా. ఆయన ఏ రసాన్నయినా అద్భుతంగా పండించగలరు. ఆ నటనా వైభవం నాకు స్ఫూర్తినిచ్చింది. అయితే ఆయన్ని అనుసరించే ప్రయత్నం చేశానే తప్ప అనుకరించలేదు.
అదో గొప్ప ప్రశంస..అప్పట్లో అందరు నటులనూ అనుకరించే మిమిక్రీ ఆర్టిస్ట్‌లు నన్ను మాత్రం వదిలేసేవారు. ఎందుకో చాలా కాలం అర్థం కాలేదు. ప్రఖ్యాత ధ్వన్యనుకరణ కళాకారుడు హరికృష్ణను ఓ సందర్భంలో దీని గురించి అడిగితే 'ప్రతి నటుడికి ఓ స్టైల్ మ్యానరిజం, శైలి ఉంటాయి. కానీ మీరు మాత్రం అలాంటిది ఏమీ లేకుండా సహజంగా పాత్ర మేరకే నటిస్తుండడంతో అనుకరించలేకపోతున్నాం’ అన్నారు. ఇది నాకు దక్కిన గొప్ప ప్రశంస.
బుల్లితెర ఆసక్తిలేదు..ఆ తరం నటీనటులు, ఆ తర్వాతివారిలో పలువురు టీవీ సీరియళ్లలో కనిపిస్తున్నా.. నాకు మాత్రం వెండితెరపైనే దృష్టంతా. టీవీకి వెళ్లాలనే ఆసక్తి అసలు కలగలేదు. ఎన్నో అవకాశాలు వచ్చినా అంగీకరించలేదు.
రాలేదనే బాధలేదు...ఇన్నేళ్ల సినిమా జీవితం. వైవిధ్యమైన పాత్రలు., ప్రేక్షకుల మన్ననలు, రివార్డులు పొందిన తర్వాత పద్మశ్రీ, గౌరవ డాక్టరేట్లు వంటివి రాలేదు ఎందుకని అభిమానులు అడుగుతుండేవారు. నాకంటే ప్రతిభావంతులు, ప్రభావితం చేసిన నటులకే దక్కకపోవడం చూసి అలాంటి వాటి మీదకు నా ఆసక్తి పోలేదు. అలాగని ఏ రోజు వాటి గురించి తహతహలాడలేదు.. రాలేదని బాధలేదు ’’ అని చంద్రమోహన చెప్పుకొచ్చారు.
కోరిక తీరింది...ఆరోగ్యం, ఆయుష్షు సహకరిస్తే 75 ఏళ్ల వరకూ నటనలో కొనసాగి అర్థ శతాబ్ధం పూర్తి చేయాలనుకున్నారు. చంద్రమోహన. ఆ సంతృప్తితో తదుపరి ప్రశాంత, ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలనుకున్నారు. ఆ సమయంలో కూడా ఆయనలోని నటుడిని పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచే అవకాశాలు వస్తే నటించాలనుకున్నారు. ఆయన అనుకున్నట్లుగానే 75 సంవత్సరం వరకూ చిత్రాల్లో నటిస్తూనే ఉన్నారు. నటుడిగా ఐదున్నర దశాబ్దాలు పూర్తి చేసుకుని.. ఆయన కోరిక తీర్చుకున్నారు.