Tamil actor Santhanam: అదొక తలనొప్పి, క్రియేటివిటీ దెబ్బతింటుంది దానివల్ల
ABN, First Publish Date - 2023-08-12T18:22:44+05:30
తమిళ కమెడియన్, క్యారెక్టర్ నటుడు సంతానం ఇప్పుడు తన తమిళ సినిమా 'డిడి రిటర్న్స్' ని తెలుగులో విడుదల చేస్తున్నాడు. ఇది తమిళంలో విడుదలై ఘన విజయం సాధించింది. ఇదొక హర్రర్ కామెడీ. ఈ సినిమా గురించి, అలాగే సంతానం నిర్మాతగా ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో కూడా చెప్పాడు.
తమిళ కమెడియన్, క్యారెక్టర్ నటుడు సంతానం (Santhanam) తెలుగు ప్రేక్షకులకి సూర్య (Suriya) నటించిన 'సింగం' (Singham) సినిమాతో పరిచయమే. అతని సినిమాలు ఎక్కువ తెలుగులో విడుదల కాలేదు కానీ, ఇప్పుడు సంతానం తెలుగు ప్రేక్షకులకి చేరువ అవ్వాలని చూస్తున్నాడు. అందుకే తమిళంలో హిట్ అయిన అతని సినిమా 'డిడి రిటర్న్స్' #DDReturns తెలుగులో 'భూతల బంగ్లా' (DD Returns Bhutala Bangla) గా విడుదలవుతోంది. ఇందులో సంతానం కథానాయకుడిగా, సురభి (Surbhi) అతనికి జోడీగా నటించింది. ఈ సినిమా ఒక హర్రర్ కామెడీ సినిమా. దీనికి ఎస్ ప్రేమానంద్ (SPremanand) దర్శకుడు.
అయితే తమిళ సినిమాలో సంతానం కథానాయకుడిగా చేసిన మొదటి అయిదారు సినిమాలకి అతనే నిర్మాత. ఆ తరువాత అతను నిర్మాతగా కాకుండా కేవలం కథానాయకుడిగా మాత్రమే దృష్టి సారించాడు. ఎందుకు ప్రొడక్షన్ నుండి తప్పుకున్నారు అని సంతానంని చిత్రజ్యోతి అడిగినప్పుడు, "ప్రొడక్షన్ చెయ్యడం తలనొప్పి. ఎందుకంటే ప్రతి రోజు పెట్రోల్ దగ్గర నుండి, చిన్నచిన్న వస్తువులు వరకు ఒక పెద్ద లిస్ట్ చెపుతూ వుంటారు. అదీ కాకుండా ఈరోజు సాయంత్రం అయిదు గంటల వరకే షూటింగ్ కి పెర్మిషన్ ఇచ్చారు అంటే, దానికి తగ్గట్టుగా తొందర తొందరగా సన్నివేశాలను చేసెయ్యాలి. ప్రొడక్షన్ కూడా నేనే చేసుకుంటే, క్రియేటివిటీ దెబ్బతింటోంది. నటన మీద దృష్టి కాకుండా ప్రొడక్షన్ మీదకి దృష్టి వెళ్ళిపోతుంది, అందుకని నిర్మాతగా చెయ్యడం పక్కన పెట్టాను," అని చెప్పాడు.
డబ్బు విషయం ఎంత వచ్చింది, ఎంత పోయింది అన్న విషయం పక్కన పెడితే కేవలం రెండూ చెయ్యడం కష్టం, నటన మీదే దృష్టి పెట్టాలన్న ఏకైక వుద్దేశంతోటే నిర్మాతగా తప్పుకున్నాను అని చెప్పాడు సంతానం. అలాగే తాను ప్రతి ఏడాది ఒక సినిమా లీడ్ యాక్టర్ గా చేస్తున్నాడు, అది కూడా కావాలనే చేస్తున్నాడా అంటే, "ఒక సినిమా నేను చేసి, మిగతా లీడ్ యాక్టర్ల సినిమాలలో ఒక సపోర్టింగ్ రోల్, లేదా కమెడియన్ పాత్ర వుంది అంటే అది కూడా చేస్తున్నాను. ఇప్పుడు అంతా పాన్ ఇండియా సినిమాలే కదా, అందుకని ఆ సినిమాల్లో కూడా నటిస్తున్నాను," అని చెప్పాడు. అయితే రానున్న రోజుల్లో నాలుగైదు పెద్ద నిర్మాతలు తనకి ఆఫర్ ఇచ్చి, కథలు రెడీ చేశారని అందుకని ఇంకా ఎక్కువ సినిమా లీడ్ యాక్టర్ గా చేస్తాను అని చెప్పాడు సంతానం. ఈ సినిమాని తెలుగులో సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాళ్ళు తీసుకు వస్తున్నారు.