Anand Deverakonda: నాకు అమ్మాయిలతో మాట్లాడేందుకు రెండేళ్లు పట్టింది
ABN, First Publish Date - 2023-07-12T15:25:30+05:30
ఆనంద్ దేవేరుకొండ పేరు ఇప్పుడు బాగా వినిపిస్తోంది. 'బేబీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు, ఆ ప్రచారంలో భాగంగా మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు చెప్పారు. సినిమా గురించి, అమ్మాయిల గురించి, అన్న గురించి ఇంకా చాలా విషయాలు చెప్పాడు. చూడండి.
విజయ్ దేవరకొండ (VijayDeverakonda) తమ్ముడు ఆనంద్ దేవరకొండ (AnandDeverakonda) తన సినిమా 'బేబీ' #Baby తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'దొరసాని' సినిమాతో ఆరంగేట్రం చేసి మంచి నటుడు అని ప్రూవ్ చేసుకున్నాడు మొదటి సినిమాతోటె. తరువాత సినిమా 'మిడిల్ క్లాస్ మెలోడీస్' #MiddleclassMelodies ఓటిటి లో విడుదలై మంచి పేరు తెచ్చిపెట్టింది. తరువాత రెండు సినిమాలు చేసాడు కానీ అవి అంతగా ఆడలేదు. ఇప్పుడు 'బేబీ' #Baby అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో వైష్ణవి చైతన్య (VaishnaviChaitanya) కథానాయికగా నటిస్తోంది, కాగా విరాజ్ అశ్విన్ (VirajAshwin) కూడా ఇంకో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. సాయి రాజేష్ (SaiRajesh) దర్శకుడు. ఈ మూవీ జూలై 14న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఆనంద్ దేవరకొండ మీడియాతో ముచ్చటించాడు
ఇందులో తన పాత్ర, సినిమా గురించి
ఇప్పటి వరకు పక్కింటి అబ్బాయిలా కనిపించే సినిమాలు చేశాను. కానీ మొదటి సారి ఓ వైడ్ రేంజ్ ఆడియెన్స్‌ను పలకరించే సినిమా చేస్తున్నాను. ఈ సినిమా ప్రీమియర్ షోలు వేసాము, అన్నీ హౌస్ ఫుల్ అవుతున్నాయి. 'బేబీ' అనేది ఇంతవరకు నా బెస్ట్ జర్నీ అని మాత్రం చెప్పగలను. నేను ఈ సినిమాలో ఇటువంటి పాత్రను పోషించగలను అని నాలో నమ్మకాన్ని దర్శకుడు సాయి రాజేష్ అన్నే నింపాడు. నా కెరీర్లో 'బేబీ' ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ సినిమాలో అన్ని భావోద్వేగాలు వుంటాయని చెప్పాడు ఆనంద్. ప్రేమలో సంతోషం, బాధ అన్నీ ఉంటాయి. ఆ ఎమోషన్స్‌ను బాగా చూపించాం. వాటికి ఆడియెన్స్ కూడా కనెక్ట్ అవుతారు. ట్రైలర్లో చూపించిన ఎమోషన్ కంటే సినిమాలో మరో యాభై శాతం ఎక్కువే ఉంటుంది. థియేటర్లో అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు మా 'బేబీ' సినిమా చూసి.
మొదటి ప్రేమ గురించి
తొలిప్రేమ ఎప్పటికీ ఓ అందమైన అనుభూతి లాంటిది. తొలి ప్రేమ అనేది పైపైన అందాన్ని చూసి పుడుతుంది, కానీ నెమ్మదిగా ప్రేమ అంటే అర్థాన్ని తెలుసుకుంటారు. దాన్నే మా 'బేబీ' సినిమాలో చక్కగా చూపించాం. నేను బాయ్స్ బోర్డింగ్ స్కూల్లోనే చదివాను. బయటకు వచ్చాక అమ్మాయిలతో మాట్లాడేందుకు నాకు రెండేళ్లు పట్టింది. ఎందుకంటే ఆలా మాట్లాడటం అంత ఈజీ కాదు. తొలి ప్రేమ అనేది ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. సక్సెస్ అయినా, ఫెయిల్ అయినా కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
ప్రేమ అనంతమైంది. ప్రేమ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలో ప్రేమను సాయి రాజేష్ అన్న తన కోణంలోంచి చూపించారు. ఆయన రైటింగ్ కొత్తగా ఉంటుంది. ఆయన కోణంలోంచి ప్రేమను చూపించిన, చెప్పిన విధానం చాలా కొత్తగా ఉంటుంది. హీరోహీరోయిన్లు ప్రేమలో ఉన్నా, విడిపోతోన్నారని అన్నా ప్రేక్షకులు ఫీల్ అవ్వాలంటే దానికి మ్యూజిక్ ముఖ్యం. విజయ్ బుల్గానిన్ అద్భుతమైన సంగీతం, ఆర్ఆర్ అందించారు.
