Baby: దర్శకుడు సుకుమార్ 'బేబీ' సినిమా గురించి మనసులో మాట చెప్పేసారు
ABN, First Publish Date - 2023-07-19T13:13:10+05:30
ప్రముఖ దర్శకుడు సుకుమార్ 'బేబీ' సినిమా గురించి తన అభిప్రాయాలను సాంఘీక మాధ్యమంలో పంచుకున్నారు. అతను ఈమధ్య కాలంలో ఇటువంటి సినిమా, ఇందులోలోని పాత్రల రచన చూడలేదని చెప్పారు.
సాయి రాజేష్ (SaiRajesh) దర్శకత్వం వహించి, ఆనంద్ దేవరకొండ (AnandDeverakonda), వైష్ణవి చైతన్య (VaishnaviChaitanya), విరాజ్ అశ్విన్ (VirajAswin) నటించిన 'బేబీ' #Baby రోజు రోజుకీ ఆదరణ పెరుగుతోంది తప్ప తరగటం లేదు. ప్రేక్షకుల నుండే కాకుండా, పరిశ్రమలోని పలు దర్శకులు, నటీనటులు, నిర్మాతలు ఈ 'బేబీ' సినిమా గురించి మాట్లాడుతూనే వున్నారు. తాజాగా 'పుష్ప 2' #Pushpa2 సినిమా షూటింగ్ తో బిజీ గా వున్న ప్రముఖ దర్శకుడు సుకుమార్ (Sukumar) ఈ 'బేబీ' సినిమా గురించి తన అభిప్రాయాన్ని సాంఘీక మాధ్యమం వేదికగా పంచుకున్నారు.
ఇంతకీ సుకుమార్ ఏమని కామెంట్ చేశారో చూద్దాం. "చాలా కాలం తరువాత ఒక అసాధారణమైన రచన చూసాను, అలాగే ఈ సినిమా ఒక కొత్త ఒరవడిని, పంథాను తీసుకొస్తుంది. ప్రతి సన్నివేశం నాకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లా అనిపించింది. మొదటి సారిగా నేను ఒక సినిమాలో సిట్యుయేషన్ ని కూడా పాత్రల తరహాలో చూసాను ఈ సినిమాలో. సాయి రాజేష్ కి నా అభినందనలు," అంటూ పోస్ట్ చేశారు సుకుమార్. అలాగే ఈ కథని నమ్మి సాయి రాజేష్ కి సపోర్ట్ చేసినందుకు నిర్మాత ఎస్కెఎన్ (SKN) మరియు దర్శకుడు మారుతి (Director Maruthi) లను కూడా అభినందిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.
అలాగే నటీనటుల గురించి మాట్లాడుతూ ఇంతవరకు రాసిన పాత్రల్లో వైష్ణవి పాత్ర ఒక ఐకానిక్ పాత్ర అని చెప్పారు. అటువంటి పాత్రని వైష్ణవి చైతన్య తన నటనతో లీనమై ఆ పాత్రకి జీవం పోసింది అంటూ ఆమెని ఎంతో కొనియాడారు. అలాగే ఆనంద్ దేవరకొండ బ్రిలియంట్ అని, విరాజ్ అశ్విన్ కూడా బాగా చేశారని చెప్పారు సుకుమార్. ఇక విజయ్ బుల్గానిన్ (VijayBulganin) సంగీతం అందమైన దృశ్యంలా ఉంటే, దానికి బాలరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకు మెలోడియస్ ట్యూన్ లా ఉంది అని మొత్తం 'బేబీ' సినిమా నటీనటులకు, సాంకేతిక నిపుణలకు సుకుమార్ అభినందలు తెలిపారు.
అల్లు అర్జున్ (AlluArjun), రష్మిక మందన్న (RashmikaMandanna) నటిస్తున్న 'పుష్ప 2' #Pushpa 2 సినిమా షూటింగ్ లో బిజీగా వున్న సుకుమార్ ఇలా 'బేబీ' గురించి ఇంతలా మాట్లాడటం ఆ చిత్ర యూనిట్ సభ్యులను ఆనందంలో ముంచెత్తినది. ఈమధ్య కాలంలో సుకుమార్ ఏ సినిమా గురించి ఇంతలా మాట్లాడలేదు, కానీ ఈ 'బేబీ' సినిమా గురించే మాట్లాడేరు.