ComedianSudhakar: ఆ వార్తలు నమ్మకండి, నేను చాలా హ్యాపీ గా వున్నాను: సుధాకర్
ABN, First Publish Date - 2023-05-25T12:49:22+05:30
సీనియర్ నటుడు, కమెడియన్ సుధాకర్ ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు కొన్ని రోజుల నుండి సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వీటన్నిటికీ స్పందిస్తూ సుధాకర్ ఒక వీడియో విడుదల చేశారు. తాను సంతోషంగా వున్నాను అని, తన మీద వచ్చిన వార్తలు ఫేక్ అని, అలాగే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దని అన్నారు.
ఈమధ్య సాంఘీక మాధ్యమంలో చాలామంది నటుల ఆరోగ్యం గురించి చాలా తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఇలా రాస్తూ ఉంటే, పాపం ఆ నటులు తాము సంతోషంగా ఉన్నామని, ఆరోగ్యంగా ఉన్నామని చెప్పాల్సి వస్తోంది. దీనికి అసలు అంతే లేకుండా పోయింది. ఆమధ్య సీనియర్ కోట శ్రీనివాస రావు (KotaSrinivasaRao) మీద కూడా ఇలానే ఏవేవో తప్పుడు వార్తలు రాస్తే, పాపం అతను ఒక వీడియోలో తాను బాగానే వున్నాను అని, ఆరోగ్యంగా వున్నాను అని చెప్పుకొచ్చారు.
తరువాత ఇంకో సీనియర్ నటుడు శరత్ బాబు (SarathBabu) పరిస్థితి విషమంగా ఉంటే, అతని ఏకంగా చనిపోయారు అని చాలామంది సాంఘీక మాధ్యమంలో రాయటం, దానికి కొంతమంది పరిశ్రమకి చెందిన సెలెబ్రెటీస్ కూడా అయ్యో 'రిప్' అని పెట్టడం కూడా చూసాము. శరత్ బాబు కొన్ని రోజుల కిందట కన్ను మూసిన సంగతి తెలిసిందే. అలాగే ఇంకో సీనియర్ నటుడు చంద్ర మోహన్ (ChandraMohan) మీద కూడా ఇలాగే ఏవో రూమర్స్ స్ప్రెడ్ చేస్తే, అతను కూడా ఒక వీడియో విడుదల చేసాడు, తాను బాగున్నాను అని, సంతోషంగా వున్నాను అని.
ఇలా చాలామంది మీద ఈ సాంఘీక మాధ్యమంలో వాళ్ళ ఆరోగ్యం గురించి వార్తలు రావటం, ఆ నటులు వీడియోలు పెట్టడం పరిపాటి అయింది. అయితే ఇప్పుడు కమెడియన్ నటుడు సుధాకర్ (ActorSudhakar) మీద కూడా ఇలాంటి తప్పుడు వార్తలు గత కొన్ని రోజుల నుండి ప్రసారం అయ్యాయి. అయితే అతను మొదట ఎందుకులే అని ఊరుకున్నాడు కానీ, ఇవి ఇంకా ఎక్కువ అవటంతో అతను కూడా ఈరోజు ఒక వీడియో విడుదల చేసి, తాను చాలా హ్యాపీగా వున్నాను అని చెప్పారు. "నా మీద వచ్చిన వార్తలు అన్నీ ఫేక్. అలాగే తప్పుడు సమాచారం నమ్మకండి, అలాగే ప్రచారం కూడా చేయొద్దు. నేను చాలా హ్యాపీగా వున్నాను" అని చెప్పారు సుధాకర్.
సుధాకర్, హరిప్రసాద్(HariPrasad), నారాయణ రావు, మెగా స్టార్ చిరంజీవి (MegaStarChiranjeevi) కి స్నేహితులు. వీళ్ళందరూ చెన్నైలో ఒకే రూమ్ షేర్ చేసుకున్నారు, అలాగే వీళ్ళందరూ ఒకే దగ్గర నటనలో శిక్షణ పొందారు. సుధాకర్ 600 కి పైగా సినిమాలలో నటించారు.