కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Naga Chaitanya: 'తండేల్' సినిమా కోసం శ్రీకాకుళం యాస ప్రాక్టీస్ చేస్తున్నాను

ABN, First Publish Date - 2023-11-23T11:51:59+05:30

అక్కినేని నాగచైతన్య కొత్త త‌ర‌హా క‌థ‌ల‌కు పెద్ద పీట వేస్తూ వుంటారు, అలంటి ప్రయత్నంలో భాగంగా వెబ్ సిరీస్ ప్రపంచంలోకి కూడా అడుగు పెట్టారు. ఆయ‌న ప్రధాన పాత్ర పోషించిన 'దూత` డిసెంబర్1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదిక‌గా స్ట్రీమింగ్ కానుంది. మ‌రోవైపు చందూ మొండేటి ద‌ర్శక‌త్వంలో రూపొందనున్న సినిమా 'తండేల్' అనే టైటిల్ ఖరారు చేశారు. నవంబర్23 నాగ‌చైత‌న్య పుట్టిన రోజు జ‌రుపుకొంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న బ‌ర్త్ డే స్పెష‌ల్స్, భ‌విష్యత్ ప్రాజెక్టులేమిటి, విలేకరులతో పంచుకొన్నారు.

Happy Birthday to Naga Chaitanya

హ్యాపీ బ‌ర్త్ డే చైతూ గారూ..

థాంక్సండీ..

ఈ బ‌ర్త్ డే స్పెష‌ల్స్ ఏమిటి?

ఈ బ‌ర్త్ డే నాకు స‌మ్‌థింగ్ స్పెష‌ల్‌. ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేద్దామ‌నుకొంటున్నా. ఫ్యాన్స్‌కి కూడా స‌ర్ప్రైజ్‌లు ఉన్నాయి. నేను చేసిన తొలి వెబ్ సిరీస్ దూత ట్రైల‌ర్ విడుద‌ల అవుతోంది. చందూ మొండేటి ద‌ర్శక‌త్వంలో రూపుదిద్దుకొంటున్న సినిమా టైటిల్ 'తండేల్' ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. (Happy Birthday Naga Chaitanya)

తొలిసారి ఓ వెబ్ సిరీస్‌లో న‌టించారు. ఆ అనుభ‌వం ఎలా వుంది?

చాలా బాగుందండీ. ఈమ‌ధ్య వెబ్ సిరీస్‌లు విప‌రీత‌మైన క్రేజ్ తీసుకొస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వ‌స్తోంది. అందుకే నేను కూడా చాలా రోజుల నుంచి ఓ మంచి వెబ్ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నా. విక్రమ్ కుమార్ (Vikram K Kumar) చేసిన '24' లాంటి కాన్సెప్ట్స్ నాకు చాలా ఇష్టం. అలాంటి కథ వస్తే చేద్దామనుకున్నాను. అలాంట‌ప్పుడు విక్రమ్ కె కుమార్ 'దూత' లాంటి యూనిక్ కాన్సెప్ట్ తో వ‌చ్చారు. అయితే ఇది వెబ్ సిరీస్ కోసం అని చెప్పలేదు. కాన్సెప్ట్ చాలా న‌చ్చింది. వెబ్ సిరీస్ అయితే బాగుంటుంద‌నిపించింది. ఎందుకంటే వెబ్ సిరీస్ లో ఎక్కువ స్పేస్ ఉంటుంది. చాలా విష‌యాలు డిటైల్డ్ గా చెప్పొచ్చు. సినిమా అయితే రెండన్నర గంట‌ల్లో మొత్తం క‌థ చెప్పేయాలి. అందుకే వెబ్ సిరీస్ లో అయితేనే ఈ క‌థ‌కు న్యాయం జ‌రుగుతుంద‌నిపించింది. 'దూత' #Dhootha డిసెంబర్ 1నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో #AmazonPrimeVideo స్ట్రీమ్ అవుతుంది. ఖచ్చితంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

వెబ్ సిరిస్ చేయడం న‌టుడిగా కొత్తగా అనిపించిందా?

లేదండీ. ఓ న‌టుడిగా సినిమాకీ, వెబ్ సిరీస్‌కీ పెద్ద తేడా అనిపించ‌లేదు. టెక్నికల్ ప‌రంగా మాత్రం అదో కొత్త అనుభ‌వం. ఓ క‌థ‌ని వీలైనంత వివ‌రంగా చెప్పే అవ‌కాశం వెబ్ సిరీస్ లో ఉంది.

