Vijayakanth: రియల్ హీరో విజయకాంత్ గురించి ఈ విషయాలు తెలుసా? కెప్టెన్ స్మృతిలో రాష్ట్రం
ABN, Publish Date - Dec 29 , 2023 | 04:35 PM
దివంగత విజయకాంత్ వెండితెరపైనే కాక నిజజీవితంలోనూ హీరోనే. విజయకాంత్ విలన్ పాత్రతోనే సినీకెరీర్‌ను ప్రారంభించారు. 1979లో ఎంఏ ఖాజా దర్శకత్వం వహించిన ‘ఇనిక్కుం ఇళమై’ చిత్రంతో ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమైంది. ఒక్కొక్కటిగా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ వచ్చిన విజయకాంత్.. ఆనక హీరోగా ఎదిగారు. విజయకాంత్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
దివంగత విజయకాంత్ వెండితెరపైనే కాక నిజజీవితంలోనూ హీరోనే. విజయకాంత్ విలన్ పాత్రతోనే సినీకెరీర్‌ను ప్రారంభించారు. 1979లో ఎంఏ ఖాజా దర్శకత్వం వహించిన ‘ఇనిక్కుం ఇళమై’ చిత్రంతో ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమైంది. ఒక్కొక్కటిగా వైవిధ్యమైన పాత్రలు చేస్తూ వచ్చిన విజయకాంత్.. ఆనక హీరోగా ఎదిగారు. ఆయన హీరోగా నటించిన ‘సట్టం ఒరు ఇరుట్టరై’ చిత్రం 1981లో విడుదలైంది. ఇది ఘన విజయం సాధించింది. ఇది ఆయన సినీ కెరీర్‌కు మైలురాయి. 1984 సంవత్సరంలో ఏకంగా 18 చిత్రాల్లో నటించారు. విజయకాంత్ అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్‌స్వామి. ఆ పేరుతో కలిసి రాలేదని జ్యోతిష్యుల సూచనల మేరకు విజయరాజ్‌లోని ‘రాజ్’ అనే పదాన్ని తొలగించి ‘కాంత్’ అని చేర్చుకున్నారు. అప్పటినుంచి ఆయన విజయకాంత్‌గా సినీప్రపంచంలో సుస్థిరస్థానం సంపాదించుకున్నారు. 1989లో వచ్చిన ‘సెంధూర పూవే’ (తెలుగులో సింధూర పువ్వు) దక్షిణాది భాషల్లో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ చిత్రంలో విజయకాంత్ (Vijayakanth) నటనకు తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం ఉత్తమ నటుడిగా అవార్డుతో సత్కరించింది. విజయకాంత్ నటించిన చిత్రాల్లో ప్రధానంగా దేశభక్తిని పెంచే డైలాగులు.. అవినీతి, అక్రమాలను అరికట్టే అంశాలు, సమాజ సందేశంతో కూడినవే అధికం. ఆయన 154 చిత్రాల్లో నటించారు. ఆయన పలు చిత్రాలను నిర్మించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు. చివరిగా ఆయన 2015లో రూపొందిన ‘సగప్తం’ చిత్రంలో నటించారు. ఆయన చిన్నకుమారుడు షణ్ముగ పాండ్యన్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో విజయకాంత్ అతిథిపాత్ర పోషించారు. ‘కెప్టెన్ సినీ క్రియేషన్స్’ పతాకంపై ఆయన తన బావమరిది ఎల్‌కే సుదీష్‌తో కలిసి 8 చిత్రాలను నిర్మించారు. 2010లో నిర్మితమైన ‘విరుదగిరి’ చిత్రానికి ఆయనే స్వయంగా దర్శకత్వం వహించారు. (Vijayakanth Movies)
సినిమా కెరీర్..
కేవలం తమిళ చిత్రపరిశ్రమకు (Kollywood) మాత్రమే పరిమితమైన అతికొద్దిమంది హీరోల్లో విజయకాంత్ ఒకరు. ఈయన 1979లో వచ్చిన ‘ఇనిక్కుమ్ ఇళమై’ ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఇదే యేడాది ‘అగల్ విలక్కు’, 1980లో ‘నీరోట్టం’, ‘చామంతిపూ’ వంటి చిత్రాల్లో నటించారు. వీటిలో ‘చామంతిపూ’ బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. 1980లో నటించిన ‘దూరత్తు ఇడి ముళక్కం’ చిత్రం ప్రశంసలు అందుకోవడమే కాకుండా ‘ఇండియన్ పనోరమ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’లో ప్రదర్శించారు. అయితే, 1981లో ఎస్‌ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘సట్టం ఒరు ఇరుట్టరై’తో విజయకాంత్ బలమైన హీరోగా అవతరించారు. ఈ సినిమా తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో రీమేక్ చేశారు. 1981లో విప్లవాత్మకమైన, ర్యాడికల్ భావజాలంతో కూడిన ‘సివప్పు పూ’, ‘జాదికొరు నీది’ వంటి చిత్రాల్లో నటించారు. ఈ రెండూ విజయ్‌కాంత్‌కు విప్లవాత్మకమైన పాత్రల్లో యాంగ్రీ యంగ్‌మేన్‌గా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత 1982లో ‘ఓంశక్తి’ అనే చిత్రంలో విలన్ పాత్ర పోషించారు. అక్కడ నుంచి కమర్షియల్, యాక్షన్, రొమాన్స్, సెంటిమెంట్ వంటి చిత్రాల్లో నటిస్తూ అగ్రహీరోగా ఎదిగారు. వీటిలో ‘నూరావదు నాల్’ (1984), ‘వైదేహి కాత్తిరుందాల్’ (1984) వంటి బ్లాక్‌బస్టర్ హిట్లు ఉన్నాయి. 1984లో ఆయన నటించిన చిత్రాలు ఏకంగా 18 విడుదలయ్యాయి. 1985లో ‘అన్నై భూమి’ అనే త్రీడి చిత్రంలో నటించారు. ఇందులో రాధారవి, కన్నడ నటుడు టైగర్ ప్రభాకర్ వంటి వారు కీలక పాత్రలను పోషించారు. కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్థన్‌తో కలిసి 1985లో ‘ఈటి’ అనే చిత్రంలో కలిసి నటించారు. 1985లో రొమాంటిక్ కామెడీ మూవీ ‘నానే రాజా నానే మందిరి’ నటించగా, ఇందులో స్వీయ కేంద్రీకృత అహంకార గ్రామీణ జమీందారు పాత్రలో కనిపించారు. అది కమర్షియల్ హిట్ సాధించింది. 1986లో వచ్చిన ‘అమ్మన్ కోయిల్ కిళక్కాలే’ చిత్రం ఫిల్మ్‌ఫేర్ అవార్డును దక్కించుకుంది. 1986లో హీరో కమల హాసన్‌తో కలిసి ‘మనకానక్కు’లో విజయకాంత్ నటించారు. వీరిద్దరు కలిసి నటించిన తొలి చిత్రం ఇదే. ఆ తర్వాత 1986లో కల్ట్ క్లాసికల్ మూవీ ‘ఊమై విళిగల్’లో నటించి అప్పటికే స్టార్ హోదాలో ఉన్న రజనీకాంత్, కమల హాసన్ వంటి వారికి గట్టి పోటీ ఇచ్చే హీరోగా అవతరించారు. మహానటుడు శివాజీ గణేశన్‌తో కలిసి ‘వీరపాండ్యన్’ అనే చిత్రలో నటించారు. అదేసమయంలో ‘కూలిక్కారన్’, ‘వీరన్ వేలుతంబి’, ‘నినైవే ఒరు సంగీతం’, ‘చట్టం ఒరు విలైయాట్టు’, ‘ఉళవన్ మగన్’ వంటి వరుస విజయవంతమైన చిత్రాల్లో నటించారు. 1989లో ‘సింధూర పువ్వే’ చిత్రానికి బెస్ట్ యాక్టర్‌గా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు వరించింది. అదే ఏడాది ‘పాట్టుక్కు ఒరు తలైవి’, క్రైమ్ మూవీ ‘రాజనడై’, ‘మీనాక్షి తిరువిలైయాడల్’ వంటి భక్తి చిత్రంలోనూ నటించారు.
1990-99 వరకు యాక్షన్ చిత్రాల్లో... (Vijayakanth Action Movies)
1990లో వచ్చిన ‘పులన్ విచారణై’ వంటి చిత్రం విజయకాంత్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో శరత్‌కుమార్ ప్రతినాయకుడి పాత్రను పోషించగా, ఆర్‌కె సెల్వమణి దర్శకత్వం వహించారు. ఆ రోజుల్లో బెస్ట్ క్రైం థ్రిల్లర్‌గా నిలిచింది. ఆ తర్వాత మణిరత్నం నిర్మాతగా తెరకెక్కిన ‘క్షత్రియన్’లో పోలీస్ అధికారి పాత్రలో విజయకాంత్ అద్భుతంగా నటించారు. ‘పులన్ విచారణై’ ఘన విజయంతో నిర్మాత రౌథర్ ‘కెప్టెన్ ప్రభాకరన్’ చిత్రాన్ని 1991లో నిర్మించారు. ఇది విజయకాంత్‌కు వందో చిత్రం. ఈ సినిమా తర్వాతే ఆయనకు ‘కెప్టెన్’ పేరు వచ్చింది. ఇందులో ఐఎఫ్ఎస్ అధికారిగా కనిపించారు. ఎంజీఆర్, శివాజీ గణేశన్, జయలలిత తర్వాత సిల్వర్ జూబ్లీ విజయాన్ని రుచిచూసిన హీరోగా విజయకాంత్ నిలిచారు. ఇది కమర్షియల్‌గా సూపర్ సక్సెస్ సాధించింది. ఆ తర్వాత ‘మా నగర కావల్’, ‘మూండ్రెళుత్తిల్ ఎన్ మూచ్చిరుక్కుం’, ‘చిన్న గౌండర్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలు ఉన్నారు. అలాగే, ‘భరతన్’, ‘తాయ్‌మొళి’, ‘సెంధూరపాండి’ వంటి చిత్రాల్లో నటించారు. విజయ్ నటించిన ‘సెంధూరపాండి’ చిత్రానికి ఎస్‌ఏ చంద్రశేఖర్ దర్శకత్వం వహించగా విజయకాంత్ కీలక పాత్ర పోషించారు. ఇందుకోసం ఆయన ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు.
2000-09 వరకు...
విక్రమన్ దర్శకత్వం వహించిన ‘వానత్తైపోల’ చిత్రంలో మరో సూపర్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు విజయకాంత్. ఆ తర్వాత ‘వల్లరసు’, సిమ్మాసనం’, 2001లో ‘వాంజినాథన్’, ‘షాజి కైలాస్, ‘నరసింహా’, ‘విశ్వనాథన్ రామ్మూర్తి’, ‘తవసి’.. 2002లో ‘దేవన్’, ‘రాజ్యం’, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ‘రమణ’.. 2003లో ‘చొక్కతంగం’, ‘తెన్నవన్’.. 2004లో ‘ఎంగల్ అన్న’, ‘గజేంద్ర’, ‘నెరంజ మనస్సు’.. 2006లో ‘సుదేశీ’, ‘పెరరసు’, ‘ధర్మపురి’.. 2007లో ‘శబరి’ వంటి చిత్రాల్లో నటించారు. 2008లో తన 150వ చిత్రంగా ‘అరసాంగం’లో నటించారు. 2009లో ‘మరియాదై’, విక్రమన్ దర్శకత్వంలో ‘ఎంగల్ ఆసాన్’ వంటి చిత్రాల్లో నటించారు.
