The elephant whisperer: ఇచ్చినట్లే ఇచ్చి లాక్కున్న భావన కలిగింది!
ABN, First Publish Date - 2023-03-18T11:14:34+05:30
95వ ఆస్కార్ అవార్డ్ (Oscar 95) వేడుకల్లో భారదేశానికి రెండు ఆస్కార్ పురస్కారాలు దక్కడంతో దేశవ్యాప్తంగా సినీ అభిమానులు సంబరాలు జరుపుకొంటున్నారు.
95వ ఆస్కార్ అవార్డ్ (Oscar 95) వేడుకల్లో భారదేశానికి రెండు ఆస్కార్ పురస్కారాలు దక్కడంతో దేశవ్యాప్తంగా సినీ అభిమానులు సంబరాలు జరుపుకొంటున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు’, బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ (The Elephant Whisperers) ఆస్కార్ అందుకున్న సంగతి తెలిసిందే! ఈ లఘు చిత్రానికి దర్శకత్వం వహించిన కార్తికి గోన్సాల్వెన్స్(Kartiki Gonsalves), నిర్మాత గునీత్ మోంగా (Guneet Monga) వేదికపై పురస్కారం అందుకుని ఎంతో సంబరపడ్డారు. అయితే అకాడమీ చర్యల వల్ల ఆ ఆనందం కాసేపు కూడా లేకుండా పోయిందని, వేదికపై చేదు అనుభవం ఎదరైందని గునీత్ మోంగాకు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్కార్ అందుకుని ఇండియా చేరుకున్న గునీత్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు.
‘‘ఇండియన్ ప్రొడక్షన్ (First Oscar for Indian production) కంపెనీకి మొదటిసారిగా దక్కిన పురస్కారమిది. దేశానికి వచ్చిన ఈ పురస్కారం గురించి వేదికపై ఎంతో మాట్లాడాలనుకున్నా. కానీ కుదరనిదవ్వలేదు. ఆస్కార్ వేదికపై అవార్డు అందుకున్న తర్వాత ఎవరికైనా 45 సెకన్లు మాట్లాడే అవకాశం ఉంటుంది. అంతకు మించి ఎక్కువ సమయం ఎవరైనా మాట్లాడితే వెంటనే ఆ స్పీచ్‌ను కట్ చేసి మ్యూజిక్ ప్లే చేస్తారు. అయితే నేను మాట్లాడడం మొదలుపెట్టక ముందే మ్యూజిక్ ప్లే చేశారు. నేను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పకుండా స్టేజ్ దిగాల్సి వచ్చింది. అంత పెద్ద వేదికపై ఇండియాకు దక్కిని గౌరవాన్ని, గొప్ప క్షణాలను ఇచ్చినట్లే ఇచ్చి నా దగ్గరి నుంచి లాక్కున్నట్లు అనిపించింది. ఆ ఆనందాన్ని క్షణాల్లో తీసేసుకున్న భావన కలిగింది. మా తర్వాత బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ పురస్కారాన్ని అందుకున్న వారు 45 సెకన్ల కన్నా కాస్త ఎక్కువే మాట్లాడారు. వారికి ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అది సరైన పద్థతి అనిపించలేదు’’ అని గునీత్ ఆవేదన వ్యక్తం చేశారు. (India’s moment, taken away from me - Guneet Monga)