సీజ‌న్స్ కూడా ప్లాన్ చేస్తున్నారా?

అవును. సీజ‌న్ 2, సీజ‌న్ 3 ఐడియాలు విక్రమ్ ద‌గ్గర ఉన్నాయి. సీజ‌న్ 1 హిట్టయితే.. త‌ప్పకుండా మ‌రో సీజ‌న్ తో ప్రేక్షకుల ముందుకు వ‌స్తాం.

విక్రమ్ చెప్పిన క‌థ‌లో మిమ్మల్ని అంత‌గా ఆక‌ట్టుకొన్న అంశాలేంటి?

నాకు ఐడియానే కొత్తగా అనిపించింది. ఇలాంటి సూపర్ నాచురల్ థ్రిల్లర్స్ తీయడంలో విక్రమ్ కుమార్ మాస్టర్. '13 బీ' అలాంటి క‌థే. మ‌నంలో కూడా కొంత వ‌ర‌కూ అలాంటి ఛాయ‌లు ఉంటాయి. దూత కూడా ప్రేక్షకులకు చాలా కొత్త అనుభవాన్ని ఇస్తుంది. ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటివరకూ రాలేదు. విక్రమ్ కుమార్ అద్భుతంగా తీశారు. నిర్మాత శరత్ మరార్ గారు ఎక్కడా రాజీపడకుండా చాలా గ్రాండ్ గా ఈ సిరీస్ ని నిర్మించారు. ఇప్పటి వరకు చూడని కొత్త లొకేషన్స్ లో షూట్ చేశాం. టెక్నికల్ గా సిరీస్ ఉన్నత స్థాయిలో వుంటుంది. ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ థ్రిల్ ఫీలౌతారు.

ఈమ‌ధ్య వెబ్ సిరీస్‌లు కుటుంబ స‌మేతంగా చూసేలా ఉండ‌డం లేదు. మ‌రి దూత‌ సంగ‌తేంటి?

ఈ సినిమాలో అస‌భ్యత ఏం ఉండ‌దండీ. కాకపొతే బ్లడ్ ఎక్కువగా ఉంటుంది. రక్తపాతం ఎక్కువ ఉంది కాబట్టే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. ఆ జాగ్రత్తలు తీసుకొన్నాం. #BHDNagaChaitanya

చందూ మొండేటి తో చేయబోతున్న 'తండేల్' సినిమా విష‌యాలేంటి?

చందూతో ఓ స్పెష‌ల్ ప్రాజెక్ట్ చేస్తున్నా. నేనే కాదు.. టీమ్ మొత్తం ఈ ప్రాజెక్ట్‌పై సూప‌ర్ కాన్సిడెన్స్‌గా ఉన్నాం. ఆరేడు నెల‌లుగా ఈ సినిమాతోనే ట్రావెల్ చేస్తున్నా. శ్రీకాకుళంలోని కె.మత్స్యలేశం గ్రామానికి వెళ్లాం. అక్కడ పరిస్థితులని దగ్గరుండి అర్ధం చేసుకున్నాం. వ‌ర్క్ షాప్‌లు కూడా నిర్వహించాం. అర‌వింద్ గారు కూడా ఈ ప్రాజెక్ట్ ని గ‌ట్టిగా న‌మ్మారు. #Thandel అన్ని విష‌యాల్లోనూ చాలా స‌పోర్ట్ చేస్తున్నారు. అర‌వింద్ గారు, బన్నీవాస్, టీం అంతా చాలా కేర్ తీసుకుంటున్నాం. చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం. ఇది నా కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా. చాలా పెద్ద కాన్వాస్, స్పాన్ వున్న కథ. ఈ సినిమా కోసం టీం అంతా చాలా ఎక్సయిటెడ్ గా ఎదురుచుస్తున్నాం. కథ రీత్యా కొంత భాగం ఇండియాలో కొంత భాగం పాకిస్తాన్ లో జరుగుతుంది. 'తండేల్' చిత్రం నా కెరీర్ లోనే సెన్సేషనల్ మూవీ అవుతుందని భావిస్తున్నాను.

ఇందులోని పాత్ర కోసం మీ శరీరాకృతి కూడా మార్చుకున్నట్టున్నారు ?

ఇందులో నాది బెస్తవాడి పాత్ర. అందుకే మేకోవర్ అయ్యాను. వాళ్ళ బాడీలాంగ్వేజ్ ఎలా ఉంటుందో అలా మారడానికి కొన్ని నెలల పాటు శ్రమించాల్సివచ్చింది.

