Brahmanandam: అక్కడ కామెడీ వర్క్ అవుట్ కాలేదు, సినిమా గ్లామర్ పనికిరాలేదు
ABN, First Publish Date - 2023-05-13T17:07:24+05:30
ఈరోజు విడుదల అయిన కర్ణాటక ఎన్నికల ఫలితాలకు తెలుగు పరిశ్రమకి సంబందించిన నటులకు కొంచెం సంబంధం వుంది. లెజండరీ కామెడీ నటుడు బ్రహ్మానందం అక్క బీజేపీ అభ్యర్ధికి ప్రచారం చేసాడు, నిఖిల్ గౌడ పోటీలో నిలబడ్డాడు, సాయికుమార్ స్నేహితుడు గాలి జనార్దన్ రెడ్డి కుటుంబం కూడా....
ఈరోజు కర్ణాటక అసెంబ్లీ కి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించటమే కాకుండా, ఎటువంటి సహాయం లేకుండా అతి పెద్ద పార్టీగా కూడా అవతరించింది. మెజారిటీకి 113 సీట్స్ గెలవాలీ, కానీ అక్కడ ప్రజలు కాంగ్రెస్ కి బ్రహ్మరధం పట్టి 130కి పైగా సీట్స్ గెలిచేట్టు చేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి అద్భుత విజయం.
అయితే ఈ ఎన్నికల్లో కొంచెం సినిమా గ్లామర్ కూడా ఉంది. తెలుగు నటుడు బ్రహ్మానందం (Brahmanandam) బీజేపీ అభ్యర్థి మంత్రి డాక్టర్ సుధాకర్ (BJP candidate Dr Sudhakar) కి ఓటు వెయ్యాలని ప్రజలకి విజ్ఞపి చేస్తూ కొన్ని రోజులు అక్కడ పర్యటించి ప్రచారం చేశారు. కానీ బ్రహ్మానందం మాట ఎవరూ వినలేదు, సరికదా సినిమావాళ్ళ మాటలు మరోలా తీసుకున్నట్టు వున్నారు అక్కడ ప్రజలు, అందుకని సుధాకర్ ని ఓడించారు. చిక్క బళ్లారిపుర (Chikka Ballaripura) నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రదీప్ ఈశ్వర్ (Congress candidate Pradeep Eswar won) , సుధాకర్ మీద 11,130 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
మంత్రి సుధాకర్ తో బ్రహ్మానందం కి మొదటి నుండీ పరిచయం ఉండటం వలన అతనికి ప్రచారం చేసినట్టు చెప్పారు. అదీ కాకుండా, డాక్టరుగా, మంత్రిగా అతను చేసిన సేవలు తెలిసి అతనికి ప్రచారం చెయ్యాలని నిర్ణయించుకున్నానని కూడా అప్పుడు తెలిపారు. అలాగే కన్నడ నటుడు దర్శన్ (Darshan) కూడా అక్కడ పర్యటించారు. అయినా ఓటమి పాలయ్యారు.
అలాగే మాజీ ప్రధాని దేవె గౌడ (Deve Gowda) మనవడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి (HD Kumaraswamy) కొడుకు, నిఖిల్ గౌడ (Nikhil Gowda) కూడా ఈసారి ఎన్నికల్లో నిలబడ్డాడు. నిఖిల్ తెలుగు వాళ్ళకి కూడా పరిచయం ఉన్నవాడే, ఎందుకంటే అతని 'జాగ్వార్' (Jaguar) సినిమా తెలుగులో కూడా విడుదల అయింది. ఇతను రామనగర (Ramnagara) నియోజకవర్గం నుండి పోటీ చేసాడు. కుమారస్వామి ఈసారి కింగ్ మేకర్ గా ఉండొచ్చు అని అనుకున్నాడు, ఎందుకంటే చాలామంది కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ (Hung Assembly) వస్తుందేమో అనుకున్నారు, అప్పుడు జనతా దళ్ (ఎస్) కి (JD(S) చెందిన కుమారస్వామి పార్టీ 50 సీట్స్ గెలుచుకుంటుందని, అతను ఎవరు ముఖ్యమంత్రో డిసైడ్ చెయ్యొచ్చు అని అనుకున్నారు. కానీ పాపం కుమారస్వామి ఆశలు తలకిందులయ్యాయి, అతని పార్టీ కేవలం 20 సీట్స్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. #KarantakaElections2023
అదీ కాకుండా, కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ కూడా ఓడిపోయాడు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బల్ సుమారు 10 వేలకు పైగా ఓట్లు సాధించి విజయం సాధించారు. విశేషం ఏంటంటే అంతకు ముందు నిఖిల్ తండ్రి కుమారస్వామి ఇక్కడ గెలిచారు. అలాగే ఈ సీటు నుండి ముందుగా కుమారస్వామి భార్య పోటీ చెయ్యాలని అనుకున్నారు, కానీ చివరి నిముషం లో కొడుకు ని దించారు. పాపం నిఖిల్ ఓడిపోయాడు. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా అంటే 2019 లో మాండ్య లోక్ సభ స్థానానికి సుమలత(Sumalatha) తో పోటీపడి ఓడిపోయాడు. కర్ణాటక ప్రజలు సినిమా గ్లామర్ ని, సినిమా నటుల్ని ఈ ఎన్నికల్లో ఎక్కువగా పట్టించుకున్నట్టు కనపడలేదు.
సీనియర్ నటుడు సాయి కుమార్ (SaiKumar) కి, గాలి జనార్దన్ రెడ్డి (GaliJanardhanReddy) కి మంచి సత్సంబంధాలు వున్నాయి. గాలి జనార్దన్ రెడ్డితో సహా, అతని కుటుంబ సభ్యులు అతని భార్య, గాలి ఇద్దరి తమ్ముళ్లు ఈసారి పోటీలో నిలబడ్డారు. ఒక్క గాలి జనార్దన్ రెడ్డి తప్పితే ఇంకెవరూ గెలవలేదు. గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు ఇప్పుడు ఒక తెలుగు, కన్నడ సినిమాతో ఆరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే.