Biggboss 7 : తెలుగు ప్రేక్షకుల ఆదరణ - రేటింగ్ ఎలా ఉందంటే..!
ABN, First Publish Date - 2023-09-15T12:07:28+05:30
బిగ్‌బాస్‌కు పూర్వ వైభవం వచ్చింది. ‘ఉల్టా పుల్టా’ సీజన్ బాగానే కలిసిసొచ్చినట్లుంది. గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్ మరింత వేగంగా దూసుకుపోతుందనీ, ప్రేక్షకుల ఆదరణ రెట్టింపు అయిందని నిర్వాహకులు చెబుతున్నారు.
బిగ్‌బాస్‌కు (Biggboss 7) పూర్వ వైభవం వచ్చింది. ‘ఉల్టా- పుల్టా’ (ulta pulta) సీజన్ బాగానే కలిసిసొచ్చినట్లుంది. గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్ మరింత వేగంగా దూసుకుపోతుందనీ, ప్రేక్షకుల ఆదరణ రెట్టింపు అయిందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ‘బిగ్ బాస్ సీజన్ 7’ ఎన్నో సంచలనాలకు వేదికైందని రేటింగ్స్ పరంగా, వ్యూయర్‌షిప్ పరంగా ఊహించని అద్భుతాలకు దారి తీసిందని నిర్వాహకులు ప్రకటనలో పేర్కొన్నారు. సీజన్ సీజన్‌కి అపూర్వంగా పెరుగుతున్న ఆదరణ ఈ సీజన్‌కి వచ్చేసరికి ఎన్నో రెట్లు పెరిగి తెలుగు టెలివిజన్ చరిత్రలోనే సరికొత్త ప్రమాణాలను సృష్టించిందని ‘స్టార్ మా’ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు ఇప్పుడు ఈ షో చూస్తున్నారనీ, ఇంచుమించు 5.1 కోట్ల మంది ప్రేక్షకులు మొదటి వారం ‘బిగ్ బాస్’ షో చూశారని గణాంకాలు చెబుతున్నాయి.
‘బిగ్ బాస్ సీజన్ 7’ ఆవిష్కరణ కార్యక్రమాన్ని సుమారు 3 కోట్ల మంది ప్రేక్షకులు చూడడంతో గతంలో క్రికెట్ మ్యాచ్‌ల వీక్షణ పరంగా నమోదైన రికార్డులను కూడా తెలుగులో ప్రసారం అవుతున్న ‘బిగ్ బాస్ సీజన్ 7’ అధిగమించటం విశేషం అని తెలిపారు. గత సీజన్‌లో సాధించిన రేటింగ్ తో పోలిస్తే 40 శాతం అధిక రేటింగ్ తీసుకొచ్చిందని పేర్కొన్నారు. తిరుగులేని ఈ ప్రేక్షక ఆదరణతో ఇప్పటికే నెంబర్ వన్ స్థానంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న స్టార్ మా... నెంబర్ 1 ఛానల్‌గా తనస్థ్థానాన్ని మరోమారు నిలబెట్టుకుందని ‘బిగ్ బాస్ సీజన్ 7’ సాక్షిగా వెల్లడించింది. ఈ సీజన్ ఉల్టా పల్టాగా ఉండబోతోంది అని కింగ్ నాగార్జున ప్రోమోలో చెప్పిన నాటి నుంచి విపరీతమైన అంచనాలు పెరిగాయి. ‘బిగ్ బాస్ సీజన్ 7’ వీకెండ్ ఎపిసోడ్‌ను సరాసరిన 7.1 రేటింగ్‌తో చూస్తే , మెట్రో నగరమైన హైదరాబాద్ లో అత్యధికంగా 8.7 రేటింగ్ తో వీక్షించడం విశేషం.