Extra-Ordinary Man: ఇది జబర్దస్త్ కామెడీ కాదు, అందరూ ఎంజాయ్ చేస్తారు
ABN, First Publish Date - 2023-12-06T14:24:47+05:30
నితిన్, వక్కంతం వంశి కాంబినేషన్ లో వస్తున్న 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్' వినోదాత్మకంగా ఉంటుందని, ఇందులో కామెడీ కూడా సన్నివేశపరంగా ఉంటుంది అని చెప్పారు నితిన్
నితిన్ (Nithiin), శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్' #ExtraOrdinaryMan సినిమా ఈ డిసెంబర్ 8న విడుదలవుతోంది. వక్కంతం వంశీ (VakkanthamVamsi) దీనికి దర్శకుడు, నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, నితిన్ సిస్టర్ నికిత రెడ్డి నిర్మాతలు. ఇది పూర్తిగా ఎంటర్ టైనమెంట్ సినిమాగా తెరకెక్కుతోంది. ఇందులో నితిన్ ఒక జూనియర్ ఆర్టిస్టుగా వేస్తున్నాడు, కానీ అతని భాదక సాధకాలు చెప్పదలుచుకోలేదు, అందుకే అంతా సరదాగా సాగేటట్టు సినిమా ఉంటుందని చెపుతున్నాడు నితిన్.
ఇందులో రావు రమేష్ పాత్ర చాలా బాగుంటుందని, తనకి రావు రమేష్ కి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులని అలరిస్తాయని అంటున్నాడు నితిన్. అలాగే ట్రైలర్ చూపించినట్టుగానే సినిమా అంతా అలాగే ఉంటుందని చెప్పాడు. ఆలా అని ఈ సినిమాలో జబర్దస్త్ జోక్స్ ఏమీ పెట్టలేదని చెప్పాడు. "చాలామంది ఈ సినిమా ట్రైలర్ చూసి ఇలాంటి సెటైరికల్ కామెడీతో ఉంటుంది అని అనుకుంటున్నారు, అది నిజం కాదు. సినిమాలో కథా పరంగా, సన్నివేశ పరంగా వచ్చే కామెడీ ఉంటుంది. జబర్దస్త్ కామెడీ లా సినిమా ఉండదు, అందరూ హాయిగా చూసి నవ్వుకునేట్టు ఉంటుంది," అని చెప్పాడు నితిన్.
రాజశేఖర్ (Rajasekhar) పాత్ర ఈ కథ అనుకున్నప్పుడే అనుకున్నామని, అయితే అతను ఒప్పుకుంటారా లేదా అని మొదట్లో కొంచెం సంశయం ఉందని చెప్పాడు. కానీ తరువాత దర్శకుడు వక్కంతం రాజశేఖర్ గారికి కథ చెప్పగానే వెంటనే చేస్తాని అని చెప్పారని, అతని కుమార్తెలు ఇతను చెయ్యడానికి కారణం అని చెప్పాడు నితిన్. "రాజశేఖర్ డాటర్స్ ఇద్దరూ ఈ కథ విని, తమ ఫాదర్ ఈ సినిమా చేస్తే బాగుంటుంది అని రాజశేఖర్ గారిని ఈ సినిమా చెయ్యడానికి ఒప్పించారు. వాళ్ళకి అసలు థేంక్స్ చెప్పాలి," అని అన్నాడు నితిన్.
ట్రైలర్ చూపించినట్టుగా 'జీవిత' జోక్ బాగా హైలైట్ అయిందని అన్నప్పుడు, అది అప్పటికప్పుడు చెప్పిన డైలాగ్ అని అన్నాడు నితిన్. 'జీవితం చెప్పేది తప్ప, జీవితంలో ఎవరు ఏమి చెప్పినా వినను' అని రాజశేఖర్ అంటే 'జీవిత సర్' అనే డైలాగ్ ని నేను అప్పటికప్పుడు సహజంగా చెప్పాను. అది దర్శకుడికి, రాజశేఖర్ గారికి ఇద్దరికీ బాగా నచ్చింది. అదే హైలైట్ అయింది.
ఈ సినిమాలో కథ కూడా అంత గ్రేట్ అని ఏమీ చెప్పలేను, కానీ చిన్నగా కథ ఉంటుంది. ఆ కథ చుట్టూ ఎంటర్ టైనమెంట్ ఎక్కువ వుండే విధంగా మిగతా కథ అంతా నడుస్తూ ఉంటుంది, అని చెప్పాడు నితిన్. శ్రీలీల పాత్ర ఒక వ్యాపార దృక్పతంతో చేసే సినిమాలో కథానాయికల పాత్ర ఎలా ఉంటుందో ఈ సినిమాలో కూడా అలానే ఉంటుంది అని చెప్పారు నితిన్.
ఇలాంటి వినోదాత్మక చిత్రాలు విదేశీ మార్కెట్ లో బాగా నడుస్తాయని, అందుకని ఈసారి ఈ సినిమాని అమెరికాలో ప్రచారం బాగా చెయ్యాలని అనుకున్నాం అని, అందుకోసమే అమెరికా వెళుతున్నట్టు చెప్పాడు నితిన్. తన తదుపరి సినిమాల గురించి మాట్లాడుతూ అమెరికా నుండి వచ్చాక రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ చేస్తాను అని చెప్పాడు. దర్శకుడు వెంకీ కుడుములతో చేస్తున్న సినిమా షూటింగ్ కొంత భాగం అయిందని, అందులో శ్రీలీల పాత్ర బాగుటుంది అని చెప్పాడు. 'నేను ఈ 'ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్' లో బాగా కామెడీ చేస్తే, వెంకీ కుడుముల సినిమాలో శ్రీలీల చాల బాగా కామెడీ చేస్తుంది" అని చెప్పాడు నితిన్.
-- సురేష్ కవిరాయని