వాళ్ళు నల్లగా ఉంటారు.. మీరేమో తెల్లగ మెరిసిపోతున్నారు?

ఏ వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని దర్శకుడు ఈ పాత్ర క్రియేట్ చేశాడో, ఆ వ్యక్తి నా కంటే తెల్లగా ఉంటాడు. అతన్ని నేను కలిశాను. మాట్లాడాను. కాబట్టి అలాంటి బాధేంలేదు. ఈ సినిమాకి సంబంధించి అన్ని విషయాల్లో చాలా కేర్ తీసుకుంటున్నాం.

శ్రీకాకుళం నేపధ్యంలో కథ అంటున్నారు. మరి యాస విషయంలో ఎలాంటి కృషి చేస్తున్నారు?

దానికోసం వర్క్ షాపులు నిర్వహించాం. ఆ యాసను ప్రాక్టీస్ చేస్తున్నాను కూడా. ఇందులో శ్రీకాకుళం యాస మాట్లాడతాను. ఈ సినిమాలో నా బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డిక్షన్ పెక్యులర్ గా డిజైన్ చేశాడు చందు మొండేటి. తను అనుకున్నట్టు తెరపై ఆవిష్కరించటానికి తగిన సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇందులో కొత్త నాగచైతన్యని చూస్తారు. (Srikakulam accent)

ఇదో ఫిష‌ర్‌మెన్ బ‌యోపిక్ అనుకోవొచ్చా?

బ‌యోపిక్ అన‌లేం కానీ, ఓ ఫిష‌ర్‌మెన్ జీవితంలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌ల్ని సినిమాటిక్ గా చెప్పబోతున్నాం. ఇందులో అద్భుతమైన అనుభూతిని పెంచే ప్రేమకథ వుంది. అక్కినేని అభిమానుల్నే కాక, అందరికీ నచ్చేలా ఈ సినిమా ఉండబోతుంది.

రెండోసారి సాయిపల్లవితో నటిస్తున్నారు కదా ?

అవునండీ..'లవ్ స్టొరీ' తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి నటిస్తున్నాం. తన వల్ల ఈ కథకు మరింత బలం చేకూరినట్టయింది. కథలో చాలా ముఖ్యమైన పాత్ర సాయిపల్లవిది. అద్భుతంగా నటించేందుకు అవకాశం వున్న పాత్ర. తన కెరీర్ లో కూడా ఇది చెప్పుకునే సినిమా అవుతుంది. (Sai Pallavi)

స్క్రిప్ట్ వర్క్ ఎందాకా వచ్చింది ?

పూర్తయింది. స్క్రిప్ట్ చాలా అద్భుతంగా వచ్చింది. డిసెంబర్ తొలివారం నుంచి మూడు నెలలపాటు రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఈ కథ, నా పాత్ర చదివిన తర్వాత ఎప్పుడెప్పుడు లొకేషన్ కి వెళ్తానా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

ఇటీవల కొంత మంది అనాధపిల్లలతో సమయం గడిపిన ఫోటోలు బయటికి వచ్చాయి.. దాని గురించి ?

సమయం దొరికినపుడల్లా రెగ్యులర్ గా సేవా కార్యక్రమాలు చేస్తూనే వుంటాను. కష్టంలో వున్న వారికి సాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా వుంటాను. అయితే చేసిన సాయాన్ని చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు.

ఇన్నేళ్ల కెరీర్ ఒక్కసారి విశ్లేషించుకొంటే ఏమనిపిస్తుంది?

ఇంకా చాలా చేయాలి. చాలా సాధించాలి. ఇంకా మంచి సినిమాలు, పాత్రలు చేయాలి. ఆర్టిస్ట్ గా ఇంకా ఎదగాలి. దాని కోసం నిరంతరంగా కృషి చేస్తూనే ఉంటాను. నా కెరీర్‌లో విజయాలు, అపజయాలు చూశాను. అన్నింటి నుంచీ ఏదో ఒక‌టి నేర్చుకొంటూనే ఉన్నా.

కొత్తగా ఒప్పుకొన్న ప్రాజెక్టులేంటి?

శివ‌నిర్వాణ‌తో ఓ సినిమా చేయాలి. మామ‌ధ్య చ‌ర్చలు జ‌రుగుతున్నాయి.

ఒకే అండీ. ఆల్ ది బెస్ట్

థ్యాంక్యూ

Updated Date - 2023-11-23T11:52:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!