Dasari: చిత్రపురి కాలనీలో దాసరి విగ్రహం.. ఎందుకంటే?
ABN, First Publish Date - 2023-05-04T17:14:38+05:30
దాసరి విగ్రహంతో పాటు శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ (NTR) విగ్రహం, చిత్రపురి కాలనీ రూపశిల్పి డాక్టర్ ఎం ప్రభాకర రెడ్డి (M Prabhakar Reddy)గారి విగ్రహాలు కూడా ఇదే రోజు ఆవిష్కరించాలని అనుకున్నాం కానీ..
దర్శకరత్న దాసరి నారాయణరావు 76వ జయంతి సందర్భంగా హైదరాబాద్ చిత్రపురి కాలనీ (Chitrapuri Colony)లో గురువారం ఆయన విగ్రహాన్ని (Dasari Narayanarao Statue) ఆవిష్కరించారు. చిత్రపురి కాలనీ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, చిత్రపురి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిత్రపురి కాలనీకి దాసరి అందించిన తోడ్పాటుని గుర్తు చేసుకునేలా ఈ విగ్రహాన్ని నిర్మించినట్లుగా చిత్రపురి కాలనీ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహాన్ని ఆయన జయంతి రోజున చిత్రపురి కాలనీలో ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉంది. వాస్తవానికి దాసరి విగ్రహంతో పాటు శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ (NTR) విగ్రహం, చిత్రపురి కాలనీ రూపశిల్పి డాక్టర్ ఎం ప్రభాకర రెడ్డి (M Prabhakar Reddy)గారి విగ్రహాలు కూడా ఇదే రోజు ఆవిష్కరించాలని అనుకున్నాం కానీ.. అవి వారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని పెద్దలు సూచించిన మీదట ఇవాళ దాసరి విగ్రహాన్ని మాత్రమే ఆవిష్కరించాం. గుట్టలు, రాళ్ల మధ్య చిత్రపురి కాలనీ స్థాపించుకున్నప్పుడు సినీ కార్మికులకు ఇండ్లు ఉండాలని కోరుకుని అన్ని రకాలుగా సహాయం చేసిన వ్యక్తి దాసరి. ఆయన సినీ కార్మికులకు ఎప్పుడూ అండగా ఉంటూ ఆదుకునేవారు. ఆయన పలుకుబడితో అప్పటి ప్రభుత్వం తరుపున అనేక రాయితీలు ఈ కాలనీకి ఇప్పించారు. చిత్రపురి కాలనీ ప్రధాన రహదారిలో దాసరి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇక్కడి నుంచి బయటకు వెళ్లేప్పుడు, వచ్చేప్పుడు ఆయన ఆశీర్వాదం ఇచ్చిన భావన కలుగుతుంటుంది. ఇవాళ దాసరిగారు లేకపోవడం చిత్రపరిశ్రమకు తీరని లోటు. ఏ చిన్న సమస్య వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటూ ఒక పెద్దలా పరిశ్రమ కష్టాలు తీర్చారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఆయనను నిత్యం స్మరించుకుంటుందని అన్నారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న తలసాని మాట్లాడుతూ (Talasani Speech at Dasari Statue Inauguration).. సినీ కార్మికుల పక్షపాతిగా ఉంటూ దాసరిగారు 24 విభాగాల కార్మికుల అభిమానం పొందారు. సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉండేవారు. ఆయన తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేసేవారు. దర్శకుడిగా మరెవరికీ సాధ్యం కాని విధంగా 150కి పైగా సినిమాలు తెరకెక్కించి గిన్నీస్ బుక్ రికార్డులు సాధించిన మహనీయుడు దాసరి. ఆయన సినిమాల్లో సమాజానికి ఉపయోగపడే సందేశం ఉండేది. ప్రజాహితం కోసం దాసరి గారు సినిమాలు రూపొందించి ప్రజల్ని ప్రభావితం చేశారు. బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు, ఓసేయ్ రాములమ్మ వంటి సినిమాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రేక్షకాభిమానంతో పాటు అనేక అవార్డులు పొందారాయన. అలాంటి దర్శకుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండటం మన అదృష్టం. రాజకీయ నాయకుడిగా ప్రజాసేవ చేశారు. కేంద్రమంత్రిగా పనిచేసి దేశానికి సేవలందించారు. ఆయన చనిపోయాక చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు లేకుండా పోయింది. నాకు ఆయనతో ఎన్నో ఏండ్ల పాటు మంచి అనుబంధం ఉండేది. ఆయన విగ్రహాన్ని చిత్రపురి కాలనీలో ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాతలు సి. కళ్యాణ్, దామోదర ప్రసాద్, దర్శకుడులు ఎన్ శంకర్, రేలంగి నరసింహారావు, దాసరి తనయుడు అరుణ్ కుమార్, ఫిలించాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి, నిర్మాత ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి:
************************************************
*Nandi Awards: నంది అవార్డుల వివాదంపై మంత్రి తలసాని రియాక్షన్ ఇదే..
*Naga Chaitanya: చైతూ చెప్పింది.. ‘ఏజెంట్’ రిజల్ట్ గురించేనా?
*Vijay Antony: నా ప్రాణాలను నా హీరోయిన్ కాపాడింది
*Dimple Hayathi: గుడి కట్టాలనుకుంటున్న అభిమానికి షాకిచ్చిన హయాతి