'బేబీ' కి వేరే సినిమాలకి సంబంధం లేదు
'ప్రేమదేశం' సినిమాకు 'బేబీ' సినిమాకు ఎలాంటి సంబంధం ఉండదు. చాలా కొత్తగా ఉంటుంది. ఫీల్ వైజ్ చూస్తే మాత్రం 'ప్రేమిస్తే', '7/జీ బృంధావన కాలనీ' స్టైల్లో ఉంటుంది. ఈ సినిమాలోకి ముందుగా నేను వచ్చాను. ఆ తరువాత వైష్ణవి, విరాజ్‌లు వచ్చారు. 'అర్జున్ రెడ్డి' #ArjunReddy అనేది అందరూ రిఫర్ చేసే పాప్ కల్చర్‌లా మారింది. ఆ సినిమాలో 'బేబీ' అనే డైలాగ్ చాలా ఫేమస్ అయింది. అయితే మేం దాన్ని చూసి మా సినిమాకి 'బేబీ' అని పేరు పెట్టలేదు. 'బేబీ' అనే టైటిల్ ఎందుకు పెట్టామనేది ఓ సన్నివేశంలో వివరిస్తాం. అందరికీ ఈజీగా, క్యాచీగా ఉంటుందని 'బేబీ' అని పెట్టాం.
ఎదుర్కొన్న సవాళ్లు
నేను గడ్డం పెంచుకున్నట్టుగా కనిపించినా, అమ్మాయి అందంగా మారినట్టు కనిపించినా వాటికంటూ ఓ సందర్భం ఉంటుంది. ఆ అమ్మాయిలో ఉండే కోరికలను రిఫ్లెక్ట్ చేసేలానే ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూపించాం. ట్రైలర్లో అసలు స్టోరీని చూపించలేదు. మూడు పాత్రలను పరిచయం చేశామంతే. అసలు కథ సినిమా చూస్తే తెలుస్తుంది. కథ చెప్పినప్పుడే కొన్ని సవాళ్లుంటాయని సాయి రాజేష్ అన్న చెప్పారు. నెరేషన్ ఇచ్చి, ట్రాక్స్ పంపించి.. కథ గురించి బాగా ఫీడింగ్ చేశారు. ప్రతీ సీన్, ప్రతీ ఎక్స్ప్రెషన్స్ గురించి వివరించి చెబుతుంటారు. బాల్ రెడ్డి, విజయ్ బుల్గానిన్ నుంచి కూడా అందుకే బెస్ట్ వర్క్ వచ్చింది. స్కూల్ పిల్లాడిలా కనిపించేందుకు కష్టపడలేదు. కానీ డబ్బింగ్ చెప్పే టైంలోనే కష్టపడాల్సి వచ్చింది. పిల్లాడిలా అనిపించేందుకు వాయిస్ తగ్గించి మాట్లాడాల్సి వచ్చింది. గొంతులో ఆ అమాయకత్వాన్ని తీసుకురావాల్సి వచ్చింది.
వైష్ణవీ చైతన్య గురించి
వైష్ణవీ చైతన్య అద్భుతంగా నటించింది. తెలుగులో మంచి నటిగా ఎదుగుతుంది. సీన్లు ఎలా చేయాలో మేం ఇద్దరం చర్చించుకునేవాళ్లం. ఆమెతో నటించడాన్ని చాలా మిస్ అవుతున్నాను. ఆమెతో నటించడం ఎంతో ఎంజాయ్ చేశాను. ఇంత చిన్న వయసులో, ఇంత మంచి పాత్రను, ఇంత బాగా నటించడం అంటే మామూలు విషయం కాదు.
అన్న విజయ్ కి తనకి కంపేరిజన్
ఈ జానర్లో సినిమా చేస్తున్నా. ఆ దర్శకుడితో చేస్తున్నాను అని మాత్రమే అన్నకి చెబుతాను. కొన్ని సార్లు సినాప్సిస్ పంపిస్తాను. కానీ ఫైనల్ కాల్ మాత్రం నాదే. అది చేయమని, ఇది వద్దు అని అన్న, నాన్న ఎప్పుడూ చెప్పరు. విజయ్ దారి వేరు. నా దారి వేరు. మా ఇద్దరినీ పోల్చి చూడకూడదు. నాకు ఇంత వరకు థియేట్రికల్ హిట్ లేదు. మా సినిమా బజ్ చూసి, ట్రైలర్ రియాక్షన్ చూసి, పాటలకు వచ్చి చూసిన రెస్పాన్స్‌తో ప్రీమియర్స్ పెట్టాం. 'మిడిల్ క్లాస్ మెలోడీస్' కంటే ముందే ఈ కథను విన్నాను. విజయ్‌కి నేను ట్రైలర్ పంపలేదు. ఆయన చూసి ఫీల్ అయి ఆ ట్వీట్ పెట్టాడు. నాకు హిట్ రాబోతోందని గర్వంగా ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇది నాకు ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ అన్నట్టుగా అనిపిస్తుందని విజయ్ అన్నాడు. మంచి సినిమా చేస్తున్నావ్.. బాగా నటిస్తున్నావ్ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు.