Kangana Ranaut: అది నా వల్ల కాదు.. జ్యోతికపై బాలీవుడ్ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-02-15T10:16:26+05:30
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కెరీర్ టాప్ గేర్‌లో వెళుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు బాలీవుడ్ చిత్రాలు చేస్తూనే..
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ (Kangana Ranaut) కెరీర్ టాప్ గేర్‌లో వెళుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు బాలీవుడ్ చిత్రాలు చేస్తూనే.. మరో వైపు ఇతర భాషా చిత్రాల్లోనూ నటిస్తూ దూసుకుపోతోంది. ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు, ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ టాప్ హీరోయిన్గా సాగుతోంది. కొన్నేళ్ల క్రితం ఈ బ్యూటీ తమిళంలో ‘తలైవి’ అనే సినిమాలో నటించింది. తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా మరో తమిళ సినిమా ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2)లో ఈ భామ నటించనుంది. 2005లో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమాకి ఇది సీక్వెల్.
ఇది కూడా చదవండి: Kangana Ranaut: నవాజుద్దీన్‌ని చూస్తే ఏడుపు వస్తోంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఫైర్‌బ్రాండ్
ఈ మూవీ గురించి ఓ ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడింది. ‘చంద్రముఖి’ చిత్రంలో నటి జ్యోతిక (Jyothika) నటన సాటిలేదని ఆమెకు ధీటుగా నటించడం సాధ్యం కాదని కంగన స్పష్టం చేసింది. చంద్రముఖిగా జ్యోతిక అద్భుతంగా నటించారని, ఆ స్థాయికి తన నటన ఉండదని తెలిపింది. సీనియర్ దర్శకుడు పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో.. రాఘవ లారెన్స్‌తో పాటు కంగనా రనౌత్, వడివేలు తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో చంద్రముఖిగా నటించేందుకు జ్యోతిక నిరాకరించడంతో ఆమె స్థానంలో కంగనాను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనిపై కంగనా స్పందిస్తూ.. ‘జ్యోతిక స్థాయిలో నటించడం కష్టం. ఆమె నటనకు ధీటుగా నటించడం సాధ్యంకాదు’ అని చెప్పింది. కాగా, ఈ చిత్రంలోని పాటల చిత్రీకరణ కోసం నృత్య దర్శకురాలు కళా మాస్టర్‌తో కలిసి కంగనా డ్యాన్స్ రిహార్సల్ చేస్తున్నారు.