Adipurush - Anurag thakur: మత విశ్వాసాలను దెబ్బతియ్యడాన్ని అనుమతించం!
ABN, First Publish Date - 2023-06-19T17:31:40+05:30
‘ఆదిపురుష్’ సినిమాలోని సంభాషణలపై వస్తున్న విమర్శలు, వివాదాలపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ప్రజల మత విశ్వాసాలను దెబ్బతియ్యడాన్ని అనుమతించమని ఆయన అన్నారు. సినిమాలోని ఇబ్బందికర సంభాషణలను మార్చనున్నట్లు చిత్ర బృందం ప్రకటించిందని, దానిని తానూ పర్యవేక్షిస్తానని వెల్లడించారు.
‘ఆదిపురుష్’ (Adipurush) సినిమాలోని సంభాషణలపై వస్తున్న విమర్శలు, వివాదాలపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ (anurag thakur) స్పందించారు. ప్రజల మత విశ్వాసాలను దెబ్బతియ్యడాన్ని అనుమతించమని ఆయన అన్నారు. సినిమాలోని ఇబ్బందికర సంభాషణలను మార్చనున్నట్లు చిత్ర బృందం ప్రకటించిందని, దానిని తానూ పర్యవేక్షిస్తానని వెల్లడించారు. ఢిల్లీ ఎంపీ బీజేపీ నేత మనోజ్ తివారీ (Bjp Mp Manoj tiwari) కూడా ఈ విషయంపై స్పందించారు. చిత్ర బృందం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ‘‘అయితే నేనీ సినిమా చూడలేదు. కాకపోతే, ఇందులోని సంభాషణలు ప్రేక్షకులను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయని విన్నాను. వాటిని మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నామని రచయిత మనోజ్ ఇప్పటికే ప్రకటించారు. ‘ఆదిపురుష్’ టీమ్ నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నా. అలాగే సినిమాలో చాలా సన్నివేశాలు గౌరవప్రదంగా లేవని ప్రేక్షకులు అంటున్నారు. రాముడు సర్వోన్నతుడు, కాబట్టి సినిమా పరిశ్రమలో పనిచేసే వ్యక్తులు భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి’’ అని అన్నారు.
అతని కళ్లలో నీతి, నిజాయతీ కనిపిస్తుంటాయి: ఓంరౌత్ (om Raut)
మరోవైపు దర్శకుడు ఓం రౌత్ కూడా ఈ చిత్రం గురించి స్పందించారు. రాముడిగా ప్రభాస్‌ని (Prabhas) తీసుకోవడానికి గల కారణాన్ని వెల్లడించారు. ఆ పాత్ర కోసం ప్రభాస్‌ను ఒప్పించడానికి చాలా కష్టపడినట్లు చెప్పారు. ఈ సినిమా అనుకున్నప్పటి నుంచీ రాముడిగా ప్రభాస్‌నే ఊహించుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఓంరౌత్ మాట్లాడుతూ ‘‘ఆదిపురుష్’ ఈతరం కోసం తీసిన సినిమా. రామాయణం మొత్తాన్ని తెరపై చూపించడం అసాధ్యం. అందుకే అందులోని యుద్థకాండను మాత్రమే నా సినిమాకు కథగా తీసుకున్నా. వ్యక్తిగతంగానూ ఈ భాగం నాకు చాలా ఇష్టం. ఇందులో రాముడు పాత్రకు కచ్చితంగా సరిపోతాడనిపించింది. మన హృదయంలో ఒక భావం ఉంటే అది కళ్లలో కనిపిస్తాయని నా అభిప్రాయం. ప్రభాస్ కళ్లలో నీతి, నిజాయతీ కనిపిస్తుంటాయి. పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌డమ్ సంపాదించినా చాలా వినయంగా ఉంటాడు. అందుకే సినిమా చేయాలని అనుకున్న రోజే రాముడిగా ప్రభాస్ ఒక్కరే సరైన ఎంపిక అనుకున్నా. ఈ విషయం ఆయనకు చెప్పగానే ఆశ్చర్యపోయాడు. అతన్ని ఈ పాత్రకు ఒప్పించడం అంత ఈజీగా జరగలేదు. ఫోన్‌లో పాత్రకు సంబంధించిన వివరాలు చెప్పడానికి చాలా కష్టపడ్డాను. అతన్ని కలిసి స్టోరీ గురించి చెప్పగానే ప్రభాస్ అంగీకరించాడు. అంతే శ్రద్థగా చేశాడు. అన్ని రకాలుగా నాకు సహకరించాడు. భవిష్యత్తులోనూ మా స్నేహం ఇలాగే కొనసాగుతుందని నమ్ముతున్నా’’ అని ఓం రౌత్ చెప్పారు. ప్రభాస్ రాముడిగా, జానకిగా కృతీసనన్ నటించిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకులు ముందుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.340 కోట్లు గ్రాస్ వసూళ్లు రాబట్టింది.