Tollywood Box Office: చవితి పండగ సినిమాలు అన్నీ బోల్తా, ఇక వాటిమీదే ఆశలు...
ABN, First Publish Date - 2023-09-18T12:12:49+05:30
గత వారం విశాల్, ఎస్ జె సూర్య నటించిన 'మార్క్ ఆంటోనీ' విడుదలైంది, అలాగే ఇంకో రెండు చిన్న సినిమాలు 'ఛాంగురే బంగారు రాజా', 'రామన్న యూత్' విడుదలయ్యాయి. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాలు ఎలా నడుస్తున్నాయి అంటే...
గత వారం అంటే సెప్టెంబర్ 15న ఒక డబ్బింగ్ సినిమా, ఇంకో రెండు చిన్న సినిమాలు విడుదలయ్యాయి. విశాల్ (Vishal), ఎస్ జె సూర్య (SJSuryah) నటించిన 'మార్క్ ఆంటోనీ' #MarkAntony విడుదలైంది. ఇది తమిళ సినిమా, తెలుగులోకి డబ్బింగ్ చేశారు. దీనిలో రీతువర్మ (RituVarma) కథానాయిక, ఆధిక్ రవిచంద్రన్ (AdhikRavichandran) దర్శకుడు. ఇందులో సెల్వ రాఘవన్ (SelvaRaghavan) కూడా ఒక ముఖ్య పాత్ర పోషించాడు. ఈ సినిమా తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ సినిమాకి నేపధ్య సంగీతం అందించిన జీవీ ప్రకాష్ కుమార్ (GVPrakashKumar) చాలా లౌడ్ గా ఇవ్వటం, అదీ కాకుండా ఇది ఒక టైం ట్రావెల్, అంటే కాలంలో వెనక్కి వెళ్లడం అనే నేపథ్యంలో వచ్చిన సినిమా.
సినిమా అంత చాలా గోల గోలగా ఉండటం, చాలా సన్నివేశాల్లో ఓవర్ యాక్షన్, అలాగే అరుపులు కేకలు ఎక్కువవడం, రెండో సగం అంతా చాలా గందరగోళంగా తీయడం ఇవన్నీ కలిపి తెలుగు ప్రేక్షకులని మెప్పించలేకపోయాయి. అందుకే ఈ సినిమా తెలుగులో ఫ్లాపు అయింది, కలెక్షన్స్ ఏమీ లేవు అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.
ఇక ఇంకో రెండు చిన్న సినిమాలు కూడా విడుదలయ్యాయి. నటుడు రవితేజ (RaviTeja) నిర్మాతగా 'ఛాంగురే బంగారు రాజా' #ChangureBangaruRaja అనే సినిమా కూడా విడుదలయింది. అయితే దీనికి సరిగా ప్రచారాలు లేకపోవటం, అనుకున్న తేదీకి కాకుండా ఈ సినిమాని ముందుకు తెచ్చి గత వారం విడుదల చెయ్యడం, ఇందులో దర్శకుడు కథ సరిగ్గా నేరేట్ చెయ్యలేకపోవటం వలన ఈ సినిమాని కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఇందులో బాగా పాపులర్ నటులు ఎవరూ లేకపోవటం కూడా ఈ సినిమా అంతగా తెలియలేదు. ఇక మూడో సినిమా 'రామన్న యూత్' #RamannaYouth, తెలంగాణా నేపథ్యంలో తీసిన సినిమా. ఇది కూడా నేరేషన్ చాలా బోర్ గా ఉండటం, అలాగే ఇందులో చాలామంది కొత్తవాళ్లు నటించటం, సరైన కథలేకపోవటం వలన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది.
ముందుగా అనుకున్న ప్రకారం అయితే, రామ్ పోతినేని (RamPothineni), బోయపాటి శ్రీను (BoyapatiSreenu) కాంబినేషన్ లో వచ్చిన 'స్కంద' #Skanda గత వారం విడుదలవాల్సి వుంది, కానీ ఇప్పుడు ఈనెల 28న విడుదలవుతోంది. అలాగే శ్రీకాంత్ అడ్డాల (SrikanthAddala) దర్శకత్వం వహించిన 'పెదకాపు' కూడా ఈనెల 29న విడుదలవుతోంది. ఈ రెండిటిమీదే ఇప్పుడు అందరి దృష్టి వుంది.