నడిగర్ సంఘం కోసం... రజినీ ఇంట్లో నేలపై కూర్చున్న విజయకాంత్
అప్పుల్లో కూరుకుపోయిన నడిగర్ సంఘాన్ని గట్టెక్కించేందుకు స్టార్ నైట్ మ్యూజిక్ నిర్వహించేందుకు అప్పటి నడిగర్ సంఘం అధ్యక్షుడు విజయకాంత్ నిర్ణయించారు. నిధుల సేకరణ కోసం మలేసియా, సింగపూర్ దేశాల్లో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth)ను ఆహ్వానించేందుకు నడిగర్ సంఘం నిర్వాహకులతో కలసి విజయకాంత్ ఆయన ఇంటికెళ్లారు. అప్పుడు నేలపై కూర్చున్న విజయకాంత్ ‘అన్నా మీరు నిధుల సేకరణ కార్యక్రమాల్లో పాల్గొనాలి’ అని కోరారు. అందుకు తప్పకుండా వస్తానని హామీ ఇచ్చిన రజినీ... సోఫాపై కూర్చోవాలని ప్రేమతో కోరారు.
తీవ్ర అనారోగ్యంతోనే కన్నుమూత
డీఎండీకే కార్యకర్తలు, అభిమానులచే ‘కెప్టెన్’గా పిలిపించుకున్న విజయకాంత్ (Captain Vijayakanth) కొన్నేళ్లుగా అనారోగ్యం కారణంగా ఆయన తరచూ విదేశాలకు వెళ్లి చికిత్స పొందారు. ఈ నేపథ్యంలో, ఆయన సన్నిహితుల వద్ద ఆరా తీయగా.. కెప్టెన్‌కు మధుమేహం, థైరాయిడ్, కాలేయ సమస్యలున్నాయని.. మధుమేహం వల్ల ఆయన కాళ్లు, చేతి వేళ్లలో రక్తప్రసరణ ఆగిపోయిందని, కుడి కాలి వేళ్లలో కొన్నింటిని తొలగించారని తెలిపారు. వెన్నునొప్పి, థైరాయిడ్ సమస్యల కారణంగా గొంతు నొప్పితో బాధపడిన ఆయన, జ్ఞాపకశక్తి కూడా కోల్పోయారు. అదే విధంగా కుర్చీలో అరగంట సేపు కూడా కూర్చోలేని పరిస్థితి. ఈ కారణాల వల్ల కొన్ని నెలలుగా ఆయన్ని పలకరించేందుకు సినీ రాజకీయ ప్రముఖులు, స్నేహితులను కూడా అనుమతించలేదు. ఈనెల 18వ తేది మియాట్ ఆసుపత్రిలో శ్వాసకోశ సమస్యలకు అందించిన చికిత్సలతో కోలుకున్న ఆయన డిశ్చార్జి అయ్యారు. ఆ తర్వాత డీఎండీకే సర్వసభ్య సమావేశంలో కూడా పాల్గొన్నారు. మళ్లీ రెండు రోజుల క్రితం మియాట్‌లో చేరిన ఆయనకు కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. ఆ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో గురువారం ఉదయం ఆయన కన్నుమూశారు. కెప్టెన్ మృతితో తమిళ నాడు రాష్ట్రం అంతా ఆయన స్మృతిలో నిండిపోయింది.
ఇవి కూడా చదవండి:
====================
*Hansika: హన్సిక 105 నిమిషాలతో రెడీ అవుతోంది.. ఈసారి ఏం చేస్తుందో?
*************************
*Alphonse Puthren: విజయకాంత్‌ని హత్య చేశారు.. దర్శకుడు సంచలన వ్యాఖ్యలు
**************************
*Chiranjeevi: ‘నేను’గా.. మనందరి బ్రహ్మానందం!
****************************
*Rajinikanth: రజినీకాంత్‌పై వరద బాధితుల అసహనం!
*****************************