A. R. Rahman: అర్హత లేని చిత్రాలను ‘ఆస్కార్’కు పంపుతున్నారు!
ABN, First Publish Date - 2023-03-18T10:12:57+05:30
ఆస్కార్ అవార్డులపై ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆస్కార్ (Oscar95)అవార్డులపై ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ (A. R. Rahman) సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని భారతీయ చిత్రాలు ‘ఆస్కార్’ గడప వరకూ వెళ్లి విజయం దక్కించుకోలేక వెనుదిరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అర్హత లేని చిత్రాలను ఎంపిక చేసి మరీ నామినేషన్స్‌కు పంపిస్తున్నారని విమర్శించారు. ఆ విషయంలో బాధగా ఉన్నా ఏం చేయలేని పరిస్థితి అని చెప్పారు. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా సంగీత దిగ్గజం ఎల్. సుబ్రహ్మణంతో నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పారు. సంగీత ప్రపంచంలో వచ్చిన మార్పుల గురించి చర్చిస్తూ, మధ్యలో ఆస్కార్ ప్రస్తావన రాగా రెహమాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. (A. R. Rahman comments on Oscar awards)
ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ చర్చలో ఆయన ఫలానా సినిమా అని పేరు చెప్పలేదు. నెటిజన్లు మాత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ను ఉద్దేశించే ఆయన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఇంటర్‌నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో మనదేశం నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR)అధికారికంగా ఎంపిక కాకపోవడం పట్ల రెహమాన్ ఆ కామెంట్స్ చేశారంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి కొందరైతే ‘ప్రతి ఏటా ఇండియాలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వస్తునప్పటికీ ‘ఆస్కార్’ బరిలోకి వెళ్లకపోవడం బాధాకరం’ అని అభిప్రాయపడుతున్నారు. 95వ ఆస్కార్ వేడుకల్లో ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు దక్కించుకున్న సంగతి తెలిసిందే! బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ విజేతగా నిలిచింది.