Prema: గుర్తుపట్టలేని స్థితిలో తోటి నటి మృతదేహం... ఇదేనా ఆర్టిస్ట్ జీవితం!
ABN, First Publish Date - 2023-04-14T13:50:26+05:30
కథానాయిక ప్రేమ పేరు చెప్పగానే గుర్తొచ్చే చిత్రం ‘దేవి’. ఆమె కన్నడ నటి అయినా తెలుగులో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
కథానాయిక ప్రేమ (Prema) పేరు చెప్పగానే గుర్తొచ్చే చిత్రం ‘దేవి’(Devi movie) ఆమె కన్నడ నటి అయినా తెలుగులో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1995 నుంచి 2005 వరకూ తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన ప్రేమ పెళ్లి తర్వాత సినిమాలకు దూరమయ్యారు. 2017లో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అదంత ఆశాజనకంగా లేకపోవడంతో మళ్లీ కనుమరుగయ్యారు. తాజాగా ఆమె ఓ యూట్యూబ్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె సహనటి, స్నేహితురాలు సౌందర్యను గుర్తు చేసుకున్నారు. దివంగత నటి సౌందర్య మరణాన్ని తలుచుకొని భావోద్వేగానికి లోనయ్యారు. (Prema Emotional about Soundarya death)
‘’సౌందర్య (Soundarya) చనిపోయిన రోజు.. జీవితం అంటే ఇంతేనా అనిపించింది. తన చివరి చూపు కోసం వాళ్ల ఇంటికి వెళ్లాను. సౌందర్య, ఆమె సోదరుడు మృతదేహాలను ఓ బాక్స్‌లో పెట్టి ఉంచారు. గుర్తించలేని విధంగా తన బాడీ ఉంది. చూడటానికి ఫేస్ కూడా లేదు. సౌందర్య చేతికి పెట్టుకున్న వాచ్‌ను బట్టి అది సౌందర్య డెడ్‌బాడీ అని గుర్తించారు. అందంగా కనిపించడానికి సౌందర్య ఎంతో ఇష్టపడేవారు. షూటింగ్ గ్యాప్‌లో కూడా ఎప్పటికప్పుడు టచప్ చేసుకుంటూ పర్ఫెక్ట్‌గా ఉండాలి అనుకునేవారు. అలాంటిది చివరి రోజుల్లో ఆమె ముఖం కూడా లేదు. ఇంతేనా ఆర్టిస్ట్ జీవితం అనిపించింది. అవన్నీ తలుచుకుంటే బాధ కలుగుతుంది. మనం పోయేటప్పుడు తీసుకెళ్లేది ఏమీ లేదు. కర్మ, గౌరవం తప్ప’’ అని ప్రేమ అన్నారు.
ఇక సినిమాల గురించి చెబుతూ ‘‘దర్శకుడు కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) గారితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వంలో నేను నటించిన ‘దేవి’తో (Devi) నాకు తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. నేను మాట్లాడుతున్నా అంటే ఆయనే కారణం. కోడి రామకృష్ణ ‘అరుంధతి’ సినిమా అనుకున్నప్పుడు ‘జేజమ్మ’ పాత్ర కోసం నన్నే అడిగారు. వరుసగా ఎక్కువ డేట్స్ అడిగారు. అదే సమయంలో నేను కన్నడలో పలు సినిమాలతో బిజీగా ఉన్నా. దాని వల్ల డేట్స్ సర్దుబాటు చేయడం కుదర్లేదు. ఆ సినిమా విడుదలయ్యాక చూశా. నాకెంతో నచ్చింది. అయితే ఆ పాత్ర మిస్ అయినందుకు బాధపడలేదు. ఆ పాత్ర అనుష్క పేరున రాసుంది. అందుకే తను ఆ పాత్రలో నటించి మెప్పించింది. అసలు నేను సినిమాల్లోకి రావాలనుకోలేదు. ఎయిర్ హోస్టెస్ కావాలనుకున్నా. నన్ను నటిగా చూడాలని అమ్మ కోరిక. ఆమె కోరికను ఎందుకు తీర్చకూడదనిపించి మొదటిసారి కన్నడలో ‘సవ్యసాచి’ లో నటించాను. మొదటి సినిమా పరాజయం పాలైంది. అయినా ‘ఓం’ (om)అనే సినిమాలో అవకాశం వచ్చింది. అది సూపర్‌హిట్. అక్కడి నుంచి అవకాశాలు వరుస కట్టాయి. అయితే ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘క్షణ క్షణం’ లాంటి సినిమాలు చేయలేకపోయాననే బాధ ఉంది. తెరపై కనిపించడం కోసం ఏ పాత్ర పడితే అది చేయను. నటనకు ఆస్కారం, వైవిధ్యమున్న పాత్రలే చేస్తా’’ అని అన్